ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చి కెసిఆర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీని గద్దె దించటానికి ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్న తరుణంలో, దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ ప్రత్యేకంగా కెసిఆర్ తో మాట్లాడటం కోసమే హైదరాబాద్ రావడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి దేశంలోని అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని అఖిలేష్ యాదవ్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అయితే అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని విపక్ష కూటమిలో భాగంగా ఉన్నారు. కాంగ్రెస్ కూడా బిజెపిని గద్దెదించాలనే అందరి లక్ష్యం కోసమే పోరాడుతున్నదని ఆయన కితాబు ఇస్తున్నారు. మరోవైపు కేసీఆర్ తో మంతనాలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలు గమనించినప్పుడు ‘అఖిలేష్ తో భేటీ’ అనేది భారాస వ్యూహాల మీద ప్రజల్లో అనుమానాలు పెంచదా? అని అభిప్రాయం కలుగుతోంది.
జాతీయస్థాయిలో విపక్షాలను అన్నింటినీ కూడగట్టాలని కెసిఆర్ తొలుత చాలా వరకు ప్రయత్నించారు చాలా రాష్ట్రాల తిరిగి ఆయా పార్టీల నాయకులతో వరుస భేటీలు నిర్వహించారు. కానీ ఆయన ప్రయత్నాల పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అయిన వారు తక్కువ. బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీలనూ సమాన దూరంలో పెట్టాలనే నినాదంతోనే కేసీఆర్ ఈ ప్రయత్నాలు చేయడమే అందుకు కారణం.
కాంగ్రెస్ కూడా కూటమిలో ఉండాల్సిందే, కాంగ్రెస్ సారథ్యం వహించాల్సిందే అనే అభిప్రాయానికే ఎక్కువ మంది విలువ ఇచ్చారు. దీంతో.. తన ఆలోచనలకు విలువ దక్కడం లేదనే ఉద్దేశంతో కేసీఆర్ ఏకంగా తన పార్టీనే జాతీయ పార్టీగా మార్చేశారు.
అయితే, భారాస అనేది భాజపాకు బి-టీమ్ అనే కాంగ్రెస్ ఆరోపణలను నమ్ముతున్నట్టుగా విపక్ష కూటమి భారాసను దూరంపెట్టింది. పాట్నా సమావేశానికి కనీసం ఆహ్వానించలేదు. భారాసను ఆహ్వానించవద్దని తామే కూటమికి కండిషన్ పెట్టాం అంటూ రాహుల్ గాంధీ ఖమ్మం సభలో ప్రకటించారు. బి-టీమ్ ఆరోపణలను భారాసపై మరోసారి వినిపిస్తూ.. కేసీఆర్ వస్తే గనుక.. కూటమి భేటీకి తాము హాజరు కాబోం అని హెచ్చరించినట్టు రాహుల్ చెప్పారు.
కేసీఆర్ ను ఒంటరిచేయాలని అంత తీవ్రంగా అనుకుంటున్నట్టుగా ఆయన వెల్లడించారు. అయితే.. అదే విపక్ష కూటమిలో ఒక కీలక భాగస్వామి అయిన సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ కేసీఆర్ ను కలవడం చర్చనీయాంశం అయింది.
ఈ నాయకులు భేటీ తర్వాత ఎలాంటి ప్రకటన చేయలేదు. భేటీ అంశాలు ఇలా ప్రజలకు వెల్లడించకపోవడం వల్ల భారాసకే నష్టం. కాంగ్రెస్ నేతృత్వంలోని జట్టులోకి రావడానికి కేసీఆర్ ఒప్పుకున్నారా? లేదా? అనేది తెలంగాణ ప్రజలకు తెలియాలి. దాన్ని బట్టి.. అసెంబ్లీ ఎన్నికల్లో తమ నిర్ణయాన్ని వారు తీసుకోవాల్సి ఉంటుంది.
ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో పునరధికారం కోసం కాంగ్రెస్ ను విపరీతంగా తిడుతూ.. జాతీయ రాజకీయాల్లో కూటమిలోకి వెళ్లడానికి కేసీఆర్ అంగీకరించి ఉంటే.. అంతా లోపాయికారీ వ్యవహారాలుగా ప్రజలు భావిస్తారు. అందుకే కేసీఆర్ ఈ భేటీ అంశాల గురించి పెదవివిప్పి మాట్లాడకపోతే ప్రజలకు అనుమానాలు కలుగుతాయి.