షాకింగ్.. ఏజెంట్ మూవీ ఓటీటీలోకి ఇక రాదా?

అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ ఓటీటీలోకి రాదా? ఇన్ని రోజులైనా ఇంకా ఎందుకు ఈ సినిమా రాలేదు? మళ్లీ ఎడిటింగ్ చేసి కొత్త వెర్షన్ రెడీ చేస్తున్నారంటూ ఇన్నాళ్లూ అనుకున్నారు చాలామంది. ఓటీటీలో…

అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ ఓటీటీలోకి రాదా? ఇన్ని రోజులైనా ఇంకా ఎందుకు ఈ సినిమా రాలేదు? మళ్లీ ఎడిటింగ్ చేసి కొత్త వెర్షన్ రెడీ చేస్తున్నారంటూ ఇన్నాళ్లూ అనుకున్నారు చాలామంది. ఓటీటీలో ఏజెంట్ ను కొత్తగా చూడొచ్చని సంబర పడ్డారు అక్కినేని ఫ్యాన్స్.

అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. స్వయంగా నిర్మాత అనీల్ సుంకర, ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ పై ప్రకటన చేశారు. రీ-ఎడిట్ లాంటివేం జరగడం లేదని స్పష్టంచేశారాయన.

“ఓటీటీ కోసం కొత్తగా ఎడిటింగ్ ఎక్కడ్నుంచి చేస్తారు? మేమిచ్చిందే చేయాలి. ఎడిటింగ్ వాళ్లు చేయాలంటే కంటెంట్ మేం ఇవ్వాలి కదా. మేం సినిమా కంటెంట్ మాత్రమే ఇస్తాం. రష్ మొత్తం ఇవ్వం కదా. అలాంటప్పుడు కొత్తగా ఎడిటింగ్ ఏం చేస్తారు వాళ్లు.”

ఏజెంట్ సినిమా ఓటీటీలోకి రావడానికి ఎందుకు ఆలస్యమౌతుందో తనకు తెలియదన్నారు అనీల్ సుంకర. సినిమాను తను ఆల్రెడీ అమ్మేశాను కాబట్టి, అది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనే అంశంతో తనకు సంబంధం లేదని అన్నారు. మరోవైపు ఏజెంట్ ఫ్లాప్ అయిన సందర్భంగా తను పెట్టిన వివాదాస్పద ట్వీట్ పై కూడా సుంకర స్పందించారు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లి తప్పు చేశాననే తన ట్వీట్ ను సమర్థించుకున్నారు.

“రిలీజ్ రోజు నుంచి ఆ ట్వీట్ పెడదామని అనుకున్నాను. అదేదో అనుకోకుండా పెట్టింది కాదు. కావాలనే పెట్టాను. నిజంగా సురేందర్ రెడ్డిని బ్లేమ్ చేయాలనుకుంటే నేను ట్వీట్ చేయను. మీడియాలో క్యాజువల్ గా చెబితే చాలు, అది ఆటోమేటిగ్గా వైరల్ అయిపోతుంది. కాబట్టి నాకు సురేందర్ రెడ్డి మీద కోపం లేదు. ఇప్పటికీ టచ్ లో ఉన్నాను. కావాలంటే నా ఫోన్ చూపిస్తాను. ఒక్కటే చెప్పదలుచుకున్నాను. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లాం. ఈ విషయంలో మా అందరిదీ తప్పుంది.”

ఏజెంట్ తో నష్టపోయిన బయ్యర్లందరినీ వివిధ రూపాల్లో ఆదుకుంటానని హామీ ఇచ్చారు సుంకర. సామజవరగమన సినిమాను చాలామంది తన బయ్యర్లే రిలీజ్ చేశారని, త్వరలోనే రాబోతున్న భైరవకోన సినిమాను కూడా ఏజెంట్ డిస్ట్రిబ్యూటర్లే రిలీజ్ చేస్తారని చెప్పారు. డబ్బులు పోయినందుకు తనకు బాధ లేదని, హీరోకు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ మాత్రం ఉందన్నారు.