ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కనీసం 24 గంటలు కూడా తన మాట మీద నిలబడలేక పోయారు. బీసీ ముఖ్యమంత్రిపై తానన్న మాటలను వక్రీకరించారని ఆయన యూటర్న్ తీసుకోవడం గమనార్హం.
వీర్రాజు తన పొలిటికల్ స్టాండ్‌పై పిల్లిమొగ్గలు వేయడంతో … బీజేపీలోని వీర్రాజు వ్యతిరేకులు అంతర్గంగా ఆయనపై మండిపడుతున్నారు. బీసీల్లో అనవసరంగా వ్యతిరేకత పెరగడానికి వీర్రాజు మాటలు కారణమయ్యాయంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నిన్న విజయవాడలో సోము వీర్రాజు సమక్షంలో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ వర్గీయులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి వీర్రాజు మాట్లాడుతూ …”ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ -జనసేన కూటమి అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి తీరుతాం. కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీ అలా చేయగలవా? (సవాల్ ). రాష్ట్రం దిశ దశ మార్చాలంటే కుటుంబ పార్టీలే అడ్డంకి” అని వీర్రాజు వీరావేశంతో ప్రసంగించారు.
దీంతో పవన్‌కల్యాణ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెక్ పెట్టారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరోజు కూడా గడవకనే వీర్రాజు మాట మార్చారు.
నేడు ఆయన ఏమన్నారంటే… “బీసీని సీఎం చేస్తానని నేను ఎప్పుడూ చెప్పలేదు. కొందరు నా మాటలను అలా వక్రీకరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, మా మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కలిసి సీఎం ఎవరనేది నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి గురించి ప్రకటన చేసే అధికారం నాకు లేదు” అని చెప్పుకొచ్చారు.
సోము వీర్రాజు తరచూ మాట మార్చడం ఓ అలవాటైందనే విమర్శలున్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో తమ పార్టీనే పోటీ చేస్తుందని, మిత్రపక్షమైన జనసేన మద్దతు ఇస్తుందని ప్రకటించి, ఆ తర్వాత ఇప్పుడు మాదిరే మాట మార్చారు.
ఏకపక్షంగా పోటీపై ప్రకటన చేయడంతో జనసేన నేతలు ఆగ్రహించారు. దీంతో ఆయన మాట మార్చారు. తాను అలా అనలేదని, బీజేపీ -జనసేన ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉంటారని, అయితే అభ్యర్థి ఎవరనేది కలిసి నిర్ణయిస్తామని ప్రకటించారు.
ఇప్పుడు కూడా జనసేనాని పవన్‌ను ఇరకాటంలో పెట్టేందుకే వీర్రాజు ఉద్దేశపూర్వకంగానే బీసీ అభ్యర్థిపై ప్రకటన చేశారని జనసేన నేతలు, కార్యకర్తలు అనుమానిస్తున్నారు. దీంతో మిత్రపక్ష ఆగ్రహాన్ని గ్రహించిన వీర్రాజు తనకు అలవాటైన యూటర్న్ బాట పట్టారని జనసేన శ్రేణులు ఆరోపిస్తుండడం గమనార్హం.