జయలలిత చనిపోయి ఏ లోకాన ఉందో కానీ.. తన పేరుతో తమిళనాడులో జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు చూసి ఆమె కచ్చితంగా దిగులు చెందుతూనే ఉంటుంది. కనీసం ఆమె సమాధిని కూడా వదలకుండా రాజకీయాలకు కేంద్రబిందువుని చేశాయి వైరిపక్షాలు.
జయ నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదలై ప్రస్తుతం కర్నాటకలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈనెల 7న చెన్నైకి తిరిగి రావాలనేది ఆమె ఆలోచన. వస్తూ వస్తూనే జయలలిత సమాధి వద్దకు వెళ్లి.. గతంలో చెయ్యెత్తి శపథం చేసినట్టుగానే ఈసారి కూడా ఓ సిగ్నేచర్ స్టిల్ ఇచ్చేసి, “వచ్చేసింది మీ చిన్నమ్మ, ఇక మీకు దిగులు లేదు” అని తమిళ ప్రజలకు చెప్పాలనేది ఆమె ప్లాన్.
అయితే శశికళ అంటేనే భయంతో వణికిపోతున్నారు పళని, పన్నీర్. పైకి గంభీరంగానే ఉన్నా.. పార్టీని ఆమె చేజిక్కించుకుంటే తమ పరిస్థితి ఏంటా అని ఆందోళనలో పడ్డారు. పార్టీ నుంచి గెంటేసినా కూడా ఇప్పటికీ పార్టీలోని చాలామందిపై ఆమెకు పట్టుంది, పాత పరిచయాలు తిరగదోడి రచ్చ రచ్చ చేస్తే, ఓఎస్, పీఎస్ ఇద్దరికీ మూడినట్టే.
అందుకే శశికళ, జయలలిత సమాధి వద్ద ఆడాలనుకున్న డ్రామాకు వారు చెక్ పెట్టేశారు. జయలలిత సమాధి రెనొవేషన్ పనులంటూ 15 రోజుల పాటు మరమ్మతులకు కేటాయించారు. తుదిమెరుగులద్దాలంటూ 15 రోజుల పాటు ఎవరికీ ప్రవేశం లేదని ప్రభుత్వం తరపున ప్రకటన ఇచ్చేశారు. మరి శశికళ ఊరుకుంటుందో, సమాధి ముందు సవాళ్లు విసురుతుందో చూడాలి. శశికళను అడ్డుకంటే, అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేస్తే ఆమెకు మరింత సింపతీ వెళ్తుందేమోనన్న అనుమానం కూడా ఓఎస్, పీఎస్ లలో ఉంది.
జెండా.. అజెండా..
శశికళ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చే సమయంలో బెంగళూరులో పెద్ద హంగామానే నడిచింది. వందలాది కార్లతో ఆమెకు స్వాగతం పలికారు అభిమానులు. ఆస్పత్రి నుంచి ఆమె ఉంటున్న ఫామ్ హౌస్ వరకు పెద్ద కాన్వాయ్ లాగా సాగింది ర్యాలీ.
ఇక్కడ విశేషం ఏంటంటే.. శశికళ కారుపై అన్నాడీఎంకే గుర్తు ఉండటం. గుర్తుపై ఇంకా న్యాయపోరాటం జరుగుతుంది కానీ, దాన్ని తాము వదిలిపెట్టలేదనడానికి గుర్తుగా శశికళ ఆ గుర్తుని వాడేసుకున్నారనమాట. దీంతో ఇటు అన్నాడీఎంకేలోని శశి వ్యతిరేక వర్గం రగిలిపోతోంది.
జెండా ఆమె చేతిలోకి వెళ్తే, అది మరింత ప్రమాదమనే భావనలో ఉన్న వైరి వర్గాలు.. తమ జెండా వాడకుండా చిన్నమ్మను కట్టడి చేయాలంటూ పార్టీ ప్రిసీడియం చైర్మన్, కన్వీనర్లు, ఇతర నేతలు డీజీపీని కలసి కోరారు. తమ పార్టీకి సంబంధంలేని వారు తమ జెండాను ఉపయోగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అన్నాడీఎంకే పార్టీ జెండా ఉపయోగించే అర్హత, తమ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే ఉందని అన్నారు. ప్రస్తుతం పార్టీ పళనిస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలో ఉందని, వారికే పార్టీపై, జెండాపై హక్కు ఉందని అంటున్నారు.
మొత్తమ్మీద జైలు నుంచి విడుదలైన చిన్నమ్మ.. ఓఎస్, పీఎస్ ఇద్దరికీ వణుకు పుట్టిస్తోందనే విషయం అర్థమైంది. ఫిబ్రవరి-7 చెన్నైలో అసలు సిసలు రాజకీయ డ్రామా మొదలు కాబోతోంది. జయ వారసురాలిగా శశికళ చక్రం తిప్పుతారా? లేక ఆమెకు పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చి బీజేపీతో అంటకాగుతూ అన్నాడీఎంకేపై పళని, పన్నీర్ వర్గం పట్టు నిలుపుకుంటుందా? వేచి చూడాలి.