అబ్కీ బార్ ట్రంప్ స‌ర్కార్ అన్న‌ప్పుడు ఇది గుర్తుకు రాలేదా?

భార‌త్ లో జ‌రుగుతున్న వ్య‌వ‌సాయదారుల ఉద్య‌మంపై ఎవ‌రో మ‌న‌కు పెద్ద‌గా తెలియ‌ని పాప్ గాయ‌కులు, పోర్న్ స్టార్లు స్పందించ‌డంపై కొంత‌మంది గ‌గ్గోలు పెడుతూ ఉన్నారు. ఈ విష‌యంలో స్పందించేసి కేంద్ర ప్ర‌భుత్వం దృష్టిలో మంచి…

భార‌త్ లో జ‌రుగుతున్న వ్య‌వ‌సాయదారుల ఉద్య‌మంపై ఎవ‌రో మ‌న‌కు పెద్ద‌గా తెలియ‌ని పాప్ గాయ‌కులు, పోర్న్ స్టార్లు స్పందించ‌డంపై కొంత‌మంది గ‌గ్గోలు పెడుతూ ఉన్నారు. ఈ విష‌యంలో స్పందించేసి కేంద్ర ప్ర‌భుత్వం దృష్టిలో మంచి వాళ్లు కావ‌డానికి స‌చిన్ టెండూల్క‌ర్ తో స‌హా చాలా మంది సెల‌బ్రిటీలు తెగ ఇదైపోతున్నారు.

వీళ్లంతా రంగంలోకి దిగే స‌రికి త‌మ బోటి వాళ్ల‌కు ఉన్న గుర్తింపు పోతుందేమో అని కంగ‌నా రనౌత్ కంగారు ప‌డుతున్న‌ట్టుగా ఉంది. ఇన్నాళ్లూ త‌నొక్క‌తే వీరంగం ఆడేది. ఇప్పుడు వీళ్లంతా శ‌ర‌భ‌..శ‌ర‌భ‌.. అంటూ క‌దం తొక్కేస‌రికి కంగ‌నాకే చిక్కు వ‌చ్చిన‌ట్టుంది. అందుకే వీళ్ల‌ను చాకిరేవు ద‌గ్గ‌ర కుక్క‌లు అనేసింది!

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఈ సెల‌బ్రిటీ మేధావులు, సెలబ్రిటీలు అయినందున మేధావులు అయిన వారి వీరంగాలు చూస్తే వేరేవి గుర్తుకు వ‌స్తాయి. సూది కోసం సోది కెళ్తే..అదేదో బ‌య‌ట‌ప‌డింద‌న్న‌ట్టుగా.. విదేశీయుల మ‌న వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌డాన్ని వీళ్లు తెగ ఆక్షేపిస్తున్న త‌రుణంలో.. మ‌నం విదేశీ వ్య‌వ‌హారాల్లోకి జోక్యం చేసుకోవ‌డం కూడా గుర్తుకు వ‌స్తే త‌ప్పు మ‌న‌ది కాక‌పోవ‌చ్చు!

గ‌తంలో వికిలీక్స్ వ్య‌వ‌హారంలో భార‌తీయ పేప‌ర్లు వంద‌ల‌, వేల వ్యాసాలు రాశాయి. అమెరిక‌న్ ప్ర‌భుత్వ విధానాల వివ‌రాల‌ను చెబుతూ కూసాలు క‌దిలించిన అసాంజ్ కు మ‌ద్ద‌తుగా భార‌త్ లో అప్ప‌ట్లో పెద్ద ఉద్య‌మ‌మే న‌డిచింది. ఇక ఎడ్వ‌ర్డ్ స్నోడెన్ కు కూడా ఇండియాలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇలాంటి వ్య‌వ‌హారాల‌న్నింటికీ మ‌నం మ‌ద్ద‌తు ప‌లికాం. అంత వ‌ర‌కూ ఎందుకు.. ట్రంప్ మ‌ద్ద‌తుదారులు వాషింగ్ట‌న్ లో వీరంగం  సృష్టిస్తే.. ప్ర‌జాస్వామ్య విలువ‌ల గురించి మ‌నం మాట్లాడుకున్నాం గంట‌ల కొద్దీ!

ఇవ‌న్నీ మ‌నం మాట్లాడుకునే సోది క‌బుర్లు అంటారా? స‌రే.. అస‌లు విష‌యం శ్రీమాన్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ గారు.. అమెరికాకు వెళ్లి   'అబ్కీ బార్ ట్రంప్ స‌ర్ కార్..'  నినాదంతో తన మిత్రుడిని రంజింప‌జేయ‌లేదంటారా? అది అబ‌ద్ధమా? నేష‌న‌లిస్టులు ఆ నినాదాన్ని ఇస్తుండ‌గా.. మోడీ వారిని ఉత్సాహ‌ప‌రిచారు క‌దా!

ఒక దేశానికి వెళ్లి.. విదేశాంగ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకుంటే అది బాధ్య‌త‌. కానీ అక్క‌డ ఏ ప్ర‌భుత్వం ఉంటే మ‌న‌కెందుకు? అక్క‌డ ఎవ‌డి స‌ర్కారు ఉంటే మ‌న‌కెందుకు! మ‌న దేశ ప్ర‌ధాని ఎవ‌రైనా వెళ్లి అలా విదేశాల్లో వాళ్ల ప్ర‌భుత్వం ఏర్ప‌డాలి, వీళ్ల ప్ర‌భుత్వం ఏర్ప‌డాలి అని పిలిచిన చ‌రిత్ర ఉందా? అదా మ‌న  విధానం?  మ‌న నేష‌న‌లిస్టులు విదేశాల్లో రాజ‌కీయ పిలుపులు ఇస్తే.. మ‌న‌కు రోమాలు నిక్క‌బొడుకున్నాయి.

ఎవ‌రో పోర్న్ స్టార్లు, పాప్ స్టార్లూ.. వ్య‌వ‌సాయ ఉద్య‌మం గురించి మాట్లాడితే.. ఇక్కడ వీరంగం జ‌రుగుతోంది! వాళ్ల దిష్టి బొమ్మ‌ల ద‌హ‌నాల‌కు భ‌క్తులు పోటీ ప‌డుతున్నారు. వ్య‌వ‌సాయ‌దారుల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌, విదేశీ పోర్న్ స్టార్ల దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నానికి వ‌చ్చింది వ్య‌వ‌హారం, బాగుంది!

మనకి బూతులు జనాలకు కాదు

చంద్రబాబు వచ్చే వరకూ టీవీల్లో మాట్లాడిన పట్టాభి..