టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొన్నాళ్లుగా పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్తారనే వార్తలు చాన్నాళ్లుగా వినిపిస్తున్నా ఇంకా గోడపైనే కాపురం పెట్టారు గంటా. అటు టీడీపీని తిట్టరు, ఇటు వైసీపీని పొగడరు, తటస్థంగా చాలా తెలివిగా వ్యవహారం నెట్టుకొస్తున్నారు.
విశాఖ రాజధానిగా మారితే అక్కడ అధికార పార్టీ నేతగా చక్రం తిప్పాలనేది ఆయన ప్లాన్. అదే సమయంలో దానికింకా సమయం పట్టేట్టు కనిపించడంతో తన ముసుగు అప్పుడే తొలగించే అవసరం లేదనుకుంటున్నారు గంటా.
ఉక్కు పేరుతో తెరపైకి..
కొన్నాళ్లుగా తెరమరుగైన గంటా.. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. అదను కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తున్న అంశం సరిగ్గా దొరికింది. ఇంకేముంది అడుగు ముందుకేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం అవుతుందనే వార్తతో రాష్ట్ర ప్రజలు షాక్ కి గురయ్యారని చెప్పారు.
అవసరమైతే దీన్ని ఆపేందుకు విశాఖ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు గంటా. సీఎం జగన్ దీనిపై స్పందించాలని, అవసరమైతే ప్రధానితో మాట్లాడి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం కాకుండా చూడాలని సూచించారు.
జనాలకు కాదు, టీడీపీకి షాక్..
టీడీపీ నేతలు కూడా ఉక్కు కర్మాగారంపై రచ్చ చేస్తున్నారు. సీఎం జగన్ తన కేసుల మాఫీ కోసమే కేంద్రంతో లాలూచీ పడ్డారని, విశాఖ ఉక్కుపై స్పందించడంలేదని చంద్రబాబు సహా ఇతర నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో స్పందించిన గంటా.. సీఎం జగన్ ని పల్లెత్తుమాట అనలేదు, అటు కేంద్రాన్ని కూడా విమర్శించలేదు.
చాలా తెలివిగా ఉక్కు ఫ్యాక్టరీ విషయాన్ని హైలెట్ చేస్తూ.. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అంటూ అందరి మద్దతు కూడగట్టేందుకు పెద్దన్న పాత్ర తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీకి మింగుడు పడకుండా మారింది.
ఆమధ్య రామతీర్థంపై ఉత్తరాంధ్రలో టీడీపీ హడావుడి చేసిన సమయంలోనూ గంటా బయటకు రాలేదు. ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు ఓవర్ యాక్షన్ అందరూ చూశారు, ఆ ఎపిసోడ్ లోనూ గంటా పాత్ర లేదు. ఇప్పుడు పార్టీ డిమాండ్ ఒకటైతే, దానికి సంబంధం లేకుండా గంటా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.
మొత్తమ్మీద టీడీపీతో కలసి ఉండటం తనకు ఇష్టంలేదని చెబుతూనే, వైసీపీ దృష్టిలో పడాలని ఆలోచిస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేలలగా చంద్రబాబుని తిట్టి బయటకు వెళ్లడం ఆయనకు ఇష్టంలేదు. అందుకే ఈ డ్రామాలన్నీ. గంటా ఉక్కు సంకల్పం ముందు ఉక్కు ఫ్యాక్టరీకోసం జరిగిన ఉద్యమం కూడా బలాదూర్ అని చెప్పక తప్పదు.