పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా ఉడాయించిన భర్తను నల్గొండ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి రప్పించి విమానం దిగగానే అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి పంపారు. పెళ్లి పేరుతో వంచించిన ఓ ప్రబుద్ధుడి మోసపూరిత కథ ఇది.
అతను ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మంచి ఉద్యోగం, అందుకు తగ్గ వేతనం వస్తుందని, కూతురు ఆనందంగా జీవిస్తుందని నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన ఓ యువతి తల్లిదండ్రులు నమ్మారు. దీంతో హైదరాబాద్‌లోని జీడిమెట్ల పద్మారావునగర్‌కు చెందిన మందుగుల సురేష్‌తో గత ఏడాది ఆగస్టులో వివాహం జరిపించారు.
పెళ్లి అయిన 15 రోజుల వరకూ భార్యతో గడిపాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి భార్యను తీసుకెళ్తానని అందర్నీ నమ్మించాడు. అతను మాత్రం ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అత్తగారింట్లో ఉన్న ఆ యువతి ఉంటోంది.
అదనపు కట్నం కోసం ఆ యువతిని ఆడపడుచు, అత్తమామలు వేధించడం ప్రారంభించారు. ఈ విషయమై తన గోడును ఆస్ట్రేలియాలో ఉంటున్న భర్త సురేష్ దృష్టికి యువతి తీసుకెళ్లింది. అయినా సరైన స్పందన రాలేదు. మరోవైపు వేధింపులు మాత్రం మరింత పెరిగాయి. దీంతో బాధితురాలు నల్గొండ మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐ రాజశేఖర్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు.
నల్గొండ ఎస్పీ ఎ.వి.రంగనాథ్ ద్వారా ఆస్ట్రేలియా ఎంబసీ సహకారంతో సురేష్ పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థకు సీఐ మెయిల్ పెట్టారు. అంతేకాదు, సురేష్ చేసిన మోసం గురించి ఆ సంస్థ నిర్వాహకులకు ఫోన్‌లో సీఐ పూసగుచ్చినట్టు వివరించారు. దీంతో అతన్ని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించారు.
ఇక అక్కడ చేసేదేమీ లేకపోయింది. సురేష్ భారత్ వచ్చేలా ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుతం అతను ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే ఇమ్రిగేషన్, విమానాశ్రయ అధికారుల సహకారంతో సురేష్‌ను సీఐ రాజశేఖర్‌గౌడ్ అరెస్టు చేశారు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు.