కీర్తిశేషులైన డా॥ తోలేటి చంద్రశేఖరరావు వృత్తిరీత్యా వైద్యుడు. ప్రవృత్తి రీత్యా రచయిత, నటుడు. ఆయన కార్యకలాపాలకు కేంద్రస్థానం విశాఖపట్నం. ‘తంబు’ (దాన్నుంచే ముందుమాటలో వెలువోలు బసవ పున్నయ్య పన్ చేశారు – ‘ఆయన కాయం వట్టి వేలిముద్ర, ఆయన భావం సజీవముద్ర, ఆయన పలుకు ముత్యాలముద్ర’ అని) పేరుతో నాటికలు, నాటకాలు, కథలు, వ్యాసాలు, శీర్షికలు ఎన్నో రాయడమే కాక విశాఖపట్నంలో సినిమా తీసిన వారికి సహాయ, సహకారాలు అందించారు. తంబు హాస్యం, ఆలోచనలు రేకెత్తించే హాస్యం.
సమాజంపై వ్యంగ్యధోరణిలో వ్యాఖ్యానించడానికి ఆయన అనేక శీర్షికలు నడిపారు. 1974-75 సంవత్సరాల మధ్య “ఈనాడు” విశాఖపట్నం నుండి వెలువడే రోజుల్లో ‘తంబింప్రెషన్’ పేర డా॥ తంబు నడిపిన ఓ వీక్లీ ఫీచర్ లోని రెండు పేజీల లోపు వ్యాసాలు 70టిని భరాగో (శ్రీ భమిడిపాటి రామగోపాలం) ప్రేరణతో ‘తంబింప్రెషన్’ అనే పుస్తకం తంబు భార్య డా॥ పద్మావతి 2001లో వెలువరించారు. ఆ వ్యాసాలతో బాటు తంబును కథకుడిగా నిలబెట్టిన మొదటికథ ‘గుండు కథ’ ను కూడా చేర్చారు. విశాఖపట్నం నుండి వెలుపడే దిన పత్రికకు రాశారు కాబట్టి ఆ ఊరికి సంబంధించిన విషయాలు, ఆ కాలంలో హాట్ టాపిక్ అయిన ‘స్టీలు ఫ్యాక్టరీ’ గురించిన వ్యాఖ్యలు ఎక్కువగా కనబడినా సార్వజనీనమైన కామెంట్సు, చెణుకులు ఎన్నో కనబడతాయి. మచ్చుకు వాటిలో కొన్ని –
లోకపు తీరు – * నున్నటి గుండు చూస్తే ఎవరికైనా సరే ఒక్కసారి చెయ్యి వెయ్యాలనిపిస్తుంది. * కవిత్వంలాగానే కొంతమందికి గుండు కూడా సహజంగానే వస్తుంది. *కాని వాళ్లు ‘బ్రాకెట్’ని జూదమని, అయినవాళ్లు అదొక సంఖ్యాశాస్త్రమని అనుకుంటారు.
సామెతల హాస్యం – * అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకునే వాళ్లు కూడా గుండువాళ్లని ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే వాళ్లకి గుండుగా! * ‘శివ శివా! నీకు తెలియకుండా నా దగ్గర డబ్బేముంటుంది పార్వతీ!” అని పరమశివుడు వళ్లు దులుపుకునేసరికి బోల్డెంత బూడిద రాలింది. దాంతో పాముకి తుమ్ము వచ్చింది. * నారు పోసినవాడే నీరు పొయ్యాలి – అంటే అగ్గిపెట్టి ఇచ్చినవాడే సిగరెట్టు కూడా ఇవ్వాలి. * “మనం మాట్టాడుతూ భోంచేస్తే పొలమారుతుంది. ఉక్కిరి బిక్కిరి అవుతాం. అవునా.. అలాగే కుక్క మొరుగుతూ కరిస్తే దానికే ప్రమాదం. అందుకే మొరిగే కుక్క కరవదు. * పరిపాలనలో నెలకి మూడు వర్షాలు పడడం వల్ల, ధర్మం నాలుగుపాదాలా జాగ్రత్తగా బురదలో జారిపోకుండా నడిచేది.
*చేపని ఎండపెట్టారు చేప ఎండలేదు. “చేపా చేపా ఎందుకు ఎండలేదు?” అని అడిగితే కథ బోరు కొడుతుందని అడగడం మానేసి, మర్నాడు మళ్ళీ వేటకి వెళ్లి ఏడుగురు రాజకుమార్తెల్ని తీసుకువచ్చారు. వాళ్ళని ఎండలో పెడితే బావుండదని నీడలోనే వుంచారు. కొన్నాళ్లకి ఒక్కొక్కరికి ఏడుగురు కొడుకులు పుట్టారు. … “నా బంగారు కన్నంలో వేలు పెడితే కుట్టనా” అంది చీమ. వెంటనే బంగారం కోసం రాజకుమారులు పరుగుపరుగున చీమ కన్నం వెదుక్కుంటూ వెళ్ళారు. కానీ, ఇదే కథ రహస్యంగా వింటూన్న నిఘా విభాగం వారు వీళ్ల కంటె ముందే వెళ్లి చీమని నిర్బంధించి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
పన్‌లు, చమత్కారాలు – * మురికిపాలిటి * గంధకిత కితకామ్లము, * గాధ గంధ కుతకుత కామ్లము * ఆ ఊళ్లో కలరాకి క్షయకి కలిపి ‘కక్ష’ ఆస్పత్రిని వూరి బయట కట్టించారు. * అబ్బాయికి కొంచెం దురలవాట్లు అబ్బాయని కొందరు ఆడిపోసుకున్నా, అవన్నీ దొరలవాట్లని సర్దుకోవాల్సి వచ్చింది. * ఓట్ల కాన్‌వాషింగ్ * ఒక్కోసారి ఆట పట్టింపులు మాట పట్టింపులుగా మారి కొంచెం హద్దు మీరడం జరిగేది, ఆఖరికి సరిహద్దు తగాదాల వరకూ వచ్చేది. * తీసుకున్న అప్పు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాననీ, పువ్వులు ఇప్పుడే రెడీగా వున్నాయని డబ్బులే కాస్త ఆలస్యం అవుతుందని అన్నాడు. * సురేష్‌కి తిరపతి వెళ్లకుండానే గుండయిపోయింది.
మధ్యతరగతి జీవులు – * “మాస్టారూ స్కోరెంత?” “కిలో బియ్యం రెండ్రూపాయిల ఎనభై పైసలు. మన రూపాయి విలువ, ఇరవై ఏడు పైసలు” అన్నాడు స్కూలుమాష్టారు ఒళ్లు మండి. * “అంటు రోగుల్ని ఇంటికి రానిచ్చినా వూరుకుంటాను కాని వూరికినే స్కూలు మాష్టార్ని రానిస్తే మాత్రం నేనూరుకోను, ‘డాక్టర్ గారూ డాక్టర్ గారూ’ అంటూ వచ్చి నెలాఖరులో అప్పు అడుగుతారు.” అంది డాక్టరు గారి భార్య.
వర్ణనలు, పోలికలు – *శంఖుచక్రాల్లా గొట్టం, డబ్బా అతని రెండు చేతుల్లోనూ వుంటాయి కాబట్టి కొందరతన్ని ‘గొడ’ అప్పారావు అంటారు. అతను గవర్నమెంటు జీపుల్లోనూ, ప్రభుత్వ రంగపు బస్సు ల్లోనూ అడపాదడపా ఆదమరుపుగా వదలిన కారు టేంకుల్లో వున్న పెట్రోల్ని, డీజిల్ ఆయిల్ని పువ్వుల్లోంచి మకరందాన్ని భ్రమరం ఎంత తేలిగ్గా లాగేస్తుందో అంత సులువుగా గొట్టంవేసి డబ్బా లోకి లాగేస్తాడు. * ఆకాశవాణిలో ప్రసంగం విన్న ప్రజల్లాగ గ్రామస్తులు మొహాలు అదోలా పెట్టుకొన్నారు. * “రోడ్డులు – బోర్డులు” శాఖ తీవ్రంగా ‘ఆటలమ్మలా’ అభివృద్ధి చెందసాగింది. * వెంకట రాజేష్ ఖన్నా పిట్టగోడల్లాంటి సదరు స్పీడ్ బ్రేకర్లు దాటుతూ కారుతో సహా ఒక స్పీడ్ బ్రేకర్ మీద గోడ మీద పిల్లిలా వుండిపోయాడు.
* సస్యశ్యామలంగా పచ్చగా, కన్నులపండుగగా వుండే రాజ్యం క్షవరం చేసినట్లు తయారైంది. చల్లదనం లేక మేఘాలన్నీ పొరుగు దేశాలకి తరలి పోసాగాయి. బీడులన్నీ కొన్నాళ్లకి ఎడారులై రాజుగారి బట్టతలలా క్రమంగా వ్యాపించసాగాయి. పండ్ల కోసం బెంగపెట్టుకుని రాజుగారి పళ్లన్నీ వూడిపోయి మంచంపట్టారు. * కథ అలాగ స్టీల్ ప్లాంట్‌లాగ ఆగిపోయే సరికి… * ఆకాశవాణి వారి సూక్తిముక్తావళి కార్యక్రమము వోలె శ్రోతలు నిద్దుర పోయిననూ నిర్దాక్షిణ్యముగా కొనసాగించ సాగినారు. * భర్త రామారావు కంటే భార్య సీతమ్మ ముందుగా నిద్ర లేచి మంగళసూత్రం కళ్ల కద్దుకుని భర్త పాదాల మీద ధూళి దొరుకుతుందేమోనని ప్రయత్నించి, దొరక్కపోయినా నెత్తిమీద జల్లుకున్నట్టు అభినయించింది..
*పొద్దెక్కిపోతున్నా రామారావు నిద్ర లేవకుండా పడుకుంటే – లేటుగా వచ్చే క్లర్కుని చూసి తోటి క్లర్కులు అసూయ పడ్డట్లు కాకులు కొన్ని కిటికీ దగ్గర చేరి కాకిగోల చేశాయి. * చంటాడు “అమ్మ కావాలి” అనే పాటని రకరకాల రాగాల్లో, సాధ్యమైనన్ని స్థాయిల్లోనూ పాడుతూ వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. * రోజురోజుకి స్వామివారి భక్తులు కలరా లాగ వ్యాపించసాగారు. * “ఓ నటరాజా, సినిమాల్ని విమర్శించగల మగతనం పత్రికలకి లేకపోయినా, అందరూ నాటకాల్ని బూతులు తిడుతున్నా నువ్వు అర్ధనారీశ్వరుడివి కాబట్టి నిశ్చలంగా చూస్తూ వూరుకుంటున్నావు.” * గాలికి దీపం రెపరెపలాడింది. పేషంట్ ఆరోగ్యంగా వున్నా డాక్టర్ గారికి భయం వేసింది. చిన్నప్పటినుండీ చూసిన తెలుగు సినిమాల్లో చావు సీనులన్నీ గుర్తుకొచ్చాయి. ‘లైఫ్ ఇన్సూరెన్సు’ వాళ్ళ చిహ్నంలా రాత్రంతా దీపాన్ని కాపాడ్డం కోసం అలాగే వుండి పోయారు. దీపం ఆరిపోలేదు. పేషంట్ బతికాడు. మర్నాడు మాత్రం డాక్టర్ గారికి సుస్తీ చేసింది.
రవాణా సౌకర్యాలు – * బస్ ఎప్పుడొస్తుందోనని పదిపైసలిచ్చి చిలక జోస్యం అడిగాను. చిలక చిర్నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. * ఆర్టీసి బస్లు లేటుగా రావడమంత రివాజై పోయింది. * “ఓడలు బళ్లవుతాయా?” అనడిగాడు మల్లిఖార్జునరావు బస్ కోసం మరి నిలబడలేక. “బళ్లు మాత్రం ఓడలవుతున్నాయి. రెండు రోజుల వర్షానికి” అని చెప్పాను. * రైల్వే గేటువాడికి శిక్ష విధించడానికి అతన్ని అదే గేటు వద్ద పట్టాలకు కట్టేశారు. దాంతో వాడు మరణించాడు. రైలుకింద పడికాదు, రైళ్లు లేటయి. ఆకలి బాధకి తట్టుకోలేక చచ్చిపోయాడు. * “ఆత్మ ద్వారానే పరమాత్ముని చేరుకోవాలని, ఆత్మ ఆటమ్ లాంటిదని గతంలో తమరు సెలవిచ్చారు. కానీ స్వామి ఆత్మ అనేది ఆర్టీసీ బస్సు లాంటిదని నాకు అనుమానం బస్సెక్కితే, పక్క వూరు ఎప్పుడు చేరుకుంటామో గాని ప్రమాదం జరిగితే తిన్నగా పరమాత్ముని చేరుకుంటాం”
లోకంపై విసుర్లు – * ఉన్నతాధికారులు సముద్రగుప్తుణ్ని ఉద్యోగంలోంచి తీసేస్తే ఉన్నట్టుండి ఏ రాజకీయ నాయకుడిగానో మారిపోతాడేమోనని భయపడ్డారు. * వసుదేవుడనే నిరుద్యోగి ఎవరినైనా ఆపి “మేష్టారూ నా కాళ్లకి సాష్టాంగ నమస్కారం చేస్తారా? ఐదు రూపాయిలిస్తాను” అనేవాడు, దాన్తో సదరు పెద్ద మనిషికి వళ్లు మండి “ఏడిశావు నువ్వే నా కాళ్లకి సాష్టాంగ నమస్కారం చెయ్యి పదిరూపాయలిస్తాను” అనేవాడు, వసుదేవుడు ఆ పని చేసి పదిరూపాయిలు సంపాదించేవాడు. * ‘కావాలంటే మేం ప్రాణం ఇస్తాం, రక్తం మాత్రం అడక్కండి’ అని చుట్టాలు నసగసాగారు. * పారిపోతున్న దొంగని పట్టుకోవాల్సి వస్తుందేమో. ‘తీరా పట్టుకుంటే వాడేం చేస్తాడో’ అని కొందరు ముందు చూపుతో అక్కడ ఆగకుండా వేగంగా వెళ్లి పోసాగారు.
కుక్కలకి విశ్వాసం ఎక్కువ. మనుషుల్లా ప్రతీ అడ్డమైన వాడికి జైకొట్టవు. తిండి పెట్టిన వాడికే తోక ఆడిస్తాయి. * ధర్మరాజు లాంటివాడు జూదం ఆడాడు. ఆలిని, అనుంగు సోదరుల్ని, అన్నిటినీ పోగొట్టుకున్నాడు. అవన్నీ గెల్చిన కౌరవులు పెద్ద బాగు పడిందేమీ లేదు. సమూలంగా నాశనమయ్యారు. * గొప్ప భక్తుల్ని బాజాభజంత్రీలతో తీసుకెళ్తున్నారు. “అంతకంటే గొప్పభక్తులొస్తే అధికారులు దేవుడ్నే వాళ్ల కాళ్ల దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారు” అన్నాడు అప్పారావు. * క్యూని ఆపుచేసి మమ్మల్ని లోపలికి పంపిస్తుండగా – “అన్యాయం అన్యాయం” అని వెనక నుండి విన్పించింది. “దేవుడి సమక్షంలో అన్యాయం జరగదు. అయితే కొందరు పుణ్యాత్ములు పూర్వ జన్మ సుకృతం కొద్దీ క్యూలో నిలబడకుండా వెళ్లే వరాన్ని దేవుడే ప్రసాదిస్తాడు”. * స్వామీజీ ‘సందేహానంద’ని పిలిచి పండురసం తీసుకురమ్మన్నాడు. “స్వామీజీ! తమరు గాలిలో చెయ్యి తిప్పి అన్నీ తెప్పించగల సమర్థులు. పండురసం మాత్రం తెప్పించుకోలేరా” అని సవినయంగా, అమాయకంగా అడిగాడు శిష్యుడు సందేహానంద.
గవర్నమెంటాలజీ – * ‘తారు రోడ్డు తివాసీ’ని కనిపెట్టాను. తివాసీలా ఈ రోడ్డుని రెండు నిముషాల్లో పరచి సిద్ధం చెయ్యగలను. * దొంగని పట్టేసుకున్నారు కాబట్టిన్నూ, పారిపోవడానికి వీల్లేకుండా బోల్డంతమంది చుట్టూ జనం పోగయ్యారు కాబట్టిన్నూ, దొంగను పట్టుకోవడానికి పోలీసులు కూడా వచ్చారు. * దేశంలో పగలు కూడా చీకటి వ్యాపారాలు సాగుతున్నాయి. కాబట్టి రాజు గారు పట్టపగలు కూడా అప్పుడప్పుడు వీధి దీపాలు వెలిగించి వదిలేస్తూ ఉండేవారు. పగలు వీధి దీపాలు సరిగ్గా వెలుగుతున్నాయా లేదా అని పర్యవేక్షణ చెయ్యడానికి ప్రత్యేక అధికారుల్ని నియమిద్దామని రాజుగారు సంకల్పించారు. * “ముగ్గురు సభ్యులున్న ఇటువంటి సలహా సంఘాల్లో – ఎదుటివాని దృక్పథం చూడలేని గుడ్డివాడొకడు, పక్కవాడి మాట వినిపించుకోని చెవిటివాడొకడు, మొహమాటానికి కూడా మాట్లాడలేని మూగవాడొకడు వుండడం శ్రేయస్కరం.’’
ప్రేమికులు, భార్యాభర్తలు – * రాంబాబు ఎందుకీ ఘోర తపస్సు ప్రారంభించాడో తెలియక దేవేంద్రుడు ఖంగారుపడి రంభ, ఊర్వశి, మేనక మరియు తిలోత్తమలను రాంబాబు తపోభంగం చెయ్యమని పురమాయించి పంపాడు. రాంబాబు మూసుకున్న తన కళ్లలో ఒకటి సగం తెరచి, నలుగురు అప్సరసల్నీ చూసి తపస్సు మానెయ్యడానికి తనకు అభ్యంతరం లేదు కానీ తన భార్య నళినికి ఈ విషయం తెలిస్తే వాళ్ళు నలుగురూ క్షేమంగా తిరిగి వెళ్లలేరని మాత్రం తెలియచేశాడు. * ““అవును మరి! ఒరే చిన్నప్పుడు హార్మణీ వాయిస్తూ ఉండేది మా చిన్న చెల్లెలు. నువ్వు చూసే ఉంటావు. అచ్చు వాణిశ్రీ లాగ ఉంటుందని మా అమ్మ అంటుంది. అది మాత్రం హేమమాలినిలా వుంటాననుకుంటుంది!’’ * అర్జునుడు చీకట్లో భోజనం చేసి శబ్ధభేరి విద్య నేర్చుకున్నట్లు లవర్స్ ఇద్దరూ “పవరకట్”నే నమ్ముకుని ఎన్నో నేర్చుకోవాలనుకున్నారు.
కళాకారులు – * ‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?’ అని నువ్వు పుస్తకం రాసి అచ్చువేసినా ఆ పుస్తకం అట్టమీద పెద్ద అక్షరాలతో నీ పేరే వేసుకుంటావు. ఆ పుస్తకాన్ని అచ్చు వేసిన కంపోజిటర్ల పేర్లు రాయవు. * ఒక విప్లవ కవిత్వం సాగిందిలా – ‘విప్లవం అనే కలంతో పేదల రక్తపు సిరాలో – రేపు అనే తెల్ల కాగితం మీద భవిష్యత్ అనే భాషలో – నీ కోసం రాస్తున్నానిది – ఎల్లుండి రాస్తా మిగిలింది…’ * చివరికి నాటక సమాజం వారు కుట్ర పన్ని అతనితో రాజీకొచ్చినట్లు సన్మానం ఏర్పాటు చేసి ఇంత గొప్ప రచయిత వెంటనే సినిమాల్లోకి వెళ్లి పోవాలని ఆకాంక్షించారు. ఇదంతా నిజం అనుకుని మర్నాడే పాపం కళాకండుడు మద్రాస్ వెళ్లి పోయి మళ్లీ కన్పించలేదు.
రాజకీయాలు – * “డబ్బు లేనివాడికి ఈ స్వయంవరంలో స్థానం లేదు వున్న వాళ్ల లోనే ఒకర్ని వరించాల్సి వచ్చే ఈ ఎన్నిక ఎన్నిక కానేకాదు. అందుకే ఆయన వచ్చే వరకూ ఎదురు చూస్తాను” అని చిరంజీవి సౌభాగ్యవతి ఓటేశ్వరి దండతో సహా గుమ్మందగ్గరే ఎదురు చూస్తూ ఉండిపోయింది. అతనెప్పుడొస్తాడో!? * చిన్నప్పుడే రాజుగారు దేశాన్ని భాగ్యవంతం చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. రాజుగారు పెరిగి పెద్దయ్యే సరికి కంకణం బిగుతుగా అయిపోయి ఆయన చేతికే వుండిపోయింది.
ఈ పుస్తకంలో కథలు కూడా ఉన్నాయని చెప్పాను కదా. వాటిల్లోని చెణుకులను యిలా స్థాలీపులాక న్యాయంగా చెబితే న్యాయం జరగదు. అందుకని కథాసారాంశాన్ని యిస్తున్నాను.
‘కందుకూరి సారంగధరుని కథ’! రాజమండ్రిలో తవ్వకాలలో దొరికిన ఒక విగ్రహం గురించిన వివాదంతో మొదలవుతుంది. విగ్రహానికి తలపాగా ఉంది. కుర్చీ కూడా ఉంది. కాళ్లు మాత్రం లేవు. అది కందుకూరి వీరేశలింగందా, లేక సారంగధరుడిదా తేల్చడానికి పాత వస్తువులు, పరిశోధనల శాఖవారు రంగం లోకి దిగుతారు. ఒక వాదం ఇలా సాగింది’ – ‘కందుకూరి వీరేశలింగం జాతకచక్రంగా భావించబడ్డ ఒకానొక ఫలకం బట్టి ఆయన రెండు కాళ్లూ లారీ ఏక్సిడెంటులో పోతాయని సూచించ బడింది కాబట్టి బతికుండగా కాకపోయినా ఆయన విగ్రహాని కైనా కాళ్లు విరిగి ఉంటాయి. పంతులు గారి ధర్మమా’ అని పునర్వివాహం చేసుకున్న విధవల మొదటి మొగుళ్లు దెయ్యాలై ఆయన ఆత్మని పట్టుకుని కాళ్లు విరగగొట్టు గాక అని సనాతన చాదస్తులంతా మనస్ఫూర్తిగా ప్రార్థించారు. పర్యవసానంగా విగ్రహానికి కాళ్లు విరిగిపోయాయి..
వేరే వాదం ప్రకారం – చిత్రాంగివల్ల కాళ్లు పోగొట్టుకున్న సారంగధరుడు బతికుంటే బలుసాకు తినొచ్చునని తలచి తెలుగు సినిమా హీరోలాగ తలపాగ, కోటు వగైరాలతో మారువేషం ధరించి కుర్చీలో కూర్చుని బలుసాకు తింటూ కాలం వెళ్ల బుచ్చాడని – కాబట్టి సదరు విగ్రహం మారువేషధారుడైన సారంగధరుడిదేనని మరొక వాదం బయల్దేరింది. చివరికి నిపుణుల సంఘం వారు ఉభయతారకంగా శాంతియుతమైన పరిష్కారం సాధించి సదరు విగ్రహం “కీ॥శే॥ కందుకూరి సారంగ ధరుడు” అనే చారిత్రాత్మక వ్యక్తిదని నిర్ణయించారు. నీతి – విగ్రహం ఎవరిదైనా – కాంతల జోలికి పోతే కాళ్లు విరుగుతాయి. ఎప్పుడు బాగుపడతాయో ఎవరూ చెప్పలేరు.”
మరో కథలో గ్రాంథిక భాష, వ్యావహారిక భాషల గురించి వివాదం చెలరేగి ఫైనల్‌గా ఏం తేలుస్తారంటే – “ఇకపై తెలుగు పరీక్షాపత్రం ఇంగ్లీషు భాషలో అచ్చువేయాలి. ఇక దానిలో గ్రాంధిక వ్యవహారిక వాదాలకు తావు లేకుండా తెలుగు సమాధానాలన్నీ హిందీ భాషలో రాయాలి.”
‘‘దిగుడు బావి’’ అనే కథ కాగితాల మీదే పనులన్నీ నడిపించే ప్రభుత్వ పనుల కథ. బావి కావాలని ఒక మహజరు రాగానే, నుయ్యి తవ్వుతారు. దాంట్లో పశువులు పడిపోతున్నాయని ఇంకో మహజరు వస్తే గట్టు కట్టిస్తారు. గట్టు కట్టినా మనుషులు గట్టుదూకి చచ్చిపోతున్నారని ఫిర్యాదు రావడంతో నుయ్యి పూడ్చేస్తారు. ఇవన్నీ కాగితాల మీద. నిజానికి బావి తవ్విందీ లేదు, పూడ్చిందీ లేదు.
లంచగొండి తనం గురించి మరో చక్కని కథ – ఒక లంచగొండిని ఉద్యోగం పీకేయలేక లంచం ఇవ్వవలసిన అవసరం లేని ఉద్యోగాన్ని కనిపెడతారు. ఓ సముద్రతీర గ్రామంలో కెరటాలు లెక్కించే ఉద్యోగం అది. అక్కడ కూడా లంచం పట్టేందుకు అతనో ఉపాయం కనిపెడతాడు. కెరటాలకు అడ్డంగా పడవలు అవీ వెళితే కెరటాలు తిరిగిపోయి తన లెక్కలలో తేడా వస్తుంది కాబట్టి పడవలు వెళ్లడానికి వీల్లేదని అభ్యంతర పెట్టి పడవకి మూడు రూపాయల మామూలు చొప్పున ఒప్పందం కుదుర్చుకుంటాడు!
ఈ విధంగా ఒక పక్కన నవ్విస్తూనే, ఆలోచింపజేసే పుస్తకం ఇది. వీలైతే తప్పకుండా చదవండి. ప్రచురణకర్తల ఎడ్రసు 10-27-14 ఎ, కైలాసమెట్ట, వాల్తేర్ అప్‌లాండ్స్, వైజాగ్ 530003, ఫోన్ 0891-566886 గా యిచ్చారు. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతోందో లేదో తెలియదు. నెట్‌లో పైపైన వెతికితే కనబడలేదు. ఎవరైనా ఆర్కయివ్స్‌లో పెట్టారేమో చూడండి. ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘‘స్వగతంబు’’ అని శీర్షిక రన్ చేశారు. అదీ చాలా బాగుండేది. పుస్తకరూపంలో వచ్చిందో లేదో తెలియదు. ఆయన రాసిన ‘‘ప్రైవేటు ప్రాక్టీస్’’ అనే కథను ఆడియో రూపంలో అందించిన యూట్యూబు లింకు యిది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2024)
vc available 9380537747
తంబు నాకు బాగా నచ్చిన రచయిత. ఆయన ఙాపకాలు కొన్ని
1. సినిమాలపై రాసే కామెడీ రచనల్లో హీరో పేరు క్రిశోనారా (క్రిష్ణ, శోభన్, నాగేశ్వరరావు, రామారావు పేర్లతో), విలన్ పేరు ప్రమోగిస (ప్రభాకరరెడ్డి, మోహన్‌బాబు, గిరిబాబు, సత్యనారాయణ) అని ఉండేవి
2. దాసరి చిత్రం “దేవదాసు మళ్లీ పుట్టాడు” వచ్చినపుడు “శరత్‌బాబు మళ్లీ పోయాడు” అనే రచన చేసారు. అందులో శరత్ చటోపాధ్యాయ తెలుగువాడిగా జన్మ ఎత్తి ఆ సినిమా చూసి “పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు నాకు ఏ శిక్ష విధిస్తాడో కానీ మళ్లీ జన్మ అంటూ ఉంటే నవలలు రాయను” అని చనిపోతాడు.
3. ఆ రచన తరువాత కూడా దాసరి కోపం పెట్టుకోకుండా తన గోరింటాకు చిత్రంలో తంబుకి చిన్న పాత్ర ఇచ్చారు. కానీ తంబు మాత్రం “కరివేపాకు” అనే పేరుతో ఆ కథని పేరడీ చేసారు.
He joked on all writers, actors and movies. But still he was loved by everybody because he also joked on himself.
vc available 9380537747
విశాఖ ప్రాంతం లో గాలిలొ కూడా హాస్యం కూడా కలిసిపోయినట్లు వుంది.
అప్పట్లో ఇప్పటిలా అసభ్యం లేకుండా కామెడీ సినిమాలు తీసిన జంద్యాల గారి సినిమా లు ఎక్కువగా విశాఖ పట్టణం చుట్టుపక్కలే అనుకుంటా.
vc estanu 9380537747
vc available 9380537747