మ‌రో బాదుడుకు ‘రైట్‌రైట్’

ఆదాయం పెంపుపై జ‌గ‌న్ స‌ర్కార్ మాట‌ల‌కు అర్థాలే వేరులే అని పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక‌వైపు ఏపీ బ‌డ్జెట్ అంతా సంక్షేమ ప‌థ‌కాల అమలుకే స‌రిపోవ‌డం లేదు. ఇక ఉద్యోగుల జీతాల‌కు నెల‌నెలా అప్పుల…

ఆదాయం పెంపుపై జ‌గ‌న్ స‌ర్కార్ మాట‌ల‌కు అర్థాలే వేరులే అని పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక‌వైపు ఏపీ బ‌డ్జెట్ అంతా సంక్షేమ ప‌థ‌కాల అమలుకే స‌రిపోవ‌డం లేదు. ఇక ఉద్యోగుల జీతాల‌కు నెల‌నెలా అప్పుల వెతుక‌లాట‌కే స‌మ‌యం స‌రిపోతోంది. ఇక అభివృద్ధి అనే మాట మ‌చ్చుకైనా లేదు. ఏపీకి ఆర్థికంగా ఆదాయ వ‌న‌రులుంటే, సంక్షేమ ప‌థ‌కాలెన్ని అమ‌లు చేసినా ఇబ్బంది లేకుండా పోయేది.

కానీ ఏపీ స‌ర్కార్‌ది అప్పు చేసి పప్పు కూడు తింటున్న చంద‌మైంది. మూడు రోజుల క్రితం విద్యుత్ చార్జీల బాదుడు మ‌రిచిపోక‌నే, అలాంటిదే మ‌రో బాదుడుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ ద‌ఫా ఆర్టీసీ చార్జీల‌ బాదుడు వంతు వ‌చ్చింది. చార్జీల‌ను పెంచాల‌ని సంబంధిత అధికారులు ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఆర్టీసీపై డీజిల్‌ భారం, అలాగే కొవిడ్‌ సమయంలో నష్టాల‌ను భ‌ర్తీ చేసుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌యాణికుల న‌డ్డి విరిచేందుకు స‌న్న‌ద్ధ‌మైంది. ఆర్టీసీ చార్జీల పెంపున‌కు తెలంగాణ ఆర్టీసీని ఏపీ ప్ర‌భుత్వం స్ఫూర్తిగా తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఆర్టీసీ చార్జీల పెంపున‌కు ఏదీ మిన‌హాయింపు ఇచ్చేలా క‌నిపించ‌డం లేదు. పల్లె వెలుగు మొద‌లుకుని ఏసీ బస్సుల వరకూ అన్ని సర్వీసులపై   పది నుంచి 25శాతం వ‌ర‌కూ ఆర్టీసీ చార్జీల‌ను పెంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంద‌నే వార్త‌లే నిజ‌మ‌య్యేలా ఉన్నాయి.  

ఆర్టీసీ చార్జీల‌ను పెంచుతూ త‌యారు చేసిన ఫైల్‌ను సీఎం జ‌గ‌న్ సంత‌కం కోసం పంపిన‌ట్టు స‌మాచారం. ఆర్టీసీ చార్జీల పెంపుద‌ల‌, అందుకు దారి తీసిన ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌డానికి ఆర్టీసీ చైర్మ‌న్ దుగ్గాయ‌ప‌ల్లె మ‌ల్లికార్జున్‌రెడ్డి, ఎండీ ద్వారకా తిరుమ‌ల‌రావు ఇవాళ మూడు గంట‌ల‌కు మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం.

ఆదాయ వ‌న‌రుల‌ను పెంచుకునేందుకు ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌, సాగునీటి సౌక‌ర్యంతో రైతుల జీవితాల్లో వెలుగులు నింప‌డానికి బ‌దులు సుల‌భ‌మైన మార్గాన్ని ఎంచుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది. ఆ సుల‌భ‌మైన మార్గ‌మే ప్ర‌జ‌ల నుంచి వివిధ రూపాల్లో డ‌బ్బు వ‌సూలు చేయ‌డం. 

ఇప్ప‌టికే ఇంటిప‌న్ను, చెత్త‌ప‌న్ను పేరుతో ప్ర‌భుత్వం చెడ్డ‌పేరు మూట‌క‌ట్టుకుంటోంది. అయితే త‌న‌కు డ‌బ్బు సంపాద‌నే త‌ప్ప‌, మంచీ చెడ్డ‌ల‌తో ప‌నిలేద‌నే రీతిలో …. జ‌గ‌న్ మాట‌ల్లో చెప్పాలంటే బాదుడే బాదుడ‌ని ప్ర‌జానీకం న‌డ్డి విరిచేందుకు ఏపీ స‌ర్కార్ వెనుకాడ‌డం లేదు. ఈ ప‌రంప‌ర‌లో ఆర్టీసీ చార్జీల భారాన్ని మోసేందుకు ఏపీ స‌మాజం సిద్ధం కావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.