బుగ్గన లేకపోతే జగన్ బటన్ నొక్కలేరా?

ఊహించని విధంగా మంత్రివర్గంలో 11 మంది పాతవాళ్లనే తిరిగి కొనసాగించారు జగన్. అటు ఇటుగా ఐదుగుర్ని మాత్రమే రిపీట్ చేస్తారని భావించినా 11 మందికి తిరిగి అవకాశం దక్కడం విశేషమే. అయితే కేవలం ఇద్దర్ని…

ఊహించని విధంగా మంత్రివర్గంలో 11 మంది పాతవాళ్లనే తిరిగి కొనసాగించారు జగన్. అటు ఇటుగా ఐదుగుర్ని మాత్రమే రిపీట్ చేస్తారని భావించినా 11 మందికి తిరిగి అవకాశం దక్కడం విశేషమే. అయితే కేవలం ఇద్దర్ని మాత్రమే రిపీట్ చేయాల్సి వస్తే, ఆ ఇద్దర్లో బుగ్గన ఒకరు అనేది మాత్రం బహిరంగ రహస్యం. 

మంత్రివర్గ విస్తరణలో తాజాలు, మాజీలు అందరూ టెన్షన్ పడ్డారు ఒక్క బుగ్గన తప్ప. తన పదవి ఎటూ పోదని, రాజీనామా చేసినా తిరిగి తనకే దక్కుతుందని బుగ్గనకు బాగా తెలుసు? ఆయనకు ఎందుకంత ధైర్యం?

పాతవారినే తీసుకున్నా అందులో కేవలం ఆరుగురికి మాత్రమే పాత శాఖలు ఇచ్చారు జగన్. మిగతావారికి శాఖలను మార్చేశారు. పాత శాఖలే తీసుకున్నవారిలో బుగ్గన ఒకరు. అందులోనూ ఆర్థిక శాఖను ఆయన నుంచి తప్పించి మరొకరికి ఇవ్వాలనే ఆలోచన జగన్ చేయలేదు. అందుకే బుగ్గనను కదిలించలేదు. 

కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ ద్వారా గరిష్టంగా ఆదాయాన్ని తీసుకొచ్చేది ఆయనే కాబట్టి.. ఆ శాఖను కూడా తిరిగి ఆయనకే అప్పగించారు. నవరత్నాల అమలు చేయాలంటే అప్పులు చేయక తప్పేలా లేదు.

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి.. అటు అప్పులు, ఇటు ఆదాయం రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ బండి నడిపిస్తున్నారు బుగ్గన. ఇలాంటి టైమ్ లో బుగ్గనతో ప్రయోగాలు చేయలేరు జగన్. అందుకే మిగిలిన టర్మ్ కూడా బుగ్గనకే దక్కింది.

ఆ ధైర్యం ఎవరికుంది..?

గతంలో వైఎస్ఆర్ హయాంలో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు చేయడం నా వల్ల కాదంటూ ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్య చాలా సార్లు బహిరంగంగానే చెప్పేవారు. ఇప్పుడు జగన్ అంతకు రెట్టింపు ఇస్తున్నారు. జగన్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రి పదవి అంటే ముళ్ల కిరీటమే. కత్తిమీద సాములాంటి శాఖ అది. అందుకే అది మళ్లీ బుగ్గనకే దక్కింది.

సంక్షేమ కార్యక్రమాలన్నీ మధ్యలో ఉన్న సమయం. ఇలాంటి సమయంలో ఆర్థిక మంత్రిని మారిస్తే లేనిపోని తలనొప్పులు. పైగా బుగ్గన, జగన్ కు బాగా ట్యూన్ అయ్యారు. ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

అంతే కాదు, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ నిధులు తెస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులతో టచ్ లో ఉన్నారు. పనిలోపనిగా ఇతర సంస్థలతో మాట్లాడి అప్పులు తెస్తున్నారు.

ఇలాంటి టైమ్ లో ఆర్థిక మంత్రిని మార్చి ప్రయోగాలు చేయదలుచుకోలేదు జగన్, ఈ విషయం బుగ్గనకు కూడా తెలుసు. అందుకే ధీమాగా ఉన్నారు. అనుకున్నట్టే ఆర్థిక మంత్రి పదవిని మళ్లీ అందుకున్నారు. బుగ్గన లేకపోతే జగన్ బటన్ నొక్కలేరనే ఇన్ సైడ్ టాకే నిజమైంది.