బాలీవుడ్ లాంగ్ టైమ్ లవర్స్ రణబీర్ కపూర్, అలియా భట్ మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. వీళ్ల పెళ్లి తంతు మొదలైంది. ఈరోజు ఉదయం నుంచి రణబీర్-అలియా పెళ్లికి సంబంధించి పూజలు స్టార్ట్ అయ్యాయి. ముందుగా పితృ పూజ చేశారు. ఆ తర్వాత మెహందీ ఫంక్షన్ మొదలుపెట్టారు.
ముంబయిలోని బాంద్రాలో ఉన్న రణబీర్ ఇంటిలోనే ఈ పెళ్లి వేడుక జరుగుతుంది. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇదే నివాసంలో రణబీర్-అలియా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత 3 రోజులకు బాలీవుడ్ ప్రముఖులకు తాజ్ హోటల్ లో పార్టీ ఇవ్వబోతోంది ఈ జంట.
పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు రణబీర్-అలియా. అందుకే తమ 6 అంతస్తుల సొంత ఇంట్లోనే పెళ్లి పెట్టుకున్నారు. వాస్తు పేరుతో పిలిచే ఈ ఇంట్లోనే పెళ్లి వేడుక జరుగుతోంది. నిజానికి రిషీకపూర్ నివసించిన కృష్ణరాజ్ బంగ్లాలో పెళ్లి చేయాలనుకున్నారు. కానీ దాన్ని రీ-మోడలింగ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత రణబీర్-అలియా కాపురం ఉండేది అందులోనే.
ఇక వీళ్లకు చెందిన ఆర్కే స్టుడియోస్ లో పెళ్లి చేయాలని కూడా ఓ దశలో అనుకున్నారు. కానీ అక్కడ చేస్తే సెక్యూరిటీ సమస్యలు, రాకపోకలకు ఇబ్బంది అవుతుందని.. బంద్రాలోని సొంతింట్లోనే పెళ్లి పెట్టుకున్నారు.
అలియా కోసం రణబీర్ ప్రత్యేకంగా ఓ బహుమతి తయారుచేయించాడు. దాని పేరు వెడ్డింగ్ బ్యాండ్. పెళ్లికి అలియా తన చేతికి అది ధరించబోతోంది. 8 వజ్రాలు పొదిగిన ఖరీదైన వెడ్డింగ్ బ్యాండ్ అది. ఇక డిజైనర్ సబ్యసాచి రూపొందించిన పెళ్లి దుస్తులతో ఇప్పటికే రిహార్సల్స్ కూడా అయిపోయాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈరోజు రాత్రికి సంగీత్ ఫంక్షన్ ఉంటుంది. ఇప్పటికే రణబీర్, అలియా కుటుంబాలకు చెందిన కీలకమైన సభ్యులంతా చేరుకున్నారు. అటుఇటుగా ఓ 40-45 మంది కుటుంబ సభ్యుల మధ్య గుంభనంగా జరగబోతోంది రణబీర్-అలియా పెళ్లి.
ఫొటోలు బయటకు రాకుండా రణబీర్ టీమ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎవరికి కేటాయించిన గదుల్లో వాళ్లు సెల్ ఫోన్లు విడిచి, పెళ్లి మంటపానికి రావాలనే రూల్ పెట్టారు. ఇక స్టాఫ్ మొబైల్స్ కు ఉండే కెమెరాలకు స్టిక్కర్లు అతికించారు.