తగ్గేదేలే.. పుష్ప సినిమా టైపులో స్మగ్లింగ్

పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపించాడు బన్నీ. స్మగ్లింగ్ కోసం రకరకాల వ్యూహాలు పన్నుతాడు. పోలీసుల కళ్లుగప్పి ఎర్ర చందనాన్ని చెక్ పోస్ట్ దాటిస్తాడు. గంజాయి స్మగ్లర్లు కూడా పుష్ప నుంచి స్ఫూర్తి…

పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపించాడు బన్నీ. స్మగ్లింగ్ కోసం రకరకాల వ్యూహాలు పన్నుతాడు. పోలీసుల కళ్లుగప్పి ఎర్ర చందనాన్ని చెక్ పోస్ట్ దాటిస్తాడు. గంజాయి స్మగ్లర్లు కూడా పుష్ప నుంచి స్ఫూర్తి పొందినట్టున్నారు. పుష్ప సినిమాలో చూపించినట్టుగానే తాము కూడా గంజాయిని తరలించాలని ప్రయత్నించారు. కానీ ఇది సినిమా కాదు. బయట నిజమైన పోలీసులుంటారు. కేసు బుక్ చేసి జైళ్లో పెట్టారు.

ఒరిస్సాలో అక్రమంగా సాగుచేసిన గంజాయిని ప్రాసెస్ చేసి ప్యాకెట్లలో నింపారు. చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారుచేశారు. 81 కిలోల ఈ గంజాయి ప్యాకెట్లను హైదరాబాద్ తరలించాలనేది స్మగ్లర్ల ప్లాన్. దీని కోసం వాళ్లు కొత్తగా ఆలోచించారు. పరుపుల ముసుగులో స్మగ్లింగ్ చేయాలనుకున్నారు. కొత్త పరుపులు కొన్నారు. అందులోంచి దూది తీసేశారు. ఆ స్థానంలో గంజాయి ప్యాకెట్లు పెట్టి కుట్టేశారు.

కొత్త పరుపుల్ని వ్యాన్ లోకి ఎక్కించారు. పరుపుల ఇన్-వాయిస్ బిల్లులు కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. ఇక తమకు తిరుగులేదని అనుకున్నారు. అనుకున్నట్టుగానే హైదరాబాద్ బార్డర్ వరకు బాగానే వచ్చేశారు. సరిగ్గా అక్కడే కథ అడ్డం తిరిగింది.

హైదరాబాద్ శివార్లలోని చందానగర్ చౌరాస్తాలో మాదాపూర్-చందానగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అసలు విషయం బయటపడింది. ప్రతి చోటా చూపించినట్టుగానే ఇక్కడ కూడా స్మగ్లర్లు బిల్లులు చూపించారు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కానీ పోలీసులకు మాత్రం అనుమానం తీరలేదు.

అసలే సిటీలో డ్రగ్స్ దందాలు బయటపడుతున్నాయి. దీంతో నిఘా, తనిఖీలు మరింత కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా పరుపుల్ని కూడా మరింత క్షుణ్నంగా సోదా చేయడంతో మేటర్ బయటపడింది. మాల్ పోలీసుల చేతికి చిక్కింది. 81 కిలోల గంజాయితో పాటు ట్రక్కును, దాన్ని అనుసరిస్తూ వస్తున్న ఓ కారును.. అందులో ఉన్న వ్యక్తులు అందర్నీ అరెస్ట్ చేశారు.