మంత్రులంతా రాజీనామాలు చేశారు. సుచరిత, బాలినేని లాంటి ఒకరిద్దరు మాత్రమే తమ అసంతృప్తిని బయటపెట్టారు. తర్వాత వాళ్లు కూడా సర్దుకున్నారనుకోండి, అది వేరే విషయం. మరి మిగతా మాజీల సంగతేంటి? మరీ ముఖ్యంగా కేబినెట్ లో మొన్నటివరకు కీలకంగా ఉన్న కొడాలి నాని సంగతేంటి? దీనిపై ఆయన స్పందించారు. తనకు ఎలాంటి బాధ లేదన్నారు. “జగన్ చెప్పారు, నేను రాజీనామా చేశాను” అని సింపుల్ గా తేల్చేశారు. పదవి కోసం ప్రత్యర్థుల్ని తిట్టలేదని క్లారిటీ ఇచ్చారు.
“నేను మంత్రి పదవి కోసం చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను తిట్టానని పిచ్చివాగుడు వాగుతున్నారు. నాకు మంత్రి పదవి అనేది వెంట్రుకతో సమానం. ఏ రోజు జగన్ చెబితే ఆరోజు నా పదవి వదిలేస్తానని రెండేళ్ల కిందటే చెప్పాను. ఇప్పుడు అదే చేశాను. జగన్ రాజీనామా చేయమన్నారు, నేను చేశాను. ఆయన చెప్పింది నేను చేశాననే సంతోషం నాకుంది.”
వైసీపీలో వెన్నుపోటుకు తావులేదన్నారు కొడాలి. జగన్ ను వెన్నుపోటు పొడిచి పార్టీ నుంచి బయటకొచ్చే ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు ఆత్రంగా ఎదురుచూశారని, కానీ అది ఎప్పటికీ జరగదన్నారు.
“రాజకీయ రొచ్చులో బతుకుతున్న వ్యక్తి చంద్రబాబు. తండ్రి లాంటి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడు. మొన్న మంత్రి పదవులు వదులుకున్న మంత్రులంతా ఆయనలానే మారుతారని ఆయన ఆశపడ్డాడు. తనలాగే ఎంగిలి మెతుకులకు ఆశపడతారని చంద్రబాబు అనుకున్నాడు. మేం అలా కాదు. వైసీపీ అధికారంలో ఉండాలి, జగన్ సీఎంగా కొనసాగాలి. దాని కోసం మేం పదవులే కాదు, ఏదైనా వదులుకోవడానికి సిద్ధం.”
మంత్రి పదవి వదులుకున్న తనకు ముఖ్యమంత్రి జగన్.. ఏదైనా కార్పొరేషన్ పదవి ఆఫర్ చేయబోతున్నారనే ఊహాగానాలపై కూడా నాని స్పందించారు. అది తనకు, జగన్ కు మధ్య వ్యవహారమని.. అప్పుడే స్పందించనని అన్నారు.