2024 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని జగన్ తన కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరిస్తారని ఊహాగానాల మధ్య కేబినెట్ విస్తరణ జరిగింది. మరి ఇదేనా ఎన్నికల టీమ్. కూర్పు చూస్తుంటే అలా అనిపించడం లేదు కదా? నిజమే.. జగన్ కేబినెట్ లో మార్పుచేర్పులు చేశారంతే.
ఎన్నికల టీమ్ మాత్రం ఇది కాదు. ఇంకా చెప్పాలంటే.. ఎవరైతే తాజాగా మాజీలయ్యారో.. వాళ్లే జగన్ ఎన్నికల టీమ్. మంత్రిత్వ శాఖల బాధ్యతల నుంచి తప్పుకున్న తాజా మాజీలు, ఇప్పుడు పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టబోతున్నారు. వైసీపీని మరోసారి గెలిపించే దిశగా క్షేత్రస్థాయిలో పనిచేయబోతున్నారు.
రెండో దఫా కేబినెట్ లో బెర్త్ లు దక్కించుకున్న వారు జగన్ ఎలక్షన్ టీమ్ కాదు. మంత్రి మండలి నుంచి తప్పుకున్న తాజా మాజీలే జగన్ అసలైన ఎన్నికల టీమ్. పేర్ని నాని, కొడాలి నాని, బాలినేని, అనిల్ కుమార్ యాదవ్.. ఇలాంటి వారందర్నీ మంత్రి పదవులు పోగొట్టుకున్న నేతలుగా అంతా చూస్తున్నారు. కానీ రాబోయే కాలంలో పార్టీని గెలిపించేది వీళ్లే. వీళ్లే జగన్ ఏ-టీమ్.
సీనియర్లను గౌరవిస్తూనే.. తనకు అత్యంత నమ్మకస్తులు అనుకున్నవారిని పార్టీ బాధ్యతల కోసం పక్కనపెట్టారు జగన్. వాస్తవానికి పెద్దిరెడ్డి, బొత్స కూడా పార్టీ కోసం పనిచేస్తారు. కానీ మంత్రి మండలిలో సీనియార్టీ తగ్గకుండా చూసుకున్నారు జగన్. అదే సమయంలో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్.. ఇలా పార్టీ కోసం కష్టపడేవారిని అయిష్టంగానే మంత్రి మండలినుంచి పక్కనపెట్టాల్సి వచ్చింది.
బాలినేని శ్రీనివాసులరెడ్డిని కూడా ఇదే విషయంలో పక్కనపెట్టాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని భేటీలో బాలినేనికి చెప్పారు జగన్. మళ్లీ గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. రేపు వీరందరికీ కీలకమైన పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. ఈ ముగ్గురి సారధ్యంలో ప్రస్తుతం మంత్రి పదవులు కోల్పోయిన నేతలు రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.
తమ సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో వైసీపీ బలం పెంచుకుంటూనే.. ఇతర జిల్లాలపై కూడా వీరు దృష్టిపెడతారు. ఇన్నాళ్లూ సజ్జల, పెద్దిరెడ్డి లాంటి వాళ్లు మాత్రమే ట్రబుల్ షూటర్స్ గా ఉన్నారు. ఇకపై వీళ్లంతా ట్రబుల్ షూటర్లే.
ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెక్ పెట్టే విషయంలో వీరి సేవలను బాగా ఉపయోగించుకోబోతున్నారు జగన్. 2024 నాటికి దుష్టచతుష్టయం ఒకటి కాబోతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేది లేదంటూ ఇప్పటినుంచే ప్రగల్భాలు పలుకుతున్నారు నేతలంతా. వీరందరికీ చెక్ పెట్టాలంటే జగన్ తన ఎ-టీమ్ ని రెడీ చేయక తప్పదు. అందుకే అయిష్టంగానే వారిని తప్పించారు, వారితో పార్టీని పటిష్టపరచబోతున్నారు.
కొత్త మంత్రి వర్గం పాలనలో జగన్ బి-టీమ్ అయితే, తొలగించిన మంత్రులంతా ఎన్నికల్లో జగన్ ఎ-టీమ్.