సినిమా ఫ్లాప్.. ఒప్పుకున్న వరుణ్ తేజ్

ఓ మోస్తరు అంచనాల మధ్య వచ్చిన గని సినిమా ఫ్లాప్ అయింది. సినిమాకు భారీ ప్రచారం కల్పించారు. ఏకంగా అల్లు అర్జున్ ను రంగంలోకి దించారు. ఇక విడుదల రోజు కూడా తమ 'ప్రయత్నాలు'…

ఓ మోస్తరు అంచనాల మధ్య వచ్చిన గని సినిమా ఫ్లాప్ అయింది. సినిమాకు భారీ ప్రచారం కల్పించారు. ఏకంగా అల్లు అర్జున్ ను రంగంలోకి దించారు. ఇక విడుదల రోజు కూడా తమ 'ప్రయత్నాలు' తాము చేశారు నిర్మాతలు. కానీ గని జాతకాన్ని మార్చలేకపోయారు. మొదటి రోజు యావరేజ్ అనే టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి డిజాస్టర్ అనిపించుకుంది.

దీంతో మేకర్స్ కూడా పోస్ట్-రిలీజ్ ప్రమోషన్ ఆపేశారు. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై వరుణ్ తేజ్ స్పందించాడు. సినిమా రిజల్ట్ తాము అనుకున్న విధంగా రాలేదని అంగీకరించాడు. తాము ఏదో అనుకుంటే, తెరపై ఇంకేదో వచ్చిందనే అర్థం వచ్చేలా ఏకంగా ఓ బహిరంగ లేఖ విడుదల చేశాడు.

“మీకు (ప్రేక్షకులు) ఓ మంచి సినిమా ఇద్దామనే ఉద్దేశంతో చాలా ప్యాషన్ తో కష్టపడి పనిచేశాం. అయితే మేం అనుకున్న ఐడియా, అనుకున్నట్టుగా తెరపైకి రాలేదు. ప్రతిసారి మీకు వినోదం పంచాలనే ఉద్దేశంతోనే సినిమా చేస్తాను. కొన్ని సార్లు నేను సక్సెస్ అవుతాను, మరికొన్ని సార్లు నేను పాఠాలు నేర్చుకుంటాను. కానీ హార్డ్ వర్క్ మాత్రం ఆపను.”

ఇలా గని సినిమాపై నిరుత్సాహంగా స్పందించాడు వరుణ్ తేజ్. తాము అనుకున్నది అనుకున్నట్టు తీయలేకపోయామని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ఏ ఒక్కరినో ప్రత్యేకంగా నిందించలేదు ఈ హీరో.

గతంలో రామ్ చరణ్ కూడా ఇలానే రియాక్ట్ అయ్యాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా చేశాడు చరణ్. ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో సినిమా వచ్చిన కొన్ని రోజులకే తన అభిమానులకు బహిరంగ లేఖ రాసిన చరణ్, అందులో క్షమాపణలు కోరాడు. ఇప్పుడు వరుణ్ కూడా దాదాపు అదే విధంగా రెస్పాండ్ అయ్యాడు.