పాపం బాబు.. ఏదో అనుకున్నారు, ఇంకేదో జరిగింది

ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా ఎంతో కొంతమంది రెబల్స్ తయారవుతారని, వారిని తమ వైపు తిప్పుకోవచ్చని, వైసీపీ మంటల్లో చలికాచుకోవచ్చని అనుకున్నారు చంద్రబాబు. మంత్రి పదవులు ప్రకటించిన రోజు ఒకరకంగా టీడీపీ సంతోషపడింది. …

ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా ఎంతో కొంతమంది రెబల్స్ తయారవుతారని, వారిని తమ వైపు తిప్పుకోవచ్చని, వైసీపీ మంటల్లో చలికాచుకోవచ్చని అనుకున్నారు చంద్రబాబు. మంత్రి పదవులు ప్రకటించిన రోజు ఒకరకంగా టీడీపీ సంతోషపడింది. 

మాజీలతో పాటు, మంత్రి పదవి ఆశించి భంగపడినవారు కూడా నిరసనలు, ధర్నాలంటూ రెచ్చిపోవడంతో టీడీపీకి ఎక్కడలేని హుషారొచ్చింది. జగన్ ప్రభుత్వం పడిపోతుందా అనేంతగా సంబరపడ్డారు చంద్రబాబు. 

ఎల్లో మీడియా కూడా అదే స్థాయిలో సంబరపడింది. కానీ ఆ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదు. మాజీల్లో రేగిన సెగలు చల్లారాయి, కొత్తగా పదవి ఆశించినవారంతా సర్దుకుపోయారు. మరి ఇప్పుడు బాబు ఏం చేయాలి..?

సర్దుబాట్లు.. హామీలు..

రెండుసార్లు సజ్జల రాయబారం విఫలమవడంతో బాలినేని గట్టి నిర్ణయం తీసుకునేలా కనిపించారు. కానీ జగన్ కాస్త సముదాయించడంతో ఆయన మెత్తబడ్డారు. తాను వైఎస్సార్ ఫ్యామిలీ మనిషినంటూనే కాస్త ఫీలయినమాట వాస్తవమేనని చెప్పుకున్నారు. 

ఇక కేబినెట్ లో కొనసాగించకపోవడంతో ఫీలైన మరో మాజీ మంత్రి మేకతోటి సుచరిత విషయంలో కూడా ఇదే జరగబోతోంది. సుచరిత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా, సహచరుల్ని మాత్రం చేయొద్దన్నారు. 

తాను పార్టీలోనే కొనసాగుతానన్నారు, ఆమె రాజీనామా వెనక్కి తీసుకోడానికి కూడా పెద్దగా సమయం పట్టేలా లేదు. ఇక ఈరోజు పిన్నెల్లి కూడా జగన్ ను కలవబోతున్నారు. సీఏంతో భేటీ తర్వాత ఆయన కూడా బాలినేని రూట్లోనే నడవబోతున్నారు.

ఇక మంత్రి పదవి విషయంలో నిరాశపడి, కంటతడిపెట్టి టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడపగడపకూ శ్రీధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టి జనంలోకి వెళ్లారు. ఎక్కడా మంత్రి వర్గం విషయంలో ఆయన స్పందించలేదు. 

కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారధి, కొరుముట్ల శ్రీనివాసులు.. దాదాపుగా అందరూ సెట్ రైట్ అయిపోయారు. ఎవరూ పార్టీని ధిక్కరించలేదు, జగన్ ని విమర్శించలేదు. ఆ దిశగా అదుపు తప్పుతారని అనుకున్నా.. అంతా సర్దుకుపోయింది.

బాబు కర్తవ్యం ఏంటి..?

వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురు తిరిగితే, వారిపై సింపతీ చూపించి తనవైపు తిప్పుకోవాలనేది బాబు ఆలోచన. అందుకోసం తన మీడియాని కూడా ఎడాపెడా వాడేసుకున్నారు. అక్కడ టైర్లు తగలబడ్డాయి, ఇక్కడ రాజీనామా లేఖల్ని రాసేశారు, అదిగో అక్కడ రోడ్డుపై బైఠాయించారు, వైసీపీలో తిరుగుబాటు మొదలైందంటూ బ్యానర్లు రాసిపడేశారు. 

కానీ అంతలోనే అంతా సర్దుకోవడంతో టీడీపీ, టీడీపీ అనుకూల మీడియాకు దిక్కుతోచలేదు. బాబుతో పాటు అంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.