మంత్రి పదవిలో ఉండగా పవన్ కల్యాణ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు పదవి నుంచి బయటకొచ్చిన తర్వాత డోసు మరింత పెంచారు. పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదు, బిచ్చం నాయక్ అని విమర్శించారు.
ఆయన బిచ్చం నాయక్ కాదని నిరూపించుకోవాలంటే టీడీపీ దగ్గర బిచ్చం అడుక్కున్నట్టు సీట్లు అడుక్కోకూడదని, దమ్ము-ధైర్యం ఉంటే అన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నారు. ఆ మేరకు పవన్ ని జనసైనికులు ప్రిపేర్ చేయాలన్నారు అనిల్.
ట్రోలింగ్ చేసినా తగ్గేదేలే..
గతంలో మంత్రిగా ఉన్న అనిల్ పై జనసేన టీమ్ ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిపింది. పోలవరం పూర్తయిందా లేదా అంటూ అప్పట్లో అనిల్ పై ఓ రేంజ్ లో మీమ్స్ పడ్డాయి.
పవన్ కల్యాణ్ పై ఆయన సెటైర్లు వేసిన ప్రతి సందర్భంలోనూ జనసైనికులు రెచ్చిపోయేవారు. అయితే అలాంటి ట్రోలింగ్స్ కి భయపడి తగ్గేదే లేదన్నారు అనిల్. ట్రోలింగ్ చేస్కోండి, కానీ మీ నాయకుడు భీమ్లా నా, బిచ్చమా అనేది మీరే డిసైడ్ చేసుకోండి అని అన్నారు అనిల్ కుమార్.
ముష్టి తీసుకుంటారా..?
మంత్రి పదవిలో ఉండగా కాస్త తగ్గి ఉన్నామని, ఇప్పుడు పదవి లేదు కాబట్టి తగ్గేదే లేదంటున్నారు అనిల్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ టీడీపీ వేసిన ముష్టి తీసుకుంటున్నారని అన్నారు.
మొత్తమ్మీద పవన్ కల్యాణ్ అనంతపురం పర్యటనలో రైతుల పరామర్శ యాత్రలో బిజీగా ఉండగా.. ఇటు అనిల్ మాత్రం ఆయనపై విమర్శల వర్షం కురిపించారు.
విమర్శలు తప్పవు..
అనిల్ కుమార్ మాత్రమే కాదు, పవన్ కల్యాణ్ టీడీపీ చేతుల్లో ఉన్నంతకాలం అందరి నుంచీ ఇలాంటి విమర్శలను కాచుకోవాలి. పల్లకీ మోయనంటారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోనంటారు, తానే సీఎం అంటారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో చెప్పరు.. ఇలా ఇప్పటికే జనసైనికుల్లో ఎక్కడలేని గందరగోళం సృష్టిస్తున్నారు పవన్ కల్యాణ్.
ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ.. జనసేనాని చిత్ర విచిత్ర నిర్ణయాలతో జనసేన నేతలు మరింత కన్ఫ్యూజన్లో పడిపోవడం ఖాయం. టీడీపీ దగ్గర సీట్లు బతిమిలాడి తీసుకున్నంత కాలం పవన్ నాయకుడే కాదు.