చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ప్రచారం ఊపందుకుంది. ఇవాళ్టి నుంచి ప్రమోషన్ ను మరింత వేగవంతం చేయబోతున్నారు. సాయంత్రం ట్రయిలర్ రిలీజ్ వేడుక పెట్టుకున్నారు. ఆ తర్వాత వారం రోజులకు ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ వెంటనే మరికొన్ని రోజులకు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా ప్లాన్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి పవన్ కల్యాణ్ ను తప్పించారు చిరంజీవి.
ఆచార్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ వస్తారనే ప్రచారం మొన్నటివరకు జరిగింది. కానీ చిరంజీవి మాత్రం ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ను పక్కనపెట్టాలనే నిర్ణయించుకున్నారు. పవన్ స్థానంలో మరో సెలబ్రిటీ కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్ ను ఎందుకు తప్పించారు?
చిరంజీవి-పవన్ మధ్య మంచి అనుబంధమే ఉంది. ఇద్దరి మధ్య ఒకప్పుడు రాజకీయ అభిప్రాయబేధాలుండేవి. ఇప్పుడు అవి కూడా లేవు. చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా కలుసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఆచార్య ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ రావడంలో తప్పేం లేదు. కానీ వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారో అనే భయం చిరంజీవికి ఉంది. అందుకే తమ్ముడ్ని తప్పించారంటున్నారు.
ఆమధ్య రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ కు వెళ్లారు పవన్ కల్యాణ్. ఆ సినిమా గురించి తప్ప అన్నీ మాట్లాడారు. మరీ ముఖ్యంగా ఏపీ సర్కారుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రచ్చ చాన్నాళ్ల పాటు నడిచింది. ఆయన చేసిన వ్యాఖ్యలు రిపబ్లిక్ సినిమాను పూర్తిగా డ్యామేజ్ చేశాయి.
ఆచార్య విషయంలో అలాంటి వివాదమే ఇంకోటి రిపీట్ అయితే చిరంజీవి తట్టుకోలేరు. పైగా ఆయన జగన్ కు సన్నిహితంగా ఉన్నారు. అందుకే ఈ లెక్కలన్నీ వేసుకొని పవన్ ను ఆచార్య ప్రమోషన్ కు దూరం పెట్టారు.
మంచి కలయిక మిస్ అయిన ఫ్యాన్స్
చిరంజీవి తెలివైన నిర్ణయమే తీసుకున్నారు. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే ఈ నిర్ణయం వల్ల ఫ్యాన్స్ మాత్రం ఓ మంచి కలయికను మిస్ అయ్యారు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా నటించిన సంగతి తెలిసిందే. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి, చరణ్ ఇద్దరూ వస్తారు. అదే వేదికపై పవన్ కల్యాణ్ కూడా కనిపిస్తే, మెగా ఫ్యాన్స్ లో హుషారు మరో రేంజ్ లో ఉంటుంది.
చిరు-పవన్-చరణ్ ఒకే వేదికపై కనిపించి చాన్నాళ్లయింది. ఆచార్యతో ఆ సందర్భం మరోసారి వస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఆచార్య ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ వచ్చేది అనుమానమే. ఆఖరి నిమిషంలో నిర్ణయం మారితే తప్ప, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ రాడు.