హీరోయిన్ నమిత మద్యం సేవిస్తారని, అందువల్లే ఆమె బరువెక్కారనే ప్రచారం గత కొంత కాలంగా విస్తృతంగా సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ఆమె స్పందించారు. అసలు నిజాలేంటో ఆమె తేల్చి చెప్పారు. ‘సొంతం’ అనే ప్రేమకథా చిత్రంతో కథా నాయికగా నమిత టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘జెమినీ’, ‘బిల్లా’ చిత్రాలతో ఆకట్టుకున్నారు.
కెరీర్ ప్రారంభంలో నాజూగ్గా, చూడచక్కని రూపంతో ఉన్నారు. కానీ ‘బిల్లా’, ‘సింహా’ సినిమాల్లో బొద్దుగా కనిపించి …ఈ ముద్దు గుమ్మ కనుక్కోలేనతంగా తయారై షాక్‌కు గురిచేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమయ్యారు. ఇటీవల మళ్లీ ఆమె రీఎంట్రీ ఇచ్చారు. అయితే నమిత బరువెక్కడంపై ఓ ప్రచారం చక్కర్లు కొడుతోంది. నమిత మద్యానికి అలవాటు పడ్డారని, అందువల్ల శారీరకంగా బరువెక్కారనే ప్రచారం వైరల్ అయింది.
ఈ ప్రచారంపై ఇన్‌స్టా వేదికగా తాజాగా ఆమె వివరణ ఇచ్చారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడంపై అందరికీ అవగాహన కల్పించేందుకు తాను ఈ పోస్టు పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు. తన బరువు 97 కిలోలకు చేరిందని ఆవేదనతో తెలిపారు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా, ప్రచారమవుతున్నట్టుగా మద్యం తాగడం వల్లే తాను బరువు పెరగలేదని స్పష్టత ఇచ్చారు.
థైరాయిడ్, పీసీఓడీ సమస్యల వల్లే లావుగా మారాననే విషయం తనకు మాత్రమే తెలుసునని హీరోయిన్ నమిత తెలిపారు. అంతేకాదు, ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. దాదాపు ఐదేళ్లపాటు మానసికంగా నరకాన్ని అనుభవించానని, యోగాతో మనశ్శాంతి లభించిందని హీరోయిన్ తెలిపారు.
తనకు కావాల్సిన శాంతి మంత్రాన్ని తనలోనే ఉన్నట్టు కనుగొన్నట్టు చెప్పారు. ఇప్పుడు తాను ఎంతో సంతోషంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. దేని కోసమైతే వెతుకుతున్నారో అది మనలోనే ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నమిత సూచించారు.