కిషన్ రెడ్డి వద్దనుకోవడం వెనుక సీక్రెట్ ఇదే!

తెలంగాణ భారతీయ జనతా పార్టీ సారథ్యం మార్పు గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పార్టీ చాలా సహజంగా అనుసరించే కాలపరిమితి నిబంధనలకు విరుద్ధంగా, అధ్యక్షుడు బండి సంజయ్ కు పొడిగింపు…

తెలంగాణ భారతీయ జనతా పార్టీ సారథ్యం మార్పు గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పార్టీ చాలా సహజంగా అనుసరించే కాలపరిమితి నిబంధనలకు విరుద్ధంగా, అధ్యక్షుడు బండి సంజయ్ కు పొడిగింపు లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే దాకా ఆయనే పదవిలో ఉంటారని ప్రకటించారు. అయితే ఆ తర్వాత పార్టీలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

బండిసంజయ్ తో ఇతర నేతలకు విభేదాలు బాగా బయటపడ్డాయి. పార్టీని కాపాడుకోవడానికి బండిని పక్కకు తప్పించి.. ఈటలకు పగ్గాలు అప్పగిస్తారనే పుకార్లు కొంత వినిపించాయి. అవి త్వరగానే సద్దుమణిగినా.. ఇక ఫైనల్ అన్నట్టుగా కిషన్ రెడ్డి చేతికి పగ్గాలు ఇస్తారని, బండిని తప్పించి.. కేంద్రమంత్రిపదవి కట్టబెడతారని ప్రచారంలోకి వచ్చింది. అయితే కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ సారథ్యం తీసుకోవడానికి ససేమిరా అన్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కిషన్ రెడ్డి ఎన్నికల వేళ కీలకమైన పార్టీ సారథ్యాన్ని వద్దనుకోవడం వెనుక అసలు కారణాలివే అని పలువురు అంటున్నారు. 

1. కేంద్రమంత్రి పదవి పోయే చాన్సుంది: ఒక వ్యక్తికి ఒకటే పదవి అనే సిద్ధాంతాన్ని పార్టీ పాటిస్తే గనుక.. బండికి కేంద్రమంత్రి పదవి దక్కుతుంది.. అదే సమయంలో కిషన్ రెడ్డికి ఊడుతుంది. పార్టీ నమ్మే ఆ సిద్ధాంతాన్ని ప్రత్యేకంగా మార్చుకుంటే తప్ప.. ఆయన రెండు పదవుల్లో కొనసాగడం కుదరదు.

2. అపకీర్తి తప్పదనే భయం: తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పటికే చాలా మంది నాయకులు కాంగ్రెస్ లో చేరడానికి మంతనాలు పూర్తి చేసుకుని, సరైన సమయం కోసం వేచిచూస్తున్నారనే ప్రచారం ఉంది. వారందరూ బండి సంజయ్ తో పొసగక, పార్టీని వీడిపోతుండవచ్చు గాక, కానీ, కిషన్ రెడ్డి సారథ్యం స్వీకరించినంత మాత్రాన ఆయన మీద నమ్మకంతో పార్టీని అంటిపెట్టుకుని ఉంటారనుకోవడం భ్రమ. తాను సారథ్యం తీసుకున్నాక నాయకులు ఎవరైనా కాంగ్రెసులోకి ఫిరాయిస్తే.. అది తన చేతగానితనం కిందకు వస్తుందని కిషన్ రెడ్డి ఆలోచన.

3. గెలిచే గ్యారంటీ లేనప్పుడు ఎందుకు?: తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా గెలుస్తుందనే గ్యారంటీ లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనంత సింపుల్ మెజారిటీ సాధిస్తుందనే విశ్వాసం వారికి లేదు. మెజారిటీ కాదు కదా.. కనీసం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందనే నమ్మకం కూడా లేదు. అలాంటప్పుడు.. అనవసరంగా కేంద్రమంత్రి పదవిని వదులుకుని, రాష్ట్ర పార్టీ సారథ్యం అనే చాకిరీకి ఒప్పుకోవడం ఎందుకు? దాని వల్ల దక్కేది కూడా ఏమీ లేదు కదా.. అని కిషన్ రెడ్డి తిరస్కరించినట్లుగా పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.