‘‘కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు.. కానీ మనిషి కుక్కను కరిస్తే అది వార్త..’’ అనేది జర్నలిజంలో ఒక ప్రాథమిక సూత్రం. జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే అందులో కొత్తదనం ఏమీ లేదు.
కానీ.. తాను స్థాపించిన జనసేన అనే పార్టీ గుప్పెడు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని శాసనసభలో అడుగు పెట్టాలంటే.. ఎవరి ఆశ్రయం పొంది ఎవరితో పొత్తులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అందుకోసం ఎవరి పల్లకీ మోయడానికి పవన్ కళ్యాణ్ తాను స్వయంగా సిద్ధం అవుతున్నారో అలాంటి చంద్రబాబు నాయుడు మీద కూడా విమర్శలు కురిపిస్తే ఆలోచించాల్సిందే.
చంద్రబాబు నాయుడు ఎంతటి ప్రజా వ్యతిరేక పాలన సాగించాడో, ఎలాంటి అసమర్థుడో పవన్ కళ్యాణ్ తాను స్వయంగా వివరిస్తే అది కచ్చితంగా ముఖ్యమైన వార్త అవుతుంది.
ఇదేమి 2019 ఎన్నికల ముందరి కాలం కాదు. తాను ఒంటరిగా పోటీ చేసినా సరే అధికారంలోకి వచ్చేయగలనని అపరిమిత ఆత్మవిశ్వాసంతో పవన్ కళ్యాణ్ ఊరేగుతున్న సమయం కాదు. అప్పట్లో ఆయన చంద్రబాబు అసమర్ధత మీద అనేక రకాల విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఓటమి అనుభవంలోకి వచ్చి తత్వం బోధపడిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఏ చంద్రబాబు ప్రాపకం ద్వారా అయితే తాను ఒకసారైనా ఎమ్మెల్యే కావాలని కలగంటున్నాడో ఆ చంద్రబాబు గురించి మళ్ళీ ప్రస్తావిస్తున్నారు.
భీమవరంలో నిర్వహించిన సభలో పవన్ చాలా మాట్లాడారు. ఆక్వా పరిశ్రమ వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తున్నప్పటికీ స్థానికంగా కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతుందని… కాలుష్యం తగ్గిస్తూ ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని తాను చాలా ఏళ్లుగా మాట్లాడుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీనిపై గత ప్రభుత్వంతో కూడా పోరాడాను అని ఆయన చెప్పారు.
తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్ వలన పరిసర గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ దానికి వ్యతిరేకంగా పోరాడిన మాట వాస్తవమే. అయితే చంద్రబాబు నాయుడు ఆయన పోరాటం మీద ఏమాత్రం స్పందించకుండా తన అసమర్ధ పాలనా వైఖరిని ప్రదర్శించిన మాట కూడా నిజమే.
అదే తుందుర్రు ఆక్వా పార్క్ కు సంబంధించి.. జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోలేదని విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాలు గురించి మాత్రం ఈ సమయంలో చాలా కన్వీనియంట్ గా మరచిపోతున్నారు. ఒకవైపు చంద్రబాబు అసమర్ధత, దుర్మార్గ పాలనలను ఇంకా రచ్చ కీడుస్తూనే.. తాను ఆయన పల్లకి మోయడానికి ఎగబడుతూ ఉండడం తమాషాగా ఉంది.