కాసాని, చంద్రబాబును డామినేట్ చేస్తున్నారా?

తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా శవాసనం వేసి ఉన్న తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో జవసత్వాలు తీసుకువచ్చిన ఘనత మాత్రం కాసాని జ్ఞానేశ్వర్ కే దక్కుతుంది. తనకోసం తాను ఒక సొంత పార్టీ పెట్టుకొని రాజకీయం…

తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా శవాసనం వేసి ఉన్న తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో జవసత్వాలు తీసుకువచ్చిన ఘనత మాత్రం కాసాని జ్ఞానేశ్వర్ కే దక్కుతుంది. తనకోసం తాను ఒక సొంత పార్టీ పెట్టుకొని రాజకీయం చేస్తూ వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ ఆ తర్వాత పెద్దగా ఠికానాలేని తెలుగుదేశాన్ని నమ్ముకుని ఆ సారధ్య బాధ్యతలను స్వీకరించారు. 

అంతకుముందు పార్టీ అధ్యక్షులుగా చేసిన వాళ్లంతా నామమాత్రంగా నడిపిస్తూ రాగా, కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం పార్టీకి ఒక ఊపు తీసుకువచ్చారు. బహిరంగ సభ తో పాటు అనేక పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పుంజుకునేలా అభ్యర్థులను బరిలోకి దింపుతామని ప్రకటిస్తున్నారు. మరింత లోతుగా పరిశీలిస్తే కొన్ని విషయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ సాధించిన చంద్రబాబు నాయుడు కంటే మిన్నగా కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ పార్టీని నడిపిస్తున్నట్లు గా కనిపిస్తుంది.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాన్ని మక్కీకి మక్కిగా  తెలంగాణ తెలుగుదేశం కాపీ కొట్టింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ‘గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్’ అనే టైటిల్ తో కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా.. తెలంగాణలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ అనే కార్యక్రమాన్ని కాసాని ప్రకటించారు. పెద్దగా జరుగుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు కానీ, కనీసం కార్యక్రమాన్ని ప్రకటించి వార్తల్లో నిలవడం వరకైనా కాసాని ద్వారా సాధ్యమవుతుంది. దానితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఊపు తీసుకురావడానికి కీలక నాయకులు అందరితో కలిపి ఒక బస్సు యాత్రను కూడా ఆయన ప్లాన్ చేశారు.

తాజాగా ఆ బస్సుయాత్ర సమయంలోనే తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తామని కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. చూడబోతే తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగాన్ని కాసాని తాను గుత్తకు తీసుకున్నట్లుగా ఉంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకోలుతో నిమిత్తం లేకుండానే ఆయన పార్టీ అభ్యర్థుల జాబితాలు కూడా ప్రకటించేస్తారేమో అనిపిస్తుంది. 

నిజానికి ఏపీలో అభ్యర్థులను సైతం ఆరు నెలల ముందుగా ప్రకటించడానికి చంద్రబాబుకు ధైర్యం ఉండదు. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యే గడువు తేదీ వరకు బీఫారాల విషయంలో నాన్చివేత ధోరణి అవలంబించడం అనేది చంద్రబాబు మార్క్!! కానీ కాసాని జ్ఞానేశ్వర్ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణలో చంద్రబాబు ఉద్ధరించేదేమీ ఉండాదనే స్పృహతోనే సాగుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశానికి కనీసం డిపాజిట్లు దక్కగల స్థానాలు వేళ్ళ మీద లెక్కపెట్టేగలిగినన్ని అయినా సరే ఉన్నాయో లేదో అనే సందేహం పార్టీ వర్గాల్లో కూడా ఉంది. పార్టీకి ఏమాత్రం బలం లేకపోయినా ఇలాంటి సమరోత్సాహం ప్రదర్శించడం చూస్తే చంద్రబాబు కంటే కాసాని చాలా బెటర్ అని అనిపిస్తుంది.