తండ్రీ తనయుల త్యాగాల సీక్వెల్ ‘యాత్ర 2’

ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవ్వరూ కూడా కనీవినీ ఎరుగని ఒక విలక్షణమైన సీక్వెల్ సినిమా త్వరలో రాబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ఈ సీక్వెల్ ను సిద్ధం చేస్తున్నారు. అదేమిటో కాదు- ఆంధ్రప్రదేశ్…

ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవ్వరూ కూడా కనీవినీ ఎరుగని ఒక విలక్షణమైన సీక్వెల్ సినిమా త్వరలో రాబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ఈ సీక్వెల్ ను సిద్ధం చేస్తున్నారు. అదేమిటో కాదు- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- దేశ చరిత్రలోనే అపురూపంగా సాగించిన సుదీర్ఘమైన పాదయాత్ర ప్రస్థానంపై రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2’. మహీ వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఇటువంటి సీక్వెల్ మరొకటి ఉండే అవకాశం లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు.

ఎందుకంటే- సీక్వెల్ అంటేనే ఒక కథ చెప్పిన తర్వాత ఆ కథకు కొనసాగింపుగా రూపొందించే సినిమా! అదే సమయంలో- ఒక కథను రెండు భాగాలుగా విడగొట్టి తీసినంత మాత్రాన దానికి సీక్వెల్ అనే పదం సరి తూగదు! ఆ మాటకొస్తే ఎన్టీఆర్ జీవితాన్ని కూడా- నటజీవితం ఒక సినిమాగా.. రాజకీయ జీవితం మరొక సినిమాగా రెండు చిత్రాలు తీశారు! అయితే ఈ రెండు సినిమాలు కూడా ఒకే వ్యక్తి జీవితంలోని ఘట్టాలు కావడం గమనించాలి. దీనిని గానీ, బాహుబలి, పుష్ప లాంటి వాటిని గానీ రెండు భాగాలుగా వచ్చిన సినిమాలుగా మాత్రమే పరిగణించాలి. 

సరిగ్గా ఇక్కడే ‘‘యాత్ర 2’’ సినిమాలోని విలక్షణ అంశం బయటకు వస్తోంది. తండ్రి జీవిత చరిత్రలోని కొన్ని ఘట్టాలను మలిచి ఒక చిత్రంగా రూపొందిస్తే.. కొడుకు జీవితంలోని మరికొన్ని ఘట్టాలను కలిపి మరొక చిత్రంగా రూపొందించడం అనేది అరుదైన, అపురూపమైన సంగతి! తండ్రీ కొడుకులు ఇద్దరి జీవితాల్లోని ఘట్టాలు కూడా వారు చేసిన సుదీర్ఘమైన పాదయాత్రలకు సంబంధించినవే కావడం విశేషం. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మీద ‘యాత్ర’ సినిమాను రూపొందించిన దర్శకుడు మహి వి రాఘవ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మీద ‘‘యాత్ర 2’’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి శివా మేక నిర్మాత.

‘‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’’ అనే డైలాగును చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లలో వాడారు. 2024 ఫిబ్రవరి నాటికి సినిమా విడుదల కానున్నదని ప్రకటించారు. ఈ ఏడాది ఎన్నికల సమయానికి, గత ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర రూపంలో పడిన కష్టం, చేసిన త్యాగం మొత్తం ప్రజలకు మరొక్కసారి గుర్తుచేసేలా సినిమా రూపొందుతుందని ఆశించవచ్చు. 

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజల కన్నీళ్లు, కడగండ్లు స్వయంగా చూసి పరామర్శించి తెలుసుకోవడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అద్భుతమైన ప్రయత్నమే పాదయాత్ర. ఆ పాదయాత్ర గురించి మహి ‘యాత్ర’ అనే సినిమా తీశారు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ పేదల కన్నీళ్లు తుడవాలనే సంకల్పంతో తండ్రి పేరిట సొంత రాజకీయ పార్టీ ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి తాను కూడా ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రవ్యాప్త పాదయాత్రను సాగించారు. 

జగన్ చేసిన పాదయాత్ర దేశంలోనే అత్యంత దూరం నడిచిన యాత్రగా రికార్డులు కూడా సృష్టించింది. ఆ యాత్ర సందర్భంగా ప్రజల జీవితాలను గమనించిన కారణంగానే జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన సంక్షేమ పథకాలతో ప్రజా పరిపాలన అందిస్తున్నారు. జగన్ పాదయాత్ర మీద కూడా యాత్ర 2 పేరుతో సీక్వెల్ వస్తోంది. తండ్రీ తనయుల సీక్వెల్ పాదయాత్రలను ప్రతిబింబిస్తూ వస్తున్న సీక్వెల్ చిత్రం ఇది.  ఆ రకంగా ఇది ఒక గొప్ప సీక్వెల్ గా చరిత్రలో మిగిలిపోయే అవకాశం ఉంది.