ముందస్తు ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తమ కేడర్‌కు సంకేతాలు ఇచ్చారు. అయితే తమ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు కోరుకోవడం లేదని, మోదీ సర్కార్ ఆ ఆలోచనలో ఉందని, అందుకు తగ్గట్టు నడుచుకోవాల్సి వుంటుందని అధికార పార్టీ నేతలు ఆప్ ది రికార్డుగా చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐదారు నెలల తేడాతో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరోవైపు ఆంధ్రాలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. అయితే మోదీ సర్కార్ మూడు నెలల ముందు ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ఎన్నికలకు రెడీ కావాలని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు వారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాలతో ఆయన భేటీ కానున్నారు. బహుశా ముందస్తు ఎన్నికలపై ఈ పర్యటనలో సీఎం జగన్‌కు క్లారిటీ ఇవ్వొచ్చనే చర్చ నడుస్తోంది. ముందస్తుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు స్పష్టత వస్తే, ఎన్నికలపై వైఎస్ జగన్ వ్యూహం వేగం అందుకోనుంది.
ఏపీలో ప్రతిపక్షాలు కూడా ముందస్తుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పలుమార్లు ముందస్తు ఎన్నికలపై మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో రాజకీయంగా తమ వాళ్లను కాపాడుకునేందుకు ముందస్తుపై వారు మాట్లాడినా, జగన్‌కు ఇప్పటికీ ముందస్తుకు వెళ్లాలనే ఆలోచన లేకపోవడం గమనార్హం. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నెగెటివిటీ పెరగకుండా కొంచెం ముందే ఎన్నికలకు వెళితే మంచిదనే అభిప్రాయంలో బీజేపీ వుంది. ఆ దిశగా అడుగులు పడినా ఆశ్చర్యపోనవసరం లేదు.