ఎవర్ గ్రీన్ హిట్ మూవీ శివ తో సహా చాలా సినిమాల్లో ఓ మెసేజ్ వుంటుంది. రాజకీయాల్లో తిరిగి, రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారి, జీవితాలు తగలబెట్టుకోవద్దని యువతకు ఇచ్చే సందేశం.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రాజకీయాల్లోనే తిరగాలి. రాజకీయ నాయకులకే ఉపయోగపడాలి. ఏదో విధంగా ఏదో పదవి అందుకోవచ్చు. ఇలాంటి ఆలోచనాధోరణి పెరుగుతోందని తెలుగుదేశం చినబాబు లోకేష్ గమనించారు. అందుకే ‘ఆషాఢం ఆఫర్’ ప్రకటించారు.
‘కేసులకు వెనుకాడవద్దు..ఎన్ని కేసులు వుంటే అంతకు తగిన నామినేషన్ పోస్ట్ ఇస్తా’ అంటూ బహిరంగంగా అనౌన్స్ చేసారు. ఏ బంపర్ ఆఫర్ కు అయినా ఓ పీరియడ్ అన్నది కూడా వుంటుంది కదా. లోకేష్ కూడా ఇలాగే టైమ్ జోన్ సెట్ చేసారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఎవరి మీద ఎక్కువ కేసులు వుంటే వాటిని బట్టి పదవి అని అనౌన్స్ చేసారు.
పాపం ఇప్పటి వరకు సమయం వృధా చేసి వారు, లేదా వెనుకబడిన వారు ఇప్పుడికన్నా మంచి తరుణం, మించిన దొరకదు అంటూ, ఈ ఒక్క ఏడాదిలోనే ఓ డజనో, డజనున్నర కేసులో మీదేసుకోవాల్సి వుంటుంది. అప్పుడు మాంచి నామినేటెడ్ పోస్ట్ వరిస్తుంది.
అంతా బాగానే వుంది. ఆఫర్ అదిరింది.. కానీ తీరా చేసి 2024లో తెలుగుదేశం ప్రభుత్వం రాకపోతే, పరిస్థితి ఏమిటి? పదవి రాకపోగా, జీవితం మొత్తం నాశనం అయి పోతుంది కదా? అది ఒక్కటి ఆలోచిస్తే చాలు.. ఈ బంపర్ ఆఫర్ అస్సలు క్లిక్ కాదు. లోకేష్ బాబు కోసం కేసులు మీదేసుకుని, పోలీస్ స్టేషన్లు, కోర్టుల వెంట తిరగేవాళ్లు దొరకరు.