‘ముని’ వాక్యం.. శ్రీనివాసా చూడు.. శ్రీవాణి గోడు..

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరువేంకటగిరినాధుని సన్నిధిలో జరుగుతున్న ఒక వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ వ్యాసం ఆ చర్చకు ముడిపడినది కాదు. ఆ జోలికి వెళ్లడం లేదు. అపరిపక్వ రాజకీయ వ్యాఖ్యాతల…

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరువేంకటగిరినాధుని సన్నిధిలో జరుగుతున్న ఒక వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ వ్యాసం ఆ చర్చకు ముడిపడినది కాదు. ఆ జోలికి వెళ్లడం లేదు. అపరిపక్వ రాజకీయ వ్యాఖ్యాతల స్వార్థ భావజాలాలను వ్యాప్తి చెందించడానికి ఉద్దేశించినది కాదు. అలాగని, ఔచిత్యం లేని పథకాలను ప్రవేశపెట్టి, ఆ సొమ్ములలో కించిత్తు వృథా కాలేదని గణాంకాల సహా చాటుకుంటున్న తిరుమలేశుని భృత్యులను సమర్థించడాన్ని లక్ష్యించినది కూడా కాదు.

హిందూ ధర్మ పరిరక్షణ ముసుగులో వాస్తవంగా జరుగుతున్నది ఏమిటో చర్చించడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం. వారి ఆలోచన, కార్యచరణ లక్ష్యాలు ఏమైనప్పటికీ..  ధర్మానికి ద్రోహం జరుగుతున్నదని ఆరోపిస్తే తప్పు కాబోదనే విశ్వాసంతో చేస్తున్న ప్రయత్నం. శ్రీవాణి ట్రస్టుకు అందుతున్న నిధులు సవ్యంగా ఖర్చవుతున్నాయా? లేదా, నాయకులు విమర్శిస్తున్నట్టుగా కౌంటర్ల నుంచి నేరుగా తమ జేబులో పెట్టుకుని ఇళ్లకు వెళ్లిపోతున్నారా? అసలది సాధ్యమేనా? అనే అంశాలతో నాకు సంబంధం లేదు.

శ్రీవాణి ట్రస్టు ఎంత అద్భుతంగా పనిచేసినప్పటికీ.. దానిద్వారా జరగగల ఇతర నష్టాలు, టీటీడీకి వాటిల్లే నష్టాలు, సమాజానికి వాటిల్లే నష్టాలు, హిందూ ధర్మానికి వాటిల్లే నష్టాల గురించి ఆలోచిద్దాం.

పెరిగిన బ్లాక్ మార్కెట్!

శ్రీవాణి ట్రస్టు కు పదివేల రూపాయల విరాళం చెల్లిస్తే, వారికి రూ.500కు వీఐపీ టిక్కెట్ కేటాయించడం అనే పద్ధతిని వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని ధర్మకర్తల మండలి కార్యరూపంలోకి తెచ్చింది. దీనిద్వారా దళారీలకు అడ్డుకట్ట పడిందని అనుకోవడం ఒక భ్రమ. అందమైన ఆత్మవంచన. కాకపోతే, వీఐపీ టిక్కెట్ ధర పదివేల రూపాయలు అని టీటీడీ అధికారికంగా నిర్ణయించినట్లు అయింది. పైగా ప్రస్తుతం తిరుమలేశుని దర్శనాలకు సిఫారసు ఉత్తరాలు ఇచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

వీఐపీ బ్రేక్ అనే కోటా కింద అయిదారు వేల మందికి టికెట్లు ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. శ్రీవాణి కింద పదివేలు విరాళమిచ్చి వీఐపీ గుర్తింపు పొందుతున్న వారు వెయ్యి మందే. మిగిలిన వారంతా సిఫారసు ఉత్తరాల మీద వస్తున్న వారు. ఇందులో కనీసం సగం మంది దళారుల ద్వారా సిఫారసు ఉత్తరాల్ని, తద్వారా వీఐపీ టికెట్లను పొందినవారు.

దళారీల రాజ్యం గతంలో కూడా ఇంతగానూ పరిఢవిల్లుతోంది. కాకపోతే ఒక్కో వీఐపీ (ఆస్థాయి దర్శనాలు) టికెట్ ధర పదివేలు అనుకుంటే కుటుంబం టోకుగా మాట్లాడినప్పుడు.. కాస్త బేరసారాలు ఉండేవి. సిఫారసు ఉత్తరం తెచ్చిన దళారీతో బేరం మాట్లాడుకుంటే.. కాస్త తక్కువకు దొరికేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అధికారికంగా పదివేలుగా ధర నిర్ణయం అయ్యాక, దళారీలు రూపాయైనా తగ్గడం లేదు. ఆరుగురు భక్తులకు సిఫారసు ఉత్తరం పుట్టిస్తే.. పొందే టిక్కెట్ మీద ‘వీఐపీ బ్రేక్’ అనే పదమే ఉంటుంది గనుక.. అరవై వేల రూపాయలు ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు. ఆ ఉత్తరం పుట్టించడానికి తాము పడిన శ్రమకు వారు కట్టే కిమ్మతు వేరే ఉంటుంది.

అంటే.. శ్రీవాణి కోసం ప్రయత్నించి, వెయ్యి కోటా అయిపోయింది గనుక ఆ టికెట్లు దొరక్క.. బ్లాకులో కొందాం అనుకునే వారు.. దళారీలకు టికెటుకు రెండు మూడు వేలు అదనంగా ఇచ్చి కొనగలుగుతున్నారు. అందుకు వారికి రసీదు రాదన్నది స్పష్టం. శ్రీవాణి ట్రస్టు వలన దళారీలకు రాజమార్గం ఏర్పాటు అయింది. దీన్ని అడ్డుకోడానికి తగిన వ్యవస్థ లేనేలేదు. మహా అయితే  సిఫారసు ఉత్తరాల దర్శనాలకు వేరే పేరు పెట్టాలి. లేకపోతే ‘‘శ్రీవాణి-వీఐపీ’’ ముసుగులో దళారుల ఇష్టారాజ్యమైన దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంటుంది.

శ్రీవాణికి మాత్రమే ఎందుకు..?

శ్రీవాణి ట్రస్టు అనేది వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్ అయిన తర్వాత కొత్తగా ప్రారంభించిన ఆలోచన. దేశవ్యాప్తంగా హిందూ ఆలయాల జీర్ణోద్ధరణ, పేద ఆలయాలలో నిత్యపూజలకు తోడ్పాటు దీని లక్ష్యం. అంతవరకు అంతా బాగానే ఉంది.

శ్రీవాణి ట్రస్టు గురించిన వివాదం రేగిన తర్వాత.. టీటీడీ అధికారులు ఇచ్చుకున్న వివరణల్లో భాగంగా.. ఇప్పటికే 850 కోట్లరూపాయలు వచ్చాయని, 160 కోట్ల వరకు ఖర్చు పెట్టామని, ఈ అవసరానికి అనుకున్న దానికంటె అదనంగా నిధులు సమకూరినట్లేనని, అందుకే శ్రీవాణి కోటాను కూడా వెయ్యికి తగ్గించామని చెప్పారు. ఎందుకు తగ్గించాలి. సిఫారసు ఉత్తరాలకు ఇచ్చే అయిదారువేల కోటాను తగ్గించి.. శ్రీవాణి కోటానే పెంచితే.. సామాన్యభక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా? అనేది ప్రశ్న!

పైగా శ్రీవాణి ట్రస్టుకు ఇస్తే మాత్రమే.. ఎందుకు వీఐపీ కోటాగా చూడాలి? టీటీడీ ఆధ్వర్యంలో అనేక ట్రస్టుల రూపేణా అనేక మంచి పనులు జరుగుతున్నాయి. విద్య, వైద్యం, నిత్యాన్నదానం వంటి రూపాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో ఏ ట్రస్టుకు అదే మొత్తం ఇచ్చినా సరే వీఐపీ కోటాగా ఎందుకు పరిగణించకూడదు.. అనేది కీలకంగా గమనించాలి.

కేవలం శ్రీవాణికి మాత్రమే ఇస్తే ఆలయాల నిర్మాణాలు, కాంట్రాక్టులు తప్ప మరొకటి ఉండదు. పైగా దేవుడికి ఏదో ఒకరూపంలో కాస్త సొమ్ము ఇవ్వదలచుకున్న ప్రతి వ్యక్తీ.. ఆ సొమ్మును శ్రీవాణికే విరాళంగా ఇచ్చి.. వీఐపీ హోదా పొందుతున్నారు. దీనివల్ల.. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఇతర ట్రస్టులకు రాగల నిధులకు, విరాళాలకు కోతపడే అవకాశం ఉంది. వాటిద్వారా జరిగే సేవాకార్యక్రమాలు కుంటుపడే అవకాశం ఉంది.

వీఐపీ హోదా కోరుకునే వారికి పదివేల ధర పెట్టడం మంచిదే. కానీ.. టీటీడీలోని ఏ ట్రస్టుకు ఇచ్చినాసరే.. ఆ హోదా దక్కాలి. లేకపోతే ఇతర విభాగాలు దెబ్బతింటాయి. ఎటూ శ్రీవాణికి అవసరానికి మించి నిధులు వచ్చాయంటున్నారు గనుక.. ఇకనైనా ఈ పద్ధతి రావాలి. ఏట్రస్టుకు పదివేలు ఇచ్చినా వీఐపీ టికెట్ ఇవ్వాలి. ఆ కోటాను పెంచి సిఫారసుల కోటా తగ్గించాలి.

సమాజానికి, హిందూ ధర్మానికి చేటు ఎలాగంటే?

శ్రీవాణి ట్రస్టు కింద అందుతున్న నిధులను దేశవ్యాప్తంగా హిందూ ఆలయాల జీర్ణోద్ధరణకు ఉపయోగించడం అనేది చాలా మంచి విషయం. ఇందులోనూ ‘టీటీడీయేతర ఆలయాలకు కూడా ఎందుకు నిధులివ్వాలి? అది ప్రభుత్వాల పని కదా? ప్రభుత్వాలు జీర్ణోద్ధరణలు చేపట్టకుండా, హుండీ సొమ్ములకు మాత్రం లెక్కలు అడుగుతాయి కదా..’ అని వాదిస్తే అది వేరే ప్రస్తావన. కానీ.. దీనస్థితిలో ఉన్న ఆలయం టీటీడీ దా? కాదా? అని పట్టించుకోకుండా ప్రతి హిందూ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం అభినందించవచ్చు. అదే సమయంలో దళితవాడల్లో, ఎస్టీ కాలనీల్లో చిన్న చిన్న తిరుమలేశుని గుడులను నిర్మించడం కూడా శ్రీవాణి ట్రస్టు విశాల లక్ష్యాల్లో ఒకటి. ఈ ఆలోచన పట్ల కొన్ని అభ్యంతరాలున్నాయి.

గ్రామంలో ఒక గుడి ఉంటే ఉండవచ్చు. అదనంగా దళితవాడలో శ్రీవాణి ట్రస్టు నిధులతో ఒక చిన్న వేంకటేశ్వరుని గుడిని నిర్మిస్తారు. ఈ ఆలోచనను టీటీడీ చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. దీనిద్వారా ధర్మపరిరక్షణ చేస్తున్నట్టుగా చాటుకుంటున్నది.

మతమార్పిడులకు లోనవుతున్న వారు గరిష్టంగా ఈ ఎస్సీ, ఎస్టీ వర్గాలలోనే ఉన్నారు గనుక.. వారి కాలనీల్లో ఆలయాలు నిర్మించడం అనేది.. వారిని హిందూధర్మంలోనే కొనసాగేందుకు ప్రేరేపిస్తుందని వారు అంటున్నారు. స్థూలంగా చూసినప్పుడు ఇది చాలా మంచి ఆలోచన కదా.. అని హిందూధర్మ ప్రేమికులకు అనిపిస్తుంది. మతమార్పిడులు తగ్గిపోతాయని ఎవరైనా నమ్మినా ఆశ్చర్యం లేదు.

వాస్తవంలో.. దీని ద్వారా సమాజానికి ఎంత చేటు జరుగుతున్నదో గమనించాలి. అస్పృశ్యులుగా వివక్షకు గురవుతున్న వారిని ఆలయప్రవేశం చేయించడానికి ఈ దేశంలో గాంధీ సహా అనేక మంది మహానుభావులు అనేక పోరాటాలు చేశారు. అంటరాని వారిని గ్రామాల్లోని గుళ్లలోకి తీసుకువెళ్లారు. అంటరానితనం మాత్రం ఇవాళ్టికీ అలాగే ఉంది. ఏ మార్పూ రాలేదు.

హిందూ ధర్మం అంటేనే దుర్మార్గమైన మనుధర్మానికి ప్రతీక అని, అంటరానివాళ్లుగా సాటి మనుషుల్ని చులకన చేసే తప్పుడు వ్యవస్థ అని తొలినుంచి అనేక ఆరోపణలున్నాయి. కేవలం అంటరానితనాన్ని వ్యతిరేకించి, మేధావులు అనేక మంది హిందూధర్మం నుంచి పారిపోయిన దృష్టాంతాలున్నాయి. హిందూధర్మ భావజాలంపై ప్రేమ ఉన్నప్పటికీ.. ఇందులోని అంటరానితనం నచ్చక వెళ్లిపోయే వారికి బౌద్ధం ఆశ్రయం ఇచ్చింది.

టీటీడీ ఇప్పుడు చేస్తున్న పనులు అంటరానితనాన్ని, అస్పృశ్యతను ఇంకాస్త వేళ్లూనుకొనేలా చేస్తున్నాయి. దళితవాడలోనే ఒక చిన్న గుడి కట్టి ఇచ్చేయడం అంటే.. ‘‘మీ ఎస్సీల కోసం ఓ దేవుడిని మీదగ్గరే పెట్టేస్తున్నాం.. మీరు మా ఊరి గుడిలోకి రావొద్దు’’ అని అన్యాపదేశంగా సిద్ధాంతీకరించడమే. హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే.. మతమార్పిడులు జరగకుండా చూడాలనుకుంటే.. వారిని అంటరాని వాళ్లుగా చూడకుండా, అందరితో సమానంగా చూసే వ్యవస్థను తీసుకురావడం. గ్రామంలో ఉండే గుడిలోకి వారు కూడా వచ్చేలా ప్రోత్సహించడం. నిజానికి  ఇలా దళితులను వేరుచేసి చూసే ప్రయత్నాలు శ్రీవాణి ట్రస్టుకంటె ముందే ఎన్నడో మొదలయ్యాయి.

దళితవాడల్లో ప్రత్యేకంగా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించినప్పుడే ఈ ధర్మ ద్రోహానికి బీజం పడింది. ఊరిలో జరిగే కల్యాణం వేరే.. దళితవాడ కల్యాణం వేరే అన్నప్పుడే అది అంటరానితనానికి సుస్థిరరూపం ఇచ్చే ప్రయత్నం అయింది. అంతగా కోరుకుంటే ఊరిలో ఉన్న గుడిలోనే.. దళితులకోసం ఒకసారి ప్రత్యేకంగా కల్యాణం నిర్వహించి ఉంటే.. అగ్రవర్ణాలు అందరూ వెళ్లే గుడికే తామూ వెళుతున్నామనే ఆనందం వారికి దక్కేది. తమను ఎవ్వరూ వివక్షతో చూడడం లేదని, తామందరమూ సమానమేననే భావన వారిలో కలిగేది.

ఊరిలో మంచి గుడి ఉన్నప్పుడు.. దళితులు మాత్రం.. గతిలేని వాళ్లలాగా పదిలక్షలతో (అందుకు కేటాయిస్తున్న మొత్తం అదే అని టీటీడీ ప్రకటించింది) కట్టే చిన్న గుడిలో ఎందుకు పూజలు చేసుకోవాలి. దళితులుగా పుట్టినందుకు వారు ఆ ఖర్మను, లేమితనాన్ని, తమ లేమితనానికి ప్రతీకగా చిన్న దేవుడిని కొలుచుకోవాలా? ఇదెక్కడి ధర్మం, న్యాయం?

దళిత వాడల్లో గుడులు కట్టడం.. దళితుల్ని ఉద్ధరించడం అవుతుందా? హిందూ ధర్మానికి ద్రోహం తప్ప మరొకటి కాదు. ధర్మం కోసమే ఆ ప్రయత్నం అనే బూటకపు ఆత్మవంచనాత్మక మాటలను పెద్దలు మానుకోవాలి. దళితులకు గౌరవం అనేది.. అందరూ వెళ్లే గుడికి వారుకూడా రాగల వాతావరణాన్ని మరింతగా ప్రోత్సహించినప్పుడే అని తెలుసుకోవాలి.

శ్రీవాణి ట్రస్టు ద్వారా రేగుతున్న రాజకీయ వివాదాలు వేరు. వాస్తవంగా ధర్మానికి జరుగుతున్న నష్టం వేరు. ట్రస్టు నిధులు, ఖర్చుల గురించి.. ఆధారాల్లేని, నిరూపించడం సాధ్యం కాని పైపై ఆరోపణలతో అసలు నష్టాలు మరుగున పడిపోతున్నాయి. హిందూ ధర్మాన్ని గౌరవించే వారు, సమాజంలో అస్పృశ్యత వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపాలే తప్ప.. దేవుడి సొమ్ముతో వాటిని మరింతగా స్థిరీకరించడం నేరం, ద్రోహం అని నమ్మేవాళ్లు ఈ దిశగా ఆలోచించాలి. 

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె

[email protected]