వైఎస్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. వైఎస్ కుటుంబం ఏ పార్టీలో వుంటే, ఆ పార్టీకి కడప జిల్లాలోని మెజార్టీ ప్రజానీకం అండగా నిలుస్తోంది. దశాబ్దాల తరబడి వైఎస్ రాజశేఖరరెడ్డికి అండగా నిలిచిన కడప ప్రజానీకం, ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు కూడా అంతే అభిమానంతో వెన్నుదన్నుగా నిలుస్తోంది. ముఖ్యంగా కడప నగరానికి వస్తే… ముస్లిం మైనార్టీలు వైఎస్ జగన్‌పై ఆదరణ చూపుతున్నారు.
కడప ఎమ్మెల్యేగా అంజాద్‌బాషా వరుసగా రెండుసార్లు వైసీపీ తరపున గెలుపొందారు. కడప కార్పరేటర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అంజాద్ బాషా, ఆ తర్వాత కాలంలో వైఎస్ జగన్ వెంట నడిచి అంచెలంచెలుగా ఎదిగారు. డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు. ఇంత వరకూ బాగానే వుంది.
రెండోసారి అంజాద్ బాషా ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా పదవులు అందుకున్న తర్వాత, ఆయనలో మార్పు వచ్చిందని కడప నగర వాసులు అంటున్నారు. ఆ మార్పు నెగెటివ్ కోణంలో వుందనేది వారి అభిప్రాయం. ముఖ్యంగా అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా, మేనల్లుడు సోయబ్ వ్యవహారాలు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. కడపలో దుష్ట చతుష్టయం పేరుతో వెలువడిన కరపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో అంజాద్‌బాషా చోటు దక్కించుకోవడం గమనార్హం. కడప నగరంలో నాలుగు అధికార కేంద్రాలు రాజ్యం ఏలుతున్నాయి. వాటిలో అంజాద్ బాషా వర్గం ఒకటి. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఆయన తమ్ముడు, మేనల్లుడు మతం, కులాల ప్రాతిపదికన జనాన్ని చూస్తున్నారనేది బలమైన ఆరోపణ. ఇదే వైసీపీకి చాలా మందిని దూరం చేసేలా ఉందనే ఆందోళన కడపలో నెలకుంది. తమ వర్గానికి తప్ప, మిగిలిన సామాజిక వర్గాలకు అంజాద్ బాషా, ఆయన తమ్ముడు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరనే ఆరోపణ, ఆవేదన నగర వాసుల్లో ఉంది. ఇది కాదనలేని పచ్చి నిజం.
అలాగే అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్‌బాషా సెటిల్‌మెంట్లకు తెరలేపారు. ఈయనకు మేనల్లుడు సోయబ్ తోడయ్యాడు. దీంతో నిప్పుకు గాలి తోడనట్టైంది. వీళ్లు ఏం చెప్పినా చేయడానికి కడప తహశీల్దార్ శివరామిరెడ్డి సిద్ధంగా ఉంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బహుశా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడప తహశీల్దార్ సుదీర్ఘ కాలంగా ఒకే చోట తిష్ట వేశాడని నగర వాసులు ఆరోపిస్తున్నాయి. క్విడ్‌ప్రోకోనే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మేనల్లుడు సోయబ్ నిత్యం తహశీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే వుంటారనే టాక్. సంబంధిత కార్యాలయాలకు సొంత ఆస్తి సమస్యలపై వచ్చి వారి వివరాలు తెలుసుకోవడం, ఆ సమాచారాన్ని మేనమామ అహ్మద్‌బాషాకు అందిస్తూ… సెటిల్‌మెంట్లలో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొంత కాలం క్రితం కడప నగర శివార్లలో అమర్ ఆస్పత్రి వద్ద టీడీపీ నాయకుడు జమీల్‌కు చెందిన ఐదు సెంట్ల స్థలంపై కన్నేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, దాన్ని దారికి అడ్డంగా వుందంటూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని కలిపేశారు. ఆ సందర్భంలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది.
కడప నగరంలో భూదందాలకు పాల్పడే రెడ్డి బ్రదర్స్‌కు తామేం తక్కువ కాదని డిప్యూటీ సీఎం తమ్ముడు, మేనల్లుడు నిరూపించుకుంటున్నారనే చర్చకు తెరలేచింది. నిజానికి కడప నగరంలో ముస్లింలు, క్రిస్టియన్ మైనార్టీలు, రెడ్లు, బలిజ ఓటర్లు గెలుపోటములను డిసైడ్ చేస్తారు. డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారశైలితో వైసీపీ సానుకూల ఓటర్లలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని తగ్గించుకోకపోతే మాత్రం… కడపలో మతపరంగా ఖచ్చితంగా డివిజన్ ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు కులాల కంటే మతాలే ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయొచ్చు. ఆ పరిణామాలు తప్పకుండా వైసీపీకి నష్టం చేస్తాయి. కావున ప్రమాదం తీవ్రతరం కాకమునుపే అప్రమత్తం కావాల్సిన అవసరం వుంది.
పీ.ఝాన్సీ