కడపలో దుగ్గాయపల్లె బ్రదర్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున్‌రెడ్డి, ఆయన తమ్ముడు వీరారెడ్డి కడప కేంద్రంగా భూదందాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దుగ్గాయపల్లె మల్లికార్జున్‌రెడ్డి వరుసకు చిన్నాన్న అవుతారు. అమ్మ తరపు బంధువైన చిన్నాన్న మల్లికార్జున్‌రెడ్డిపై సీఎం జగన్‌కు ప్రేమాభిమానాలు వుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ దుగ్గాయపల్లె బ్రదర్స్ అరాచకాలపై కూడా జగన్‌కు ప్రేమ వుంటే ఎలా అనే చర్చకు తెరలేచింది.
గతంలో ఒక కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో తనకు వరుసకు చిన్నాన్న అయ్యే వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేయించి, అనంతరం జైల్లో కూడా పెట్టించారు. అంతటితో ఆగకుండా, వైఎస్ కొండారెడ్డిని కడప జిల్లా నుంచి బహిష్కరించారు. దీంతో నేరాలకు పాల్పడితే కుటుంబ సభ్యుల్ని సైతం సీఎం జగన్ వదిలి పెట్టరనే సంకేతాలు ఇచ్చారు. కానీ దుగ్గాయపల్లె బ్రదర్స్ విషయానికి వచ్చే సరికి జగన్ ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారనే ప్రశ్న తలెత్తింది.
దుగ్గాయపల్లె మల్లికార్జున్‌రెడ్డి చాలా సుతిమెత్తగా మాట్లాడ్తారు. నోట్లో వేళ్లు పెట్టినా కొరకడనే అమాయకత్వాన్ని ఆయన ప్రదర్శిస్తారని కడప నగర వాసులు చెబుతుంటారు. అయితే దుగ్గాయపల్లె బ్రదర్స్ చర్యలు మాత్రం దుర్మార్గంగా వుంటాయని అంటున్నారు. ముఖ్యంగా అన్నను అడ్డు పెట్టుకుని దుగ్గాయపల్లె వీరారెడ్డి చేయని నేరం, అరాచకం లేదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల “గ్రేట్ ఆంధ్ర” లో “కడపలో జగన్ రాబంధు(వు)లు” శీర్షికతో వెలువడిన కథనం తీవ్ర దుమారం రేపింది.
కడప నగరవాసుల అభిప్రాయాలను వందకు వందశాతం ప్రతిబింబించేలా కథనం వుందనే చర్చకు తెరలేపింది. అయితే దుగ్గాయపల్లె బ్రదర్స్ వల్ల రాజకీయంగా వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లుతున్నా, పార్టీ పెద్దలు ఎందుకని చర్యలు తీసుకునేందుకు ముందూవెనుకా ఆలోచిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది. వైఎస్ కొండారెడ్డిపై వేటు వేయడానికి భయపడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, దుగ్గాయపల్లె బ్రదర్స్ అరాచకాలపై మాత్రం ఆచితూచి వ్యవహరించడం ఏంటనే నిలదీత ఎదురవుతోంది.
ఇప్పటికే దుగ్గాయపల్లె బ్రదర్స్ కడప కేంద్రంగా సాగిస్తున్న భూదందాలు, సామాన్యుల ఆస్తుల్ని బలవంతంగా లాక్కోవడంపై ప్రభుత్వానికి నివేదికలు వెళ్లినట్టు సమాచారం. ఇప్పుడు వైఎస్ జగన్ ఎదుట రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి…రాజకీయంగా తన ఉన్నతికి భుజాన్ని ఇచ్చిన కడప వాసులకు అండగా నిలబడడమా?, రెండోది …తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని అదే ప్రజల్ని పీడిస్తున్న దుగ్గాయపల్లె బ్రదర్స్‌కు కొమ్ము కాయడమా?
రాజకీయంగా తనకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చిన కడప ప్రజల మానప్రాణ, ఆస్తుల రక్షణ కంటే, దుగ్గాయపల్లె బ్రదర్సే మిన్న అనుకుని వారిని అలా వదిలేస్తే, జనం కూడా వారి నిర్ణయాన్ని తగిన సమయంలో తీసుకుంటారు. కావున వైఎస్ కొండారెడ్డిపై వేటు వేసిన స్ఫూర్తితో దుగ్గాయపల్లె బ్రదర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటే, కడప వాసుల దృష్టిలో జగన్ అంటే హీరోనే. కడప వాసులు కోరుకుంటున్నది ఒక్కటే…. తమకు మంచి చేయకపోయినా, కనీసం దుష్టల చేతిలో అధికారాన్ని పెట్టొద్దని. ఈ కోరికేమీ నేరం, ఘోరం కాదనుకుంటా.
పీ.ఝాన్సీ