ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని కొందరు అక్రమాలకు తెరలేపారు. ఇంతింతై అన్నట్టు… చిన్నచిన్న నేరాలతో మొదలు పెట్టి, ఇప్పుడు కడప నగరానికి ప్రజాకంఠకంగా తయారయ్యారు. సీఎం జగన్‌కు సమీప బంధువులైన దుగ్గాయపల్లె బ్రదర్స్ పేరు చెబితే చాలు … కడప నగరం భయంతో గజగజ వణికిపోతోంది. కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలం దుగ్గాయపల్లెకు చెందిన ఈ సోదరులు, కడప నగరాన్ని అడ్డాగా చేసుకుని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని యథేచ్ఛగా భూకబ్జాలకు తెగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కడప నగరంలో దుగ్గాయపల్లె బ్రదర్స్ ఆగడాల గురించి జనం కథలుకథలుగా చెబుతున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా, అందరి ఆస్తుల్ని అప్పనంగా దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. రోజురోజుకూ కడప నగరం అభివృద్ధి చెందు తోంది. దీంతో స్థలాలకు విలువ పెరిగింది. ఇదే అదనుగా తీసుకుని కడప శివార్లలో భూదందాలకు తెరలేపారు. ఇందుకోసం ఒకట్రెండు ముఠాలను సైతం సిద్ధం చేసుకున్నారు.
ఈ నెల 23న కడప నగరం నడిబొడ్డున వైసీపీ యువ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి హత్యకు గురి కావడంతో దుగ్గాయపల్లె బ్రదర్స్ భూదందా వ్యవహారాల గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. అసలైన వాళ్లనే నరికిపారేసింటే కడప నగరానికి, వైసీపీకి పట్టిన శని, పీడ విరగడయ్యేవనే ఘాటు కామెంట్స్ వినిపిస్తున్నాయంటే, జనం ఎంతగా విరక్తి చెందారో అర్థం చేసుకోవచ్చు. దుగ్గాయపల్లె బ్రదర్స్ వల్ల వైసీపీకి పది ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు.
వీరి ఆగడాలతో ఇవాళ వైసీపీకి కంచుకోట లాంటి కడపలో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అనుమానాలు తలెత్తే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. దుగ్గాయపల్లె బ్రదర్స్ ఆగడాలపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక సమర్పించకుండా ఏం చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. దుగ్గాయపల్లె బ్రదర్స్ ఆగడాల అన్నీఇన్నీ కావని జనం చెబుతున్నారు.
ఇటీవల ఇసుక రీచ్‌లో దుగ్గాయపల్లె బ్రదర్స్‌లో తమ్ముడు మోసగించడంతో వైసీపీ నేత నారాయణరెడ్డి ఆత్మహత్యకు యత్నించచడం రాష్టర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే చెన్నూరు మండలం రామన్నపల్లెకు చెందిన ఓ యువ జంట ఏకంగా ఆత్మహత్యకే పాల్పడిందంటే, వీరి వేధింపులు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కడప నగర శివార్లలోని పరమేశ్వర స్కూల్ వద్ద 28 సెంట్లు, గోటూరు వద్ద నాలుగు ఎకరాలు, చిన్నచౌక్‌లో పలువురు వైద్యులు రెండు ఎకరాల స్థలాన్ని వివాదాస్పదం చేయడంతో ప్రస్తుతం గొడవ నడుస్తోంది.
దీని వెనుక దుగ్గాయపల్లె బ్రదర్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం, అధికారాన్ని అడ్డు పెట్టుకుని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులకు చెప్పి, స్థలాల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయించి, చివరికి తమ వద్దకే రప్పించుకుని, పంచాయితీలు చేసి, తాము ఇచ్చిందే మహాభాగ్యం అని కళ్లకద్దుకుని తీసుకెళ్లేలా దుగ్గాయపల్లె బ్రదర్స్ దాదాగిరి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో స్థలం కొనుగోలు చేయగా, నకిలీ డాక్యుమెంట్ సృష్టించి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా సదరు విశ్రాంత ఉపాధ్యాయుడు దుగ్గాయపల్లె బ్రదర్స్‌తో పాటు ఇటీవల హత్యకు గురైన శ్రీనివాస్‌రెడ్డిని సర్వనాశనమై పోతారని శపించినట్టు కడన నగరంలో కథలా చెప్పుకుంటున్నారు. అలాగే కడప పారిశ్రామికవాడలో కోటిన్నర స్థలంపై దుగ్గాయపల్లె బ్రదర్స్ కన్నుపడింది. నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ స్థలంలో గోడ కట్టించారు. దీంతో హైదరాబాద్‌లో వుంటున్న స్థల యజమాని లబోదిబోమంటూ కడపకు వచ్చాడు. తన మిత్రుడైన డీఎస్పీని వెంట తీసుకెళ్లి స్థలాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి రూ.30 లక్షలు తీసుకుని ఆ స్థలాన్ని దుగ్గాయపల్లె బ్రదర్స్‌కు అప్పనంగా రాయాల్సి వచ్చింది. ఇలా ఒకటా, రెండా… వందలకొద్ది దందాలు, దోపిడీలు.
వందల కోట్ల విలువైన స్థలాల్ని ఇప్పటికే దుగ్గాయపల్లె బ్రదర్స్ దోచుకున్నారనే వార్తలు భయపెడుతున్నాయి. దుగ్గాయపల్లె బ్రదర్స్‌లో పెద్దాయనకు సీఎం జగన్ రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి కూడా ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. ఈయన గారికి టు ప్లస్ టు గన్‌మెన్స్‌ను కూడా కేటాయించారు. అలాగే ఎస్కార్ట్ వాహనం కూడా ఇచ్చి నగరంలో దోపిడీలు చేసుకోవాలని అనధికార అనుమతి ఇచ్చారేమో అనే వ్యంగ్య కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కడప నగరంలో వైసీపీకి దుగ్గాయపల్లె బ్రదర్స్ తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తున్నారు. ఇందుకేనా మనం జగన్‌ను సీఎం చేసుకున్నదనే ఆవేదన వైసీపీ శ్రేణుల్లో కూడా కలుగుతోంది. మళ్లీ జగన్‌ను సీఎం చేసుకుంటే, ఎవర్నీ బతకనివ్వరనే భయం కడప నగరవాసుల్లో కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో మాజీ నక్సలైట్ నయీంను మరిపించేలా దుగ్గాయపల్లె బ్రదర్స్ దందాలు, దోపిడీలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
కేవలం సీఎం వైఎస్ జగన్‌తో బంధుత్వమే ఎన్ని అరాచకాలు చేయడానికైనా అనుమతి ఇచ్చినట్టైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దుగ్గాయపల్లె బ్రదర్స్ ఆగడాలను ఇప్పటికైనా అడ్డుకోకపోతే, సీఎం సొంత జిల్లాలో వైసీపీ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. కడపలో జగన్‌కు బంధువులు కాస్త రాబంధులుగా మారారనే విమర్శ వుంది.
పీ.ఝాన్సీ