ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతుండంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులు.. మరోవైపు వాటిని క్యాష్ చేసుకుని కల్తీ కేటుగాళ్లు మరీంత రెచ్చిపోతున్నారు. ఉప్పు, కారం నుండి మొదలుకొని దాదాపు అన్నిటిలోనూ కల్తీలు పాల్పడుతుండడంతో పాటు వాటిపై ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో కల్తీగాళ్లు మరింతగా దిగజారిపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ నేరేడ్‌మెట్ పరిధిలోని ఆర్కేపురంలో ప్రజలు మరింత అసహ్యించుకొనే కల్తీ భాగోతం బయటపడింది. ఆర్కేపురంలో ఉండే రమేశ్ శివ అనే వ్యక్తి గుట్టు చప్పుడూ కాకుండా తన నివాసంలోనే గత కొన్నేళ్లుగా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్న ఘటన బయట పడింది.
తొలుత పంది మాంసం విక్రయించే వారి నుండి కొవ్వును సేకరించి.. కొవ్వును వేడి చేసి అందులో పలు రసాయనాలు కలిపి అచ్చం వంట నూనెలా తయారు చేసి రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ దుకాణాలకు తక్కువ ధరకే అమ్మేవాడు.. విషయం పోలీసులకు తెలియడంతో రమేశ్ నివాసంపై ఆకస్మిక సోదాలు చేయడంతో బండారం మొత్తం బయటపడింది. దీంతో పోలీసులు ఆ కేటుగాడ్ని అరెస్ట్ చేశారు.
దీంతో పంది కొవ్వు నూనెను కొనుగోలు చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ దుకాణదారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటివి తినడం వల్ల డబ్బులు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే. అధికారులు పెద్ద పెద్ద హోటల్‌లను తనీఖీ చేసినట్లే అన్ని ఫుడ్ దుకాణాలు కూడా తనీఖీలు చేస్తే అంతో ఇంతో మార్పు రావచ్చు తప్పా.. కల్తీని పూర్తిగా అరికట్టడం సాధ్యమయ్యే పని కాదంటున్నారు విశ్లేషకులు.