తమతో ప్రత్యర్థులు మర్యాదగా ఉండాలని ఎలా కోరుకుంటామో, మనం కూడా వారి విషయంలో అంతే గౌరవంగా వుండాలి. అదేంటో గానీ, చంద్రబాబునాయుడు మరోలా ఆలోచిస్తున్నారు. తన భార్యను ఏదో అన్నారని వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల విషయంలో అమర్యాదగా ప్రవర్తించే వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది.
విదేశాల్లో వుంటూ నిత్యం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెడుతూ శునకానందం పొందుతున్న పోకిరీ యువతికి చంద్రబాబు ఫోన్ చేసి వత్తాసు పలకడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రవాసాంధ్రురాలైన ఆ యువతి ఆగడాలను అరికట్టే క్రమంలో వైసీపీ సోషల్ మీడియా ఆమె బాగోతాలన్ని బట్టబయలు చేసింది.
దీంతో సదరు యువతి సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చి లబోదిబోమంది. సహజంగానే జగన్‌ను తిట్టిపోసింది. చంద్రబాబును ఆకాశానికెత్తింది. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన గారు సదరు పోకిరీ యువతికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అవాకులు చెవాకులు పేలడం చంద్రబాబు దృష్టిలో సదరు యువతి పోరాటం చేస్తున్నట్టుగా అనిపించింది.
ఆ యువతికి తన సంపూర్ణ మద్దతు వుంటుందని చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు, ఆమెకు ఫోన్ చేసి జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యుల్ని ఇలాగే తిట్టాలని ప్రోత్సహించారు. జగన్‌ను దూషించడం భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని, అది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అంటూ చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. అసత్యాలు, దుష్ప్రచారాలతో భయపెట్టాలనుకునే వైసీపీ వ్యూహాలు ఆమె(పోకిరీ యువతి)లాంటి బలమైన వ్యక్తుల సంకల్పాన్ని దెబ్బతీయలేవంటూ చంద్రబాబు ట్వీట్ చేయడం విషాదం అని నెటిజన్లు మండిపడుతున్నారు. కనీస మంచీమర్యాద చూసుకోకుండా పోకిరీలకు వత్తాసు పలకడాన్ని జనం ఛీ కొడుతున్నారు.