పెద్దకులాల వారికి ఇది చా..లా పెద్ద సవాలు!

పెద్దకులాల వారి సంఖ్య (శాతం) తక్కువగానే ఉంటుంది. కానీ రాజకీయాల్లో వారికే పెద్దపీట లభిస్తూ ఉంటుంది. ఎందుకు? రెండు శాతం, నాలుగు శాతం ఉండే కులాలకు చెందిన వారు.. ఎక్కువ పదవులు ఎలా దక్కించుకోగలుగుతున్నారు?…

పెద్దకులాల వారి సంఖ్య (శాతం) తక్కువగానే ఉంటుంది. కానీ రాజకీయాల్లో వారికే పెద్దపీట లభిస్తూ ఉంటుంది. ఎందుకు? రెండు శాతం, నాలుగు శాతం ఉండే కులాలకు చెందిన వారు.. ఎక్కువ పదవులు ఎలా దక్కించుకోగలుగుతున్నారు? అనేది సాధారణంగా ఒక పజిల్. దీనికి జవాబుగా ఒక వాదన వినిపిస్తుంటుంది. 

పెద్ద కులాల వారంటే.. కేవలం సంఖ్యాపరంగా చూస్తే సరిపోదు. పెద్దకులాల వాళ్లు పది మంది ఉన్నా సరే.. చిన్న కులాల వారిని వందలు వేల మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగే విధంగా, చేయగలిగేంత బలంగా ఉంటారు. అందువల్లనే పెద్దకులాల వారికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. పెద్దపీట వేస్తుంటాయి.. అనేది ఆ వాదన!

ఆ రకమైన వాదనకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ కూర్పు నిర్ణయం ద్వారా చాలా పెద్ద సవాలు విసిరారు. పెద్ద కులాల వారు.. తమ స్థానిక బలాల్ని బట్టి.. చిన్న కులాలకు చెందిన వేల మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం, ప్రభావితం చేయడం నిజమే అయితే.. ఆ వాదనలో పస ఉంటే జగన్మోహన్ రెడ్డి సర్కారుకు గడ్డు రోజులు తప్పవు. 

ఎందుకంటే..ఆయన తాజా మంత్రివర్గంలో కీలకమైన నాలుగు పెద్ద కులాలకు అస్సలు ప్రాతినిధ్యమే లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ వర్గాల వారికి కేబినెట్ లో చోటు లేదు. ఈ కులాల వారి సంఖ్య తక్కువే అయినా.. ‘సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్’ అనే ట్యాగ్ లైన్ తో వీరు చెలామణీ అవుతుంటారు. వీరి మాటకు నిమ్నకులాల్లో చెల్లుబాటు ఉంటుందని, వీరి మాట మేరకే వారి పరిధిలోని నిమ్న కులాల వారు ఓట్లు వేస్తారని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి జాబితాలో రెడ్డి కులం కూడా ఉంటుంది గానీ.. వారికి ఈ కేబినెట్ లో ప్రాధాన్యం బాగానే దక్కింది. 

అయితే ఈ రకంగా జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ కూర్పు అనేది ఒక లిట్మస్ టెస్ట్. ఇప్పుడు కేబినెట్ లో తిరస్కృతులైన నాలుగు అగ్రకులాల వారు నిజంగానే ప్రజలను ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరా లేదా అనే దానికి ఇది టెస్ట్. 

ప్రభుత్వం నిజంగా నిమ్నకులాల వారికి, బలహీన వర్గాల వారికి అనుకూలంగా పనిచేసి, వారి వికాసానికి అనేక నిర్ణయాలు తీసుకుంటే గనుక.. ప్రజలు ప్రభుత్వం చేపడుతున్న పనులకు ప్రభావితం అవుతారా? లేదా, లోకల్‌గా తమ ప్రాంతాల్లో తమకు తామే పెద్దరికాన్ని ఆపాదించుకుని ప్రభావితం చేయాలని చూసే పెద్ద కులాల వారి మాటలకు ప్రభావితం అవుతారా? అనే సంగతి నిగ్గు తేల్చడానికి ఇది ఒక లిట్మస్ టెస్ట్. 

బలహీన వర్గాల వారితో ప్రభుత్వం నేరుగా సంబంధాలు పెట్టుకోగలిగినప్పుడు.. మధ్య దళారీ పాత్రలో ఉండే సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవసరం ఉండదు.. అనేది జగన్ నమ్ముతున్న సిద్ధాంతం అనిపిస్తోంది. ఆ సిద్ధాంతం నిజమా కాదా ఇప్పుడే తేలదు.