ఎంద‌రో నిరాశ‌వ‌హులు.. అంద‌రికీ కావాలి ఓదార్పు!

ఏపీ మంత్రి మండ‌లి పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ వ్య‌వ‌హారం ఒక కొలిక్కి  వ‌చ్చింది. కొత్త మంత్రులు, వారికి శాఖ‌ల కేటాయింపు జ‌రిగిపోయింది. మరో రెండేళ్ల‌లో ఎన్నిక‌లున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో.. ఇక మంత్రివ‌ర్గంలో చెప్పుకోద‌గిన మార్పుచేర్పులు ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు. …

ఏపీ మంత్రి మండ‌లి పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ వ్య‌వ‌హారం ఒక కొలిక్కి  వ‌చ్చింది. కొత్త మంత్రులు, వారికి శాఖ‌ల కేటాయింపు జ‌రిగిపోయింది. మరో రెండేళ్ల‌లో ఎన్నిక‌లున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో.. ఇక మంత్రివ‌ర్గంలో చెప్పుకోద‌గిన మార్పుచేర్పులు ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు. 

ఏ రాజ‌కీయ పార్టీలో అయినా.. పార్టీ  అధికారంలోకి రాగానే.. మంత్రిప‌ద‌వుల విష‌యంలో ర‌క‌ర‌కాల పోటీలుంటాయి. ఆశావ‌హులుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు మిన‌హాయింపు  కాదు. మూడేళ్ల కింద‌ట జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడే ఈ వ్య‌వ‌హారం ర‌సకందాయ‌కంగా నిలిచింది. అప్ప‌ట్లోనే మంత్రివ‌ర్గ కూర్పుతో సీఎం జ‌గ‌న్ కొంద‌రిని బాగా నిరాశ ప‌రిచారు.

జ‌గ‌న్ మంత్రివ‌ర్గం ఉంటుంద‌నుకున్న దానికి భిన్న‌మైన రీతిలో ఏర్ప‌డింద‌ప్పుడు. వ్య‌క్తులు కావొచ్చు, ప‌ద‌వుల కేటాయింపు కావొచ్చు, ఐదు మంది డిప్యూటీ సీఎంలు కావొచ్చు.. ఇలాంటి అంశాల‌న్నీ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ధోర‌ణిలోనే జ‌గ‌న్ మొద‌టి కేబినెట్ ఏర్ప‌డింది.

రెండున్న‌రేళ్ల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ గ‌డువును జ‌గ‌న్ అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించి మరింత ఆస‌క్తిని రేపారు. ఈ సారి కూడా జ‌గ‌న్ మంత్రివ‌ర్గం మొద‌టి సారి త‌ర‌హాలోనే భిన్న‌మైన పేర్ల‌తోనే ఏర్ప‌డుతుంద‌ని ఊహించిన‌వారు మాత్రం త‌మ ఊహ‌లు నిజం అయ్యాయ‌ని అనుకోవ‌చ్చు.

ఇక రెండో విడ‌త గ్యారెంటీ మంత్రులు.. అనుకున్న వారిలో మాత్రం చాలా మందికి అవ‌కాశం ద‌క్క‌లేదు. తొలిసారే మంత్రులు కావొచ్చ‌నుకున్న వారిలో రోజా మాత్ర‌మే రెండోసారి సాధించుకోగ‌లిగారు. అంబ‌టి రాంబాబుకు అవ‌కాశం ద‌క్క‌ద‌నుకున్న వారినీ జ‌గ‌న్ ఆశ్చ‌ర్య ప‌రిచారు. 

రోజా, అంబ‌టిలు తొలి విడ‌తే కేబినెట్ లో ఉండాల్సింద‌న్న వారికి .. ఇప్ప‌టికి ఊర‌ట‌. మొద‌టి సారి మంత్రివ‌ర్గ ప్ర‌మాణ స్వీకార‌మ‌ప్పుడు అంబ‌టి విదేశీ యాత్ర‌కు వెళ్లిపోయార‌ట పాపం. ఎట్ట‌కేల‌కూ ఆయ‌న‌కు అవ‌కాశం ల‌భించింది. 

పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు హార్డ్ కోర్ జ‌గ‌న్ సైన్యంగా వ్య‌వ‌హ‌రించిన కొడాలి నాని, అనిల్ కుమార్ యాద‌వ్ ల‌కు తొలి విడ‌త‌లో, రోజా, అంబ‌టిల‌కు రెండో విడ‌త‌లో మంత్రి మండ‌లిలో స్థానం ద‌క్కిందిలా. ఇక నిరాశావ‌హుల‌కు లోటు లేదు. వీరి కోసం మాత్రం జ‌గ‌న్ ఒక మినీ ఓదార్పు యాత్ర‌ను చేప‌ట్టాల్సిందే!