సార్వత్రిక ఎన్నికలకు సమయం తరుముకొస్తోంది. ఈ దఫా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఆంధ్రప్రదేశ్ దశ, దిశను మార్చేందుకు కీలకం. 2024లో వైసీపీ గెలుపు, దుష్టశక్తుల ఓటమిగా చూడాల్సి వుంటుంది. టీడీపీ ఓటమి అంటే… పేదల గెలుపు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే నాయకత్వం విజయంగా చూడాల్సి వుంటుంది. రానున్న రోజుల్లో వైసీపీ గెలుపుతో దుష్టశక్తులు శాశ్వతంగా కనుమరుగు కానున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏనాడూ తాను చేసిన మంచి పనులు చెప్పుకుని ఎన్నికలకు వెళ్లలేదు. భవిష్యత్‌లో వెళ్లలేరు కూడా. దీనికి కారణం 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు…తనకంటూ సొంత ముద్ర వేసుకునేలా ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోవడమే. తగదునమ్మా అంటూ మళ్లీ ఆయన తాజాగా నెత్తికెత్తుకున్న నినాదాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.
“రాష్ట్రం గెలవాలంటే జగన్ ఓడిపోవాలి. క్రూరాతి క్రూరమైన వ్యక్తిని, కరుడుగట్టిన ఆర్థిక నేరస్తుడ్ని సీఎంని చేసి ప్రజలు మోసపోయారు”
ఇదీ చంద్రబాబు తాజా మాట. ప్రజలంటే ఆయనకు ఎంత చిన్న చూపో ఈ మాటలే తెలియజేస్తున్నాయి. తనను గెలిపించాలని నేరుగా ప్రజలకు విన్నవించుకోలేని దయనీయ స్థితి చంద్రబాబుది. జగన్‌ను సీఎం చేసి ప్రజలు మోసపోయారని, ఓడిపోయారని ఆయన అంటున్నారు. అంతే తన ఓటమిని ఇప్పటికీ అంగీకరించలేదని మనస్తత్వం చంద్రబాబుది. జగన్‌ను ఓడించడం అంటే రాష్ట్రం గెలవడమే అని ఆయన అంటున్న మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి.
2014లో విభజిత రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం, ఇందుకు ఇతర ప్రతిపక్ష పార్టీల పొత్తు తోడు కావడంతో చంద్రబాబు చేతికి పాలన పగ్గాలు వచ్చాయి. అయితే ఐదేళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు చంద్రబాబు పాలించలేకపోయారు. అందుకే ఆయన్ను ఇంటికి సాగనంపి, వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకొచ్చారనేది వాస్తవం.
చంద్రబాబు దుర్మార్గ పాలనకు నిదర్శనం… 2014 టీడీపీ మ్యానిఫెస్టోను ఆ పార్టీ వెబ్‌సైట్ నుంచి తొలగించడం. ఏ రాజకీయ పార్టీకైనా మ్యానిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదంటారు. అంతటి పవిత్రమైన గ్రంథాలతో పోల్చే మ్యానిఫెస్టోను టీడీపీ వైబ్‌సైట్ నుంచి తొలగించారంటే, బాబు ఐదేళ్ల పాలనలో హామీలను ఏ మేరకు అమలు చేశారో అర్థం చేసుకోవచ్చు. 2014లో తనను ఆదరిస్తే ప్రజలు విజ్ఞులైనట్టు, ఓడిస్తే మోసపోయినట్టు అభివర్ణించడం చంద్రబాబుకే చెల్లింది.
చంద్రబాబు రాజకీయం కులం, మతం, వెన్నుపోటు, విద్వేషం, డబ్బు పునాదులపై నిర్మితమైంది. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ కవిత గుర్తుకొస్తోంది.
కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా- హీనంగా చూడకు దేన్నీ! కవితామయమేనోయ్ అన్నీ!
రొట్టెముక్కా, అరటి తొక్కా, బల్లచెక్కా- నీ వేపే చూస్తూ ఉంటాయ్! తమ లోతు కనుక్కోమంటాయ్!
తలుపు గొళ్లెం, హారతి పళ్లెం, గుర్రుపు కళ్ళెం- కాదేదీ కవిత కనర్హం!…ఇలా సాగుతుంది మహాకవి కవిత్వం.
చంద్రబాబు దృష్టిలో ప్రతిదీ రాజకీయ వస్తువే. వెన్నుపోటు పొడవడానికి పిల్లనిచ్చిన మామైనా, మామను పదవీచ్యుతుడిని చేయడంలో సహకరించిన బామ్మర్దులు, సడుగుడైనా, ఓట్లు వేసి అధికారం అప్పగించిన ప్రజలైనా….ఎవరనేది ప్రశ్నే కాదు. తన అధికారానికి అక్కరకొచ్చారా? లేదా? అనేది ముఖ్యం. అవసరం తీరిన తర్వాత కరివేపాకులా విసిరిపారేయడం చంద్రబాబు నిజ స్వరూపం.
చంద్రబాబు చదువుకునే రోజుల నుంచే కులం పునాదులపై రాజకీయ భవిష్యత్‌ను నిర్మించుకున్నారు. బాబు ఎదుగుదలలో అడుగడుగునా ఎందరో నాయకులు సమిధులయ్యారు. వీరిలో ప్రముఖంగా చిత్తూరు మాజీ ఎంపీ, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎస్వీయూనివర్సిటీలో చదివే రోజుల్లో కుల రాజకీయాలకు చంద్రబాబు నాయకత్వం వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచి చంద్రబాబు మొదటిసారి పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
1983లో తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినా, ఆ పార్టీ భవిష్యతఫై నమ్మకం లేకపోవడంతో కాంగ్రెస్‌లోనే వుండిపోయారు. ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన వైనం గురించి కథలుకథలుగా వింటు న్నాం. టీడీపీ ఘన విజయం సాధించడంతో ఏ మాత్రం ఆలోచించకుండా మామ పంచన చేరారు. ఆ తర్వాత 1995లో పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారు. మామను గద్దె దింపేందుకు నందమూరి లక్ష్మీపార్వతిని అస్త్రంగా ప్రయోగించారు.
అంతటి ఎన్టీఆర్‌నుఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని స్త్రీలోలుడిగా, అహంకారిగా చిత్రీకరించారు. అలాగే ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఆయనది కాకుండా చేశారు. ఇందుకు డబ్బు, ఇతరత్రా వాటిని ప్రలోభపెట్టి, అనుకున్నది సాధించగలిగారు. ఎంతో ప్రజాదరణ కలిగిన ఎన్టీఆర్‌ను గద్దె దించడంతో చంద్రబాబు స్వభావం గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.
అప్పటి నుంచే మీడియా, ఇతర వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేయడం గురించి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. వాటిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చక్రం తిప్పే చాణక్యుడిగా గుర్తింపు పొందారు. టీడీపీని రెండు రకాలుగా వర్గీకరించాల్సి వుంటుంది. ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వాల్లో టీడీపీ ఎలా రూపుదిద్దుకుంటో చర్చించుకోవాల్సి వుంటుంది. ఎన్టీఆర్ విషయానికి వస్తే, రాజకీయ నేపథ్యం లేని, ఆర్థికంగా అంత బలంగా లేని సామాన్యులకు అధికారంలో భాగస్వామ్యం కల్పించారు. ప్రతి జిల్లాలో అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు ఎన్టీఆర్ పెద్దపీట వేశారు.
తెలంగాణలో మోత్కుపల్లి నర్సింహులు లాంటి ఎస్సీ నాయకుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు లాంటి అధ్యాపకుడు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారంటే ఎన్టీఆర్ ఔదార్యమే కారణమే. ఇదే చంద్రబాబు విషయానికి వస్తే… రాజకీయాల్లో క్విడ్ ప్రోకోకు తెరలేపారు. సీబీఐ డైరెక్టర్ విజయరామారావుకు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన్ను మంత్రిని చేశారు. కొందరు న్యాయమూర్తులకు కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. పి.నారాయణ లాంటి విద్యావ్యాపారులకు చంద్రబాబు పెద్ద పీట వేశారు. సీఎం రమేశ్ లాంటి సారా వ్యాపారి, సుజనాచౌదరి లాంటి లాబీయిస్ట్, టీజీ వెంకటేశ్ లాంటి పొలిటికల్ వ్యాపారులకు చంద్రబాబు అగ్రస్థానం కల్పించారు. తాజాగా భాష్యం ప్రవీణ్, ఎన్ఆర్ఐ రాము తదితర డబ్బున్న వాళ్లే టీడీపీలో ప్రముఖంగా కనిపిస్తున్నారు. వారి పేర్లే బలంగా వినిపిస్తున్నాయి.
వ్యాపారపరంగా తన వాళ్లకు భారీ ప్రయోజనం కలిగించేందుకు సైబరాబాద్, హైటెక్ సిటీలను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇవాళ ఆ ప్రాంతాల చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వ్యక్తుల సామాజిక నేపథ్యాలేంటో తెలుసుకుంటే, చంద్రబాబు విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు క్యాస్ట్, క్యాష్ విజనే ఏపీ విభజనకు దారి తీసిందని ఒక ప్రముఖ పరిశోధకురాలు తన పీహెచ్‌డీ గ్రంథంలో రాసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీ విభజన తర్వాత కూడా తనదైన కుల రాజకీయానికి చంద్రబాబు తెరలేపారు. టీడీపీ సీఎం అభ్యర్థిగా, అంత వరకూ పార్టీతో ఏ మాత్రం సంబంధం లేని ఆర్.కృష్ణయ్యను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణలో బీసీల ఓట్లను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్రల్ని, ఆ రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారు. అయితే రాజకీయాలను డబ్బుతో శాసించవచ్చని బలంగా నమ్మే చంద్రబాబు… కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటుకు తెరలేపారు. ఈ ఎపిసోడ్‌లో నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడంతో టీడీపీకి గడ్డురోజులు మొదలయ్యాయి. ఆ కేసు నుంచి బయట పడేందుకు చివరికి హైదరాబాద్‌పై పదేళ్ల హక్కుని బలిపెట్టి ఆంధ్రాకు రాత్రికి రాత్రే మూటముళ్లే సర్దుకుని చంద్రబాబు రావాల్సి వచ్చింది.
అప్పటి నుంచి చంద్రబాబుకు పతనం ప్రారంభమైంది. బాబు వంచనా నైజాన్ని సమాజం పసిగట్టింది. కానీ చంద్రబాబులో మార్పు రాలేదు. చంద్రబాబు వినాశకర ఆలోచనల్ని అమలు చేయడానికి ఎల్లో మీడియా సిద్ధంగా వుంది. అత్యధిక ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని పాలించకుండా చేయడానికి వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని అడగడుగునా ఆటంకాలు సృష్టించడాన్ని మనం చూశాం, చూస్తున్నాం. ఇటీవల కాలంలో న్యాయ వ్యవస్థలో చంద్రబాబు మనుషులు ఒక్కొక్కరుగా పదవీ విరమణ చేస్తుండడంతో ఆయన బలహీనపడుతున్నారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు న్యాయస్థానాల నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తోంది.
ఆంధ్రా నుంచి అమెరికా, తదితర విదేశాల వరకూ చంద్రబాబు నాటిన కుల విష బీజం కంపు కొడుతోంది. ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిరపడిన తెలుగు వారు కులాల వారీగా విడిపోయారంటే దానికి కారణం చంద్రబాబే. తెలుగు రాష్ట్రాల్లో కంటే విదేశాల్లోనే కుల పోరు తీవ్రస్థాయికి చేరిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎక్కడో బ్రిటన్‌లో కూచొని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన యువతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన భార్య, కుటుంబ సభ్యులపై అవాకులు చెవాకులు పేలుతోంది. ఆ పోకిరీ యువతి ఆగడాలు శ్రుతిమించడంతో వైసీపీ సోషల్ మీడియా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దీంతో సదరు యువతి వెక్కివెక్కి ఏడ్వడం, ఆమెకు చంద్రబాబు వత్తాసు పలకడం సభ్యసమాజాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేసిన చంద్రబాబు, తన స్థాయిని, పెద్దరికాన్ని మరిచి ఓ పోకిరీ యువతికి ఫోన్ చేయడం, అండగా ఉంటానని భరోసా ఇవ్వడంతో పాతాళానికి దిగజారారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా, దాన్ని జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టి, కులం కోణంలో విమర్శలు చేస్తూ, వారిని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు కుట్రలకి తెరలేపారు. 14 ఏళ్లపాటు ఉమ్మడి, విభజన ఏపీకి సీఎంగా పని చేసిన చంద్రబాబు …తాను ఫలానా మంచి పని చేశానని చెప్పి ప్రజల ఆశీస్సులు అడగడం లేదు. ఇదే జగన్ విషయానికి వస్తే నాలుగేళ్లలో నవరత్నాల పథకాలను దిగ్విజయంగా అమలు చేశానని, అలాగే అభివృద్ధి పనులు చేశానని, ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలిగిందని భావిస్తేనే మరోసారి ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నారు. తన రాజకీయ అనుభవమంత వయసు కూడా లేదని జగన్‌పై పదేపదే విమర్శలు చేసే చంద్రబాబులో …సీఎంలో ఉన్న పరిణితి, నిజాయతీ మచ్చుకైనా కనిపించవు.
తెలంగాణలో టీడీపీ ఊసే లేకపోవడం వల్ల, ఆ రాష్ట్రంలో అన్ని వర్గాలు తమ పనులు తాము చేసుకుంటూ ప్రశాంతంగా, సుఖసంతోషాలతో జీవనం సాగిస్తున్నాయి. టీడీపీ వుండి వుంటే తెలంగాణలో సైతం కుల రాజకీయాలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి అడ్డంకిగా మారిన కుల రాజకీయాలు పోవాలంటే టీడీపీని ఓడించితీరాలి.
ఈ ఒక్క దఫా టీడీపీని మట్టి కరిపిస్తే… ఆంధ్రప్రదేశ్‌ను శనిలా పట్టుకుని వేధిస్తున్న కుల రాజకీయాల పీడ విరగడ అవుతుంది. అందుకే టీడీపీ విముక్తితోనే ఆంధ్రప్రదేశ్‌కు ముక్తి అని చెప్పక తప్పదు. టీడీపీని విముక్తి చేయడం అంటే… వెన్నుపోటు చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే ఎల్లో మీడియాకు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టడమే.
– శ్రీనివాసమూర్తి (USA)