ప్రధాని నరేంద్రమోడీ విపక్షాల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది చాలా సహజంగా జరుగుతున్నదే. ప్రత్యేకించి మోడీ సర్కారును గద్దె దించడానికి విపక్ష పార్టీలు అన్నీ ఒక్కతాటిమీదకు వస్తున్న తరుణంలో.. వారి ఐక్యగానాల పట్ల మోడీ వెటకారాలు కూడా ఎక్కువయ్యాయి. వారి భేటీలు గ్రూప్ ఫోటోలను, ఫోటో సెషన్ లను తలపిస్తున్నాయంటూ ఎద్దేవా చేస్తున్నారు కూడా..! ఈసారి ఎద్దేవా మాత్రమే కాకుండా, చాలా సీరియస్ ఎటాక్ చేశారు.
ఎన్నికల కోసం ఫేక్ గ్యారంటీలతో కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయంటూ మోడీ విమర్శించారు. మద్యప్రదేశ్ లో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడిన ప్రతిమాట, విపక్ష పార్టీలను ఉద్దేశించి చేసిన ప్రతి విమర్శ.. ఏపీ రాజకీయాల్లో అచ్చంగా చంద్రబాబునాయుడును ఉద్దేశించి చెప్పినట్టుగానే మనకు అనిపిస్తుంది.
‘‘రాజకీయంగా తమకే గేరంటీ లేని కొన్ని పార్టీలు కొత్త పథకాలు, ఫేక్ గ్యారంటీలతో సిద్ధమవుతున్నాయి.. అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి’’ అని మోడీ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త హామీలతో ఏకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేసేసిన ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడు మాత్రమే. పైగా ఆ పథకాలను గమనిస్తేనే.. అసలు ఆచరణ సాధ్యమా అనే అందరికీ అనిపిస్తుంది. ఆ సంగతి పక్కన పెడితే.. గేరెంటీ అనే పదాన్ని వాడుతున్నది కూడా చంద్రబాబు ఒక్కరే. ‘‘భవిష్యత్తుకు గేరెంటీ’’ అంటూ తెలుగుదేశం రాష్ట్రవ్యాప్త యాత్రలు నిర్వహిస్తోంది. ఈ గేరెంటీ సెటైర్ చంద్రబాబుమీదనేనా అని ఎవరికైనా అనిపిస్తే ఆశ్చర్యం లేదు.
‘‘ఇప్పటికే ఇచ్చిన హామీలను ఆయా పార్టీలు అమలు చేయలేదని’’ కూడా మోడీ విమర్శించారు. 2014లో మేనిఫెస్టోలో బోలెడు వరాలు ప్రకటించి.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ఆ మేనిఫెస్టో కాపీ కూడా తమ పార్టీ వెబ్ సైట్ లో కూడా కనిపించకుండా తీసేసిన దుర్మార్గమైన చంద్రబాబు తీరునే మోడీజీ విమర్శించినట్లుగా మనకు అనిపిస్తుంది.
మోడీ ఏ లక్షణాలనైతే అసహ్యించుకుంటూ ప్రతిపక్ష పార్టీల మీద నిందలు కురిపిస్తున్నారో.. ఆ లక్షణాలన్నీ గొప్పగా కలిగి ఉన్న నాయకుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు. మరి.. తెలిసి తెలిసీ.. ఇలాంటి చంద్రబాబునాయుడుతో నరేంద్రమోడీ పొత్తులు కుదుర్చుకుంటారా? తద్వారా తమ పార్టీ పరువు కూడా తీసుకోవడానికి సిద్ధమవుతారా? అనేది అర్థం కావడం లేదు.