చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబానికి రోజా అంటే పడటం లేదు. దీంతో వచ్చే సారి రోజాకు ఎమ్మెల్యే టికెట్ దక్కడం కూడా కష్టమే! సాధారణ జనాల్లోనూ, మీడియాలోనూ రాజకీయ విశ్లేషణల పేరిట వినిపించే మాట ఇది!
అంబటి రాంబాబు చేజేతులారా తన పొలిటికల్ కెరీర్ ను దెబ్బతీసుకున్నారు. ఆయన పొలిటికల్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడబోతోంది. ఇది సాదాసీదాగా వినిపించిన మాట రాజకీయ వార్తల్లో!
మంత్రి పదవి పోతుందనే ఫలానా మంత్రి విపరీతంగా భజన చేస్తున్నారు. ఆయన ఎంత భజన చేసినా ఆయన మంత్రి పదవి పోవడం ఖాయమనే వాదనా నిలబడలేదు!
సగటు రాజకీయ విశ్లేషణలకూ, అంచనాలకు భిన్నంగానే తన మంత్రివర్గంలో స్థానాల విషయంలో జగన్ ఎంపికలు సాగాయి. పాత వాళ్లను ఉంచడం విషయంలో అయినా, కొత్తవాళ్లను చేర్చడం విషయంలో అయినా.. అంచనాలకు అతీతంగా సాగింది జగన్ రాజకీయం.
మరి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అనూహ్యమైన, అంచనాలకు భిన్నమైన రీతిలోనే జగన్ వ్యవహరించే అవకాశాలకు ఈ మంత్రివర్గ కూర్పు క్లూ ఇస్తోంది. బయటి వాళ్లు విశ్లేషించే పనితీరు, విధేయత.. ఇలాంటి పడికట్టు పదాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.