వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మరోసారి తన పంచ్ లకు పదునుపెట్టారు. అచ్చెన్నాయుడు, పట్టాభి మరోసారి ఆయన పంచ్ లకు బలయ్యారు. హోం మినిస్టర్ అవుతానంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, తనదై దాడి జరిగిందంటూ పడుకున్న పట్టాభిలపై అంబటి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
“చంద్రబాబును అడిగి అచ్చెన్నాయుడు హోం మంత్రి అయిపోతారట. అప్పుడు ఖాకీల తాట తీస్తారట. మంత్రి అయ్యేది డిపార్ట్ మెంట్ లో ఉద్యోగుల తాట తీయడానికా? ఈ సంగతి పక్కనపెడితే అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నారు. చంద్రబాబు ఈ దేశానికి ప్రధాని, లోకేష్ ఈ రాష్ట్రానికి సీఎం, ఈయన హోం మంత్రి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఈ రాష్ట్రానికి పంచాయతీ రాజ్ మంత్రి అని ఆయన పగటి కలలు కంటున్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల.”
పట్టాభిపై దాడిని చాలా తేలిగ్గా కొట్టిపారేశారు అంబటి. అది పట్టాభిపై దాడిలా లేదని, కేవలం అతడి కారుపై దాడిలా ఉందన్నారు. చూస్తుంటే.. ఇదేదో కారు ఇన్సూరెన్స్ కు సంబంధించి గొడవలా ఉంది తప్ప, రాజకీయ కుట్రలా కనిపించడం లేదంటూ పంచ్ వేశారు.
“పట్టాభిపై ఇప్పుడే కాదు, 4 నెలల కిందట కూడా దాడి జరిగింది. అప్పుడు అర్థరాత్రి జరిగింది. ఇప్పుడు పగలు జరిగింది. రెండు సందర్భాల్లో కారు అద్దాలే ధ్వంసం అయ్యాయి. అదే నాకు అర్థం కాని విషయం. రెండూ సార్లూ కారే ధ్వంసం అయింది కానీ అతడికేం కాలేదు. ఇదేదో ఇన్సూరెన్స్ గొడవలా ఉంది తప్ప ఇంకేం కాదు.”
దాడి జరిగిన తర్వాత నిల్చొని, ఆవేశంగా మీడియాతో మాట్లాడిన పట్టాభి.. చంద్రబాబు వచ్చేసరికి మాత్రం మంచంపై నీరసంగా వాలిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు అంబటి. ఆ టైమ్ లో చంద్రబాబు ఆవేశం చూసి ఆశ్చర్యంతో పాటు నవ్వొచ్చిందంటూ సెటైర్ వేశారు.