మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హయాంలో తుడాలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భారీ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయన ప్రత్యర్థి, ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే చెవిరెడ్డి అవినీతిని నిరూపిస్తామని పులివర్తి నాని పదేపదే హెచ్చరించేవారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు దాటింది. అయితే ఇంత వరకూ కూటమి నేతల ఆరోపణలపై అతీగతీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పులివర్తి నాని తన ప్రత్యర్థి చెవిరెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. భాస్కర్‌రెడ్డి తర్వాత ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి కూడా తుడా చైర్మన్‌గా కొంత కాలం వ్యవహరించారు.
ఎన్నికల సందర్భంగా చంద్రగిరిలో తీవ్ర గొడవలు జరిగాయి. ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతలపై వేధింపులు సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఎర్రావారిపాలెం మండలంలో దళిత విద్యార్థినిపై ఇటీవల చోటు చేసుకున్న దుర్మార్గ ఘటనలో చెవిరెడ్డిని ఇరికించాలనే ప్రయత్నాల్ని ఆయన తెలివిగా తిప్పికొట్టారు. ప్రస్తుతానికి ఆ వ్యవహారం కోర్టులో నడుస్తోంది.
తాజాగా తుడా అవినీతిపై విజిలెన్స్ విచారణ మొదలు కావడం చర్చనీయాంశమైంది. తుడాలో అవినీతిని నిరూపించి భాస్కర్‌రెడ్డిని జైలుకు పంపాలనే ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి. దీన్ని చెవిరెడ్డి ఎలా తిప్పికొడతారో మరి!
😁😁😁😁😁😁🤣🤣🤣🤣