ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ట్వీట్ తూటా పేల్చారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేపట్టిన రైతులకు సంఘీభావం తెలుపుతూ ప్రధానిపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
కొత్త వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలనే ఏకైక డిమాండ్‌తో ఉద్యమిస్తున్న రైతాంగం తమ పట్టు వీడడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొండిగా వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలో రాహుల్ తాజా ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రపంచ నియంతల పేర్లన్నీ ‘ఎం’ తోనే ప్రారంభం అవుతాయంటూ రాహుల్ చేసిన ట్వీట్ ప్రధాని మోడీని నేరుగా తగిలింది. ఆయా నేతల పేర్లన్నీ 'ఎం' అనే ఆంగ్ల అక్షరంతోనే ఎందుకు మొదలవుతాయంటూ ట్విటర్ వేదికగా రాహుల్ ఓ వ్యంగ్య ప్రశ్న సంధించారు.
ఈ సందర్భంగా ఆయన … ఇటలీ మాజీ ప్రధాని ముసోలిని, పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్, ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు ముబారక్, సెర్బియా అధ్యక్షుడు మిలోసెవిక్, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు, సైనిక నియంత మొబుటు పేర్లను ప్రస్తావించారు.
ప్రధాని మోడీ పేరును నేరుగా ప్రస్తావించకుండానే తాను పంపాలనుకున్న మెసేజ్‌ను శక్తిమంతమైన ట్వీట్‌తో రాహుల్ బీజేపీకి మంట పుట్టించాడు. దాదాపు 8వేల మంది రాహుల్ తాజా ట్వీట్‌ను రీట్వీట్ చేయగా 34 వేలకు పైగా లైకులు వచ్చాయి.
బీజేపీ సోషల్ మీడియా కూడా రాహుల్‌కు కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ నేత మోతీలాల్ నెహ్రూ, మాజీ ప్రధాని మన్మోహన్ పేర్లు కూడా 'ఎం' తోనే మొదలవుతాయి కదా అంటూ బీజేపీ నేతలు విమర్శించారు.
పనిలో పనిగా మమతా బెనర్జీ, మాయా వతి పేర్లను కూడా ప్రస్తావిస్తూ రాహుల్‌కి కౌంటర్ ఇవ్వడం గమనార్హం. మరికొందరు ప్రధాని పేరు ఎన్తో కదా మొదలయ్యేదని కామెంట్స్ పెట్టారు. గుమ్మడి కాయల దొంగ అంటే బీజేపీ భుజాలు ఎందుకు తడుముకుంటున్నదో అర్థం కావడం లేదని కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది.