నారావారంటే రాజకీయంగా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబునాయుడు పుణ్యాన నారా వారి ఇంటిపేరు దేశ రాజకీయాల్లో ఓ గుర్తింపు పొందింది.
చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు కొంత కాలం పాటు రాజకీయంగా యాక్టీవ్‌గా ఉన్నారు. చంద్రగిరి నుంచి సీనియర్ మహిళా నాయకురాలు గల్లా అరుణకుమారిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే అనారోగ్య కారణాలతో ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయంగా అదృశ్యమయ్యారు.
చంద్రబాబు తర్వాత ఆయన వారసత్వంగా నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్సీగా తన తండ్రి కేబినెట్లో కీలక మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన లోకేశ్ వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా నారా వారి ఇంట ఓ కొత్త యువ ఎమ్మెల్యే మన ముందుకు రానున్నారు.
అయితే ఇది రాజకీయ తెరపై ఎంత మాత్రం కాదు. వెండితెరపై యువ ఎమ్మెల్యేగా నారా వారి ఏకైక సినీ హీరో రోహిత్ కనిపించనున్నారని సమాచారం. 2009లో సినీ హీరోగా నారా రోహిత్ అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు గుర్తించుకోతగ్గ సినిమాలేవీ రోహిత్‌కు లేవు.
న్యూయార్క్ ఫిలిం అకాడెమీ పూర్వవిద్యార్థి అయిన రోహిత్ చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడి కుమారుడు. బాణంంతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం… సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద తదితర సినిమాల్లో సాగింది.
ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న రోహిత్ తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ -సీనియర్ హీరో బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలో యంగ్ హీరో నారా రోహిత్ యువ ఎమ్మెల్యే పాత్రలో కీలక రోల్ చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదన్న మాట నారావారింట కొత్త ఎమ్మెల్యే కథ.