ఈ వ్యాసంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి తాజా బిల్లు ఏం చెప్తోందో వివరిస్తాను. దానికి ముందు ఉద్యమం రాజకీయంగా ఎలా మలుపులు తీసుకుంటోందో చర్చిస్తాను. అంతకంటె ముందు ముఖ్యంగా ప్రస్తావించవలసినది ఫిబ్రవరి 2 నాటి ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన నావికాదళ మాజీ ప్రధానాధికారి అడ్మిరల్ ఎల్. రాందాస్ (87 సం.లు) రాసిన బహిరంగలేఖ! జనవరి 26 నాటి రైతు ప్రదర్శనను మీడియా చూపించిన తీరు గురించి ఆయన ఆక్షేపిస్తూ, దీపు సిద్దూకి వెనక ఎవరున్నారనే దానిపై సీరియస్ సందేహాలు లేవనెత్తారు.
రైతుల్లో 90శాతం మంది కాలినడకను వచ్చినా, శాంతంగా వున్నా మీడియా దాని గురించి పట్టించుకోలేదు. ఎఱ్ఱకోట సంఘటననే చూపిస్తూ దేశద్రోహం చేశారంటూ రైతు నాయకులపై కేసులు పెట్టింది. మోదీ కూడా జాతీయపతాకానికి అవమానం జరిగిందన్నారు. ఆ కాషాయ జండా త్రివర్ణ పతాకం కంటె తక్కువ ఎత్తులోనే వుండడం గమనించవచ్చు. అసలు జండాను ముట్టుకోలేదు. ఇక అవమానం జరిగిందని ఎలా అంటున్నారో నాకు అర్థం కాలేదు.
రాందాస్ కొన్ని విషయాలు రాశారు – ‘ఎఱ్ఱకోటలో ఒక బెటాలియన్ సైన్యం సదా వుంటుంది. కోట బురుజుల కింది భాగానికి వెళ్లాలంటే అనేక అవరోధాలుంటాయి. గేట్లు మూసేసి వుంటాయి. ఈ ‘ఆక్రమణ’ జరిగినప్పుడు అక్కడున్న బెటాలియన్, ఆ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు?’ అని. ఇక ఆయనపై వాట్సప్ వీరులు విజృంభించవచ్చు. ఆయన పాక్ గాయకుల ఘజల్స్ వింటాడని, చైనీస్ నూడుల్స్ తింటాడని, బొత్తిగా దేశభక్తి లేదని… యిలా. ఆయన మాట ఎలా వున్నా టీవీలో చూసేవారందరికీ ఆ దీపు జండా స్తంభం ఎక్కే దృశ్యం కనబడుతూనే వుంది.
అక్కడున్న మిలటరీ వాళ్లు లాఠీలతో జనాల్ని చెదరగొట్టలేక పోయారా? తక్కిన చోట్ల పోలీసులు రైతులపై బాష్పవాయువు వదిలారుగా, అక్కడా వదిలి అతనికి కళ్లు కనబడకుండా చేయలేకపోయారా? పైకి ఎక్కి జాతీయపతాకంపైకి ఏదైనా రువ్వేవాడేమో! అతన్ని ఆ లెవెల్ వరకు రానిచ్చినవాళ్లు దేశద్రోహులు కారా? వాళ్లకు గేట్లు తెరిచినవారెవరు? లోపలికి వచ్చాక ఫర్నిచర్, అద్దాలు పగలగొట్టిన దృశ్యాలు చూపించారు కానీ, దారిలో గేట్లు విరక్కొట్టినట్లు చూపలేదు.
నిజానికి అతను ఎక్కడానికి మొదలు పెట్టిన దగ్గర్నుంచే టైమ్స్ నౌ ఛానెల్ జాతీయ జండాకు అపచారం, దేశద్రోహం అంటూ అరవడం మొదలుపెట్టింది. అతనేం చేయబోతాడో ముందే తెలిసినట్లుంది. రైతుల సమస్య సరే, ఎఱ్ఱకోటలో ఆ వ్యక్తిని, అతని అనుచరులను లోపలిదాకా ఎలా రానిచ్చారో ఆ విషయం మీద ఓ కమిషన్ వేసి దర్యాప్తు జరిపించాలని రాందాస్ డిమాండ్ చేశారు. దర్యాప్తు కంటె ముందు అక్కడ సెక్యూరిటీగా యిన్చార్జిలుగా వున్నవాళ్ల మీద విధినిర్వహణలో వైఫల్యం అంటూ సస్పెన్షన్ వేటు వేయాలి.
జండా ఎగరేశాక అతన్ని నిర్బంధం లోకి తీసుకోకుండా ఎందుకు వదిలేశారు? ఎక్కడో వున్న రైతు నాయకులను టెర్రరిస్టులు, దేశద్రోహులు అంటున్నారు. దీపు అవేళ జండా ఎగరేసి, దర్జాగా కారులో వెళ్లిపోయినప్పుడు కావాలని వదిలేసిన పోలీసువారు ఎవరుట? వారికి అలా ఆదేశాలిచ్చిన వారెవరుట? ఇప్పుడు అతన్ని పట్టుకుంటే లక్ష రూ.ల బహుమతి యిస్తారట. తీగ లాగి, డొంక కదిల్చి, సూత్రధారులను బయటపెట్టినవారికి పది లక్షలివ్వవచ్చు.
రాజకీయ పరిణామానికి వస్తే ఘాజీపూర్‌లో తికాయత్ దగ్గరకు వచ్చి పరామర్శించిన వారిలో యితర ప్రతిపక్షాల వారు ఎలాగూ వున్నారు కానీ అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్ కూడా వుండడం గమనార్హం. నిజానికి యీ సాగు చట్టాలు కాదు కానీ అకాలీ దళ్ నానా యిక్కట్లూ పడుతోంది. దానికి బిజెపితో 1996 నుంచి పొత్తు వుంది. శివసేన భావాల్లాటివే దీనివీ కాబట్టి, బిజెపితో దశాబ్దాలుగా భావసారూప్యంతో అంటిపెట్టుకుని వుంది. సుఖ్బీర్ భార్య కేంద్రంలో మంత్రిగా కూడా వుంది.
సెప్టెంబరు వరకూ సాగు చట్టాలను సమర్థిస్తూనే వుంది. దరిమిలా దిక్కుతోచక ఎన్డిఏ లోంచి బయటకు వచ్చాక సుఖ్బీర్ ‘జూన్‌లో ఆర్డినెన్స్ వచ్చినపుడు మా ఆవిడ కాబినెట్ మీటింగులో అభ్యంతరాలు తెలిపింది. రైతు సంఘాల సూచనలు అనుసరించి చట్టాలు రూపొందిస్తాం అని హామీ యిచ్చారు. అసలు ఎన్డిఏ భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలే లేవు. 2018లో చంద్రబాబు వెళ్లిపోయిన దగ్గర్నుంచి ఎన్‌డిఏకు కన్వీనరే లేడు.’ అని చెప్పుకుంటున్నాడు.
‘అత్తతో అమ్మి కోడలితో కొందామని చూస్తే యిలాగే వుంటుంది, ఉంటే రైతుల పక్షాన వుండు లేకపోతే కేంద్ర ప్రభుత్వపక్షాన ఉండు’ అని పంజాబ్ కాంగ్రెసు ఎద్దేవా చేసింది. ఎందుకంటే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ మొదటినుంచీ రైతుల పక్షాన ఛాంపియన్‌గా వెలిశాడు. ఆ చట్టాలను వ్యతిరేకించాడు.
అక్టోబరులో కేంద్ర చట్టాలలో లోపాలను సవరిస్తూ రాష్ట్ర చట్టాలు చేశాడు కూడా. అకాలీ దళ్ ఓటు బ్యాంకు జాట్లు, సిఖ్కులు. దక్షిణ పంజాబ్‌లో దానికి బలం వుంది. బిజెపికి జాట్ల వ్యతిరేక పార్టీగా పేరుంది. నగరవాసులు, మధ్యతరగతి ప్రజలు, ఇతర కులాల వారు దానికి ఓటేస్తూ వుంటారు. వారి ఓట్లు బదిలీ కావడంతో 2017 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 117 సీటల్లో అకాలీకి 15 సీట్లు వచ్చాయి.
ఇప్పుడు రైతులు ఆందోళన బాట పట్టడంతో దానికి భయం పట్టుకుంది. 9 సిటీ కార్పోరేషన్లకు, 167 మునిసిపాలిటీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి వుంది. అసలు డిసెంబరులోనే జరగాలి, వాయిదా పడ్డాయి. ప్రస్తుతం వున్న మూడ్‌లో రైతులందరూ తమకు వ్యతిరేకంగా ఓటేస్తారనే భయం పట్టుకుంది అకాలీకి. దీనికి తోడు ఈ ఏడాది జరగబోయే ఎస్జిపిసి (శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ) ఎన్నికలలో గెలుపు కూడా దానికి చాలా ముఖ్యం. గురుద్వారాలన్నిటిపై ఆధిపత్యం వున్న ఎస్జిపిసిలో 170 స్థానాలకు పదేళ్ల కోసారి ఎన్నికలు జరుగుతాయి. 2011 ఎన్నికలలో అకాలీ, సంత్ సమాజ్ కూటమికి వాటిలో 157 సీట్లు దక్కాయి. ఎస్జిపిసిలో గెలిచినవారినే తమ రాజకీయ ప్రతినిథులుగా శిఖ్కులు గుర్తిస్తూంటారు. ఇన్నాళ్లూ అకాలీ దళే ఆ గౌరవం పొందుతూ వచ్చింది.
అయితే ఆ పార్టీని బాదల్ కుటుంబం తన ఉక్కు పిడికిలిలో బంధించిందని, వారు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపిస్తూ వాళ్ల సన్నిహిత అనుచరులు రంజిత్ సింగ్ బ్రహ్మపురా అకాలీ దళ్ (తక్సాలీ) అని, సుఖ్‌దేవ్ ధిండ్సా శిరోమణి అకాలీ దళ్ (డెమోక్రాటిక్) అని పార్టీలు పెట్టుకున్నారు. నవంబరులో యీ రెండు పార్టీలు, అకాలీ దళ్ (1920) అనే మరో పార్టీ, సంత్ సమాజ్ స్థాపకుడు బాబా సరబ్జోత్ సింగ్, అకాల్ తఖ్త్ మాజీ ప్రధాన పూజారి భాయ్ రంజిత్ సింగ్ వీళ్లందరూ కలిసి ‘పంథిక్ ఫ్రంట్’ గా ఏర్పడ్డారు. వీళ్లంతా ‘అకాలీ దళ్ 1973లో రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు కావాలని తీర్మానం చేసింది. కానీ బిజెపి ఆర్టికల్ 370 రద్దు చేసి, కశ్మీరు రాష్ట్రం హక్కులు హరించి, కేంద్రపాలితంగా మారిస్తే అకాలీ దళ్ సమర్థించింది. ఇది సిఖ్కుల మనోభావాలను దెబ్బ తీసింది.’ అంటూ ప్రచారం చేస్తున్నారు.
అందువలన ఎస్జిపిసి ఎన్నికలు గెలవడం అకాలీకి అతి ముఖ్యం. వాళ్లు ఏమైనా అక్రమాలు చేస్తారేమోనని ఎన్నికలను వేరే వాళ్లు పర్యవేక్షించాలని అకాలీ విరోధులు కోరుతున్నారు. అకాలీలు ఎన్‌డిఏలోంచి వెళ్లిపోగానే అమిత్ షా అక్టోబరు 6న మాజీ జస్టిస్ ఎస్ఎస్ శారోన్ను ఎస్జిపిసి ఎన్నికల కమిషనర్‌గా వేశారు.
ఇప్పుడు అకాలీ దళ్ పోయిన ప్రతిష్ట మళ్లీ తెచ్చుకునే ప్రయత్నంలో రైతుల పక్షాన మరీ హడావుడి చేస్తోంది. బిజెపితో వుంటే రైతుల పక్షాన ఉన్నట్లు కాదని అకాలీలకు ఎందుకనిపిస్తోంది? ఈ సాగు చట్టాల ద్వారా బిజెపి రైతుకి మేలు చేస్తుందని రైతు నాయకులు నమ్మలేకపోవడానికి కారణాలేమిటి? కనీస మద్దతు ధర విషయంలో ప్రభుత్వం నోటిమాటగా యిచ్చే హామీలను నమ్మకుండా చట్టంలో పెట్టమని అడగడానికి కారణం ఏమిటి?
బిజెపి తన వ్యవసాయ విధానమేమిటో గత కొన్నేళ్లగా పలువిధాలుగా ప్రకటిస్తూందని ఆంధ్రజ్యోతి (డిసెంబరు 9)లో ఎ.కృష్ణారావుగారు చక్కగా వివరించారు. ఆయన ప్రకారం – మోదీ ప్రధాని కాగానే ఎమ్మెస్పీని తగ్గించారు. దానికి రాష్ట్రాలు బోనస్ ప్రకటించడంపై ఆంక్షలు విధించారు. 2015లో ఆయన తన పార్టీ ఎంపీ శాంతకుమార్ నేతృత్వంలో నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ చూస్తే పార్టీ ఆంతర్యం తెలుస్తుంది.
‘దేశంలో 6శాతం మంది రైతులకే ఎమ్మెస్పీ ప్రయోజనం చేకూరుస్తోంది. దానిపై బోనస్ అనుమతించకూడదు. ఆహారధాన్యాల నిల్వలో ప్రైవేటు సంస్థలకు వీలు కల్పించాలి’ అని నివేదిక యిచ్చిందది. 2018లో నీతి ఆయోగ్ తయారు చేసిన డాక్యుమెంటు సిఏసిపిని రద్దు చేసి, వ్యవసాయ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించాలని, ఎమ్మెస్పీ తీసేసి కనీస రిజర్వు ధర పెట్టాలనీ చెప్పింది.
ఇది బిజెపి నిపుణుల సలహాలు. వాటిని అమలు చేస్తే వచ్చే పరిణామాలేమిటో, రైతులు ఆమోదిస్తారో లేదో పార్టీలో అంతర్గత సమావేశాలు పెట్టి క్షేత్రస్థాయి కార్యకర్తల సలహాలు తీసుకోవాల్సి వుంది. పివి తన హయాంలో ఎరువుల సబ్సిడీ ఎత్తివేయాలనుకున్నపుడు ఒక కమిటీ వేసి ప్రతిపక్ష సభ్యులను కూడా ఆ కమిటీలో చేర్చి, కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విస్తృత సమావేశాలు నిర్వహించి అందర్నీ ఒప్పించారు.
సాగు చట్టాల విషయంలో బిజెపి అలాటిది ఏమీ చేయలేదు. సెప్టెంబరు 14న యీ బిల్లులు ప్రవేశపెట్టగానే ప్రతిపక్షాలు చెప్పిన ప్రధాన అభ్యంతరం – వ్యవసాయమనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. ఉమ్మడి జాబితాలో కూడా లేదు. దీనిని ఆమోదించేందుకు పార్లమెంటుకి అధికారం లేదు అని.
స్పీకరు ఆ వాదన తోసిపుచ్చి, సెప్టెంబరు 17న చర్చకు వచ్చినపుడు మాట్లాడమన్నారు కానీ చర్చను 5 గంటలకు మించి సాగనివ్వలేదు. ప్రతిపక్ష సభ్యుల కీలకమైన ప్రశ్నలకు మంత్రి సమాధానం యివ్వలేదు. మెజారిటీ వుంది కాబట్టి పాస్ చేయించేసుకున్నారు. ఆ రోజు రాత్రే సుఖ్బీర్ భార్య హరిసిమ్రత్ కౌర్ కేంద్రమంత్రిత్వ పదవికి రాజీనామా చేసింది. సెప్టెంబరు 20న రాజ్యసభలో 12 ప్రతిపక్షాలు బిల్లును సెలక్టు కమిటీకి పంపించాలని అడిగినా బిజెపి వినలేదు.
ఎన్డిఏ కూటమికి చెందని పార్టీలైన వైసిపి, తమిళ మానిల కాంగ్రెస్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ బిల్లులను సమర్థించాయి. రాజకీయంగా వైసిపి చేసిన ఘోర తప్పిదం, రైతులకు చేసిన భీకర ద్రోహమిది. బిజెడి, తెరాస (కెసియార్ దిల్లీ వెళ్లి వచ్చాక బిల్లులను ఆమోదించడమే కాదు, అమలు చేస్తామని కూడా అంటున్నారు) మాత్రమే కాదు, అప్పటికి ఎన్డిఏ భాగస్వామి ఐన అకాలీ దళ్ కూడా సెలక్టు కమిటీకి పంపమని అడిగారు.
అది కూడా జరగకపోవడంతో సెప్టెంబరు 26న అకాలీ దళ్ ఎన్డిఏ నుంచి తప్పుకుంది. 24 ఏళ్లగా అవిచ్ఛిన్నంగా బిజెపితో వున్న బంధాన్ని తెంచుకుని, వెంటనే పంజాబ్‌లో ర్యాలీలు నిర్వహించింది. వాటికి జనం పెద్దగా హాజరు కాకపోవడంతో రైతులు తమను నమ్మటం లేదని భయపడింది. ఇక సుఖ్బీర్ రాష్ట్రమంతా తిరుగుతూ అటు మోదీని, యిటు అమరీందర్‌ను విమర్శిస్తున్నాడు. ఇప్పుడు వెళ్లి తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాడు. బిజెపి భాగస్వామిగా వుండి బావుకునేదేమీ లేదని అతనికి బాగా అర్థమైంది.
బిహార్‌లో జెడియుతో పొత్తు నెరుపుతూనే బిజెపి డిసెంబరులో అరుణాచల్ ప్రదేశ్‌లోని జెడియు 7 గురు ఎమ్మెల్యేలలో ఆరుగుర్ని తన వైపు ఫిరాయింప చేసుకుంది. నిజానికి 60 మంది సభ్యులుండే సభలో బిజెపికి యిప్పటికే 41 మంది వున్నారు. వీరు చేరకపోతే వచ్చే నష్టమేమీ లేదు. అయినా ఆ రాష్ట్రంలో జెడియును లేకుండా చేద్దామనే బిజెపి ప్లాన్. బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్ సాయంతో తన బలాన్ని క్షీణింపచేశారని బాధపడుతున్న నీతీశ్ యిప్పుడు కుములుతున్నాడు. ఆ గతి తమకు పట్టకూడదని అకాలీ తాపత్రయం.
పంజాబ్ ముఖ్యమంత్రి సాగు చట్టాలకు చేసిన మార్పుల గురించి చర్చించే ముందు కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి చట్టం ఏం చెపుతోందో చూదాం. ఫార్మర్స్ (ఎమ్పవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ ఎస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్, 2020 అనే యీ చట్టం రైతుకి, కార్పోరేట్‌కు మధ్య వుండే కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పందం గురించి చెపుతోంది. తమాషా ఏమిటంటే ఒప్పందపు నమూనాలో రైతు అన్న పదం లేదుట. అమ్మేవాడు దళారీ ఐనా కావచ్చట.
రైతు నుంచి నేరుగా కొంటే కార్పోరేట్ తక్కువ ధరకు కొనగలడు అనే వాదన నమ్మితే, రైతుతో మాత్రమే ఒప్పందం చేసుకోవాలి అని ఖచ్చితంగా చెప్పాలి తప్ప, ఎవరైనా అమ్మవచ్చు అని ఎందుకన్నారు? కొనేవాళ్లను స్పాన్సర్స్ అన్నారు. అది ఒక వ్యక్తి కావచ్చు, కంపెనీ కావచ్చు, భాగస్వామ్య సంస్థ కావచ్చు, లిమిటెడ్ కంపెనీ కావచ్చు, సొసైటీ కావచ్చు. పంజాబ్‌లో జియో టవర్స్ కూలగానే, రిలయన్సు యీ వ్యాపారంలోకి దిగను అంది. ఆ కంపెనీ ఉద్యోగో, లేక అంబానీ బంధువో ఎవరో ఒకరు తన పేర దిగవచ్చు. ఏ అభ్యంతరమూ లేదు.
ఆంధ్రజ్యోతి (డిసెంబరు 24)లో ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అనే ఆయన రాసిన వ్యాసంలో కొన్ని అంశాలు చెప్పారు – 13 పేజీల ఒప్పందంలో ముందస్తు ధరకు రైతు పండించిన పంట అంతా కొనుగోలు చేయాలన్న నిబంధన లేదు. ఒప్పందం చేసుకున్న ధరకు చట్టభద్రత కానీ, అధికారిక నియంత్రణ కానీ ఏమీ లేదు. ప్రకృతి వైపరీత్యం వలన ఏదైనా నష్టం వస్తే రైతే భరించాలి. పంట బీమాల ప్రీమియం రైతే కట్టుకోవాలి. ఆయనే అన్నారు – దేశాన్ని 150కి పైగా వ్యవసాయ వాతావరణ ప్రాంతాలుగా విభజించారు. పండించడాని కయ్యే ఖర్చు ఒక్కో చోట ఒక్కోలా వుంటుంది. క్వింటాల్ వరి పండించడానికి తెలుగు రాష్ట్రాలలో రూ.2200 అవుతుంది. అదే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆసాంలలో అయితే రూ.1200-1500 అవుతుంది. మరి అలాటప్పుడు ఒప్పందంలో ధరను నిర్దేశించేందుకు ఏదో ఒక బెంచ్‌మార్క్ లేకపోతే ఎలా?
ఏదైనా పేచీ వస్తే మూడు దశలలో పరిష్కరించుకోవాలి. కన్సిలియేషన్ బోర్డ్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (అంటే సబ్-కలక్టర్), ఆపై అప్పీలేట్ అథారిటీ (కలక్టరు). అంతే కోర్టుకి వెళ్లడానికి వీల్లేదు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది కొత్త కాన్సెప్టేమీ కాదు. గతంలో అనేకుల మధ్య జరిగాయి. సుగర్ ఫ్యాక్టరీలు చెఱుకు రైతుల చేత కాంట్రాక్ట్ ఫార్మింగే చేయిస్తాయి. ప్రభుత్వం పూనుకుని చట్టం చేస్తున్నపుడు ఇరుపక్షాలకు న్యాయం జరిగేట్లు చూడాలి. చూసిందా అనేదే ప్రశ్న. ఔట్లుక్ (సెప్టెంబరు 21) ప్రకారం రైతు, కార్పోరేట్ల మధ్య రాతపూర్వకమైన ఒప్పందం వుండి తీరాలని కూడా ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. అందువలన సరుకు తయారయ్యాక కార్పోరేట్ తీసుకోనని పేచీ పెడితే రైతుకి దిక్కేమీ లేదు.
కాంట్రాక్ట్ రాతపూర్వకంగా వున్నా, దాన్ని రిజిస్టర్ చేయించాలని చట్టంలో ఎక్కడా లేదు. చేయకపోతే కార్పోరేట్‌కు పెనాల్టీ లేదు. కార్పోరేట్లన్నీ చెడ్డవని, ఎడాపెడా మోసాలు చేసేస్తూంటాయనీ నేను చెప్పటం లేదు. కానీ నిఘా లేకపోతే కొందరైనా మిస్చీఫ్ చేస్సే ప్రమాదం వుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిసిటివి లేదంటే, నాబోటి చాదస్తులు కొందరు ఆగుతారు కానీ, మరి కొందరు జంప్ చేస్తారు. వాళ్లకా అవకాశం యివ్వకూడదంటే సిసిటివి పెట్టాలి. పోలీసు వచ్చి పట్టుకోవాలి. అలాగే కార్పోరేట్లను కూడా నియంత్రించాలి. తప్పు చేస్తే దండించే వెసులుబాటు చట్టంలో పెట్టాలి.
బక్క రైతులకు కోర్టులకు వెళ్లే ఓపిక వుండదు కాబట్టి కోర్టు కెళ్లే హక్కు హరించివేద్దామనే వాదన తప్పు. సిగరెట్టు తాగకుండా బతకగలను, కానీ స్మోక్ చేసే హక్కు లేకుండా బతకలేను అన్నాడు పీలూ మోదీ. అలాగే, కోర్టు కెళ్లి శ్రమ, టైము దండగ అనే భావంతో నేను ఔట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకోవచ్చు కానీ అవసరమైతే కోర్టుకి వెళ్లే హక్కును వదులుకోను.
ఎవరో రచయిత పెద్ద నిర్మాతకు కథ చెప్పాడు. నిర్మాత ఆ కథ వాడేసుకుని యితనికి డబ్బు యివ్వలేదు, క్రెడిట్ యివ్వలేదు. ఎంత తిరిగినా లాభం లేకపోయింది. అలాటి కేసుల్లో సినిమా రిలీజప్పుడు కోర్టు కెళ్లి స్టే తెస్తామని బెదిరిస్తేనే డబ్బులు రాలతాయి. అనుకున్న డేట్‌కు రిలీజ్ కాకపోతే ఎంతో నష్టం కదాని, యితన్ని రాజీకి పిలుస్తారు. ఇతను నిజంగా కోర్టు దాకా వెళ్లనక్కరలేదు. ఒక్క లాయరు నోటీసు యిస్తే చాలు. నువ్వసలు కోర్టుకి వెళ్లడానికి వీల్లేదు అంటే అతని గతి ఏమవుతుంది?
ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఒక్కడే వుంటే బక్క రైతు. ఇతరులతో కలిస్తే అతనికి స్తోమత వస్తుంది. మనం ఒక 30 ఎపార్టుమెంట్ల బిల్డింగులో వుంటున్నాం. పక్క ఖాళీ స్థలంలో కమ్మర్షియల్ కాంప్లెక్స్ కడదామనుకున్న మోతుబరి బిల్డర్ మన స్థలం ఆక్రమించబోయాడు. ఒక్కరం అయితే వాడితో తలపడలేం. 30 మంది కలిస్తే లాయరు ఫీజు భరించగలం. 2019లో పెప్సికో గుజరాత్ రైతులను బెదిరించిన కేసు చూడండి. లే బ్రాండ్ పొటాటో చిప్స్ తయారుచేసే పెప్సికో బంగాళాదుంపల్లో ఎఫ్‌సి-5 అనే వెరైటీపై పేటెంటు పొందింది. అది పేటెంటు పొందడానికి ముందు నుంచి ఆ పంట పంజాబ్‌లో వుందట. మరి పేటెంటు ఎలా యిచ్చారో అది వేరే కథ.
పెప్సికో గుజరాత్‌లోని బనాస్కాంతాలో కొందరు రైతులతో ఒప్పందం పెట్టుకుని సాగు చేయించింది. మరుసటి ఏడాది ఓ నలుగురు రైతులు వాళ్ల వినియోగానికి వాళ్లు పంట వేసుకున్నారు. చట్టం ప్రకారం అది తప్పు కాదు (farmer shall be deemed to be entitled to save, use, sow, resow, exchange, share or sell his farm produce including seed of a variety protected under this Act in the same manner as he was entitled before the coming into the force of this Act, provided that the farmer shall not be entitled to sell branded seed of a variety protected under this Act.) అయినా పెప్సికో డిటెక్టివ్‌లను పెట్టి రైతులు సాగు చేస్తున్నట్లు కనిపెట్టి, 4 గురు రైతుల మీద రూ. 1.05 కోట్లకు పెనాల్టీ విధించింది. రైతు సంఘాలు ఆ నలుగురికి అండగా నిలబడి కోర్టులకు వెళ్లి కంపెనీని ఎదిరించారు. చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో పెప్సికో పెనాల్టీ రద్దు చేసింది. ఇదీ కోర్టుల పవర్. అందుచేత యిప్పణ్నుంచి రైతులు కోర్టు గుమ్మం ఎక్కకుండా చూస్తోంది ప్రభుత్వం.
ఇక ముఖ్యమైన అంశం ధర! ఇరు పక్షాలకు ఏ ధరకు కావాలంటే అంతకు ఒప్పందం కుదుర్చుకోవచ్చు అని ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెస్పీ రేటైనా కనీసం వుండాలి అని రైతుకి రక్షణ కల్పించలేదు. నిజానికి కంపెనీలు ధర బాగా యిస్తూ వుండి వుంటే, యీపాటికి కాంట్రాక్ట్ ఫార్మింగ్ దిగ్విజయంగా నడుస్తూ వుండాలి. అవి యివ్వటం లేదు. ఇప్పటిదాకా రైతుకి వీడు కాకపోతే మండీలో అమ్ముకుంటాననే ధీమా వుండేది. ఇప్పుడీ చట్టాలతో కేంద్రం మండీలను దివాళా తీయించబోతోంది. ఎందుకంటే మండీలో అమ్ముకుంటే వాటి నిర్వహణకై రాష్ట్రప్రభుత్వం వసూలు చేసే చార్జీలు కట్టాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చాక మండీ బయట అయితే ఆ చార్జీలు కట్టనక్కరలేదు. అలా అంటే మండీకి ఎవడెళతాడు?
రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్న ఆటోలైతే పావుగంట నుంచి క్యూలో వెయిట్ చేస్తున్నామండీ అంటూ ఎక్కువ అడుగుతారు. అందుకని మనం స్టేషన్ నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కి, ఖాళీగా వెళ్లే ఆటోని ఆపి, ఎక్కుతాం. చార్జీ కొంత తగ్గుతుంది కదాని! అలా చార్జీ కట్టనక్కరలేదంటే అంతా మండీ బయటే బేరాలు చూసుకుంటారు. దాంతో మండీలు మూతపడతాయి.
మండీ లేనప్పుడు ఎమ్మెస్పీ ఎక్కడుంటుంది? ప్రభుత్వానికి అమ్మాలి. ఎక్కడకు పట్టుకుని వచ్చి అమ్మాలి? మొన్న కరోనా సమయంలో తెరాస ప్రభుత్వం పొలాలకు వెళ్లి ధాన్యం సేకరించి, రైతులకు రవాణా ఖర్చులు మిగిల్చింది. అంతేకాదు, ఏ పంటలు వేస్తే ఎవరికి లాభసాటో, రైతులకు ఆదేశాలిచ్చి, గైడ్ చేసింది. వరి సాగులో తెలంగాణ రికార్డు సాధించింది. దిల్లీ వెళ్లి వచ్చాక కెసియార్ మారిపోయారు. సాగు చట్టాలకు జై అన్నారు, సేకరించడం, పంటల గురించి సూచనలివ్వడం జాన్తానై అన్నారు. కేంద్రం యిప్పుడు ఎమ్మెస్పీ కాన్సెప్ట్‌కే సున్నా చుడుతోంది.
ఈ విషయంలో రైతుల భయాలను సరిగ్గా గుర్తించి అమరీందర్ సింగ్ రాష్ట్రప్రభుత్వం ద్వారా అక్టోబరు 20న చట్టాలు చేశాడు. మండీల బయట జరిగే బేరసారాలలో ఎమ్మెస్పీ కంటె తక్కువ ధరకు కొనడానికి వీల్లేదని, అలా కొంటే మూడేళ్ల జైలుశిక్ష వేస్తామనీ చట్టంలో పెట్టాడు. ఇది వరి, గోధుమ విషయంలోనే చెప్పాడు, యితర పంటలకు కూడా విస్తరించాలని రైతులు అడుగుతున్నారు. మండీలపై రాష్ట్రం పన్నులు విధించకూడదని కేంద్ర చట్టం చెపితే, ఆ హక్కు మేం వదులుకోమని పంజాబ్ చట్టం చెప్పింది. రాష్ట్రమంతటినీ ఒకే మండీగా గుర్తించాలని రైతు సంఘాల డిమాండ్. రైతులు కోర్టులకు వెళ్లలేరని కేంద్రం అంటే వెళ్లగలిగే హక్కు యిచ్చింది పంజాబ్ చట్టం. కోర్టుల్లో కాలయాపన అవుతుంది, కన్స్యూమర్ ఫోరమ్స్లా రైతులకు ప్రత్యేక ట్రైబ్యునల్స్ పెట్టి వివాదాలను సత్వరమే పరిష్కరించాలని రైతు సంఘాలు అడుగుతున్నాయి.
రైతు తన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం చట్టం చెపుతూంటే, మా రాష్టంలోకి యితర రాష్ట్రాల నుంచి వచ్చే పంటను నియంత్రించే హక్కు మాకుంటుందని పంజాబ్ చట్టం చెపుతోంది. పరిమితి లేకుండా పంట ధాన్యాలను ఎంత కావాలంటే అంత స్టోర్ చేసుకోవచ్చని కేంద్ర చట్టం చెపుతూంటే, రాష్ట్రంలో ధరవరల బట్టి పరిమితి విధించే హక్కు రాష్ట్రానికి వుంటుంది అని పంజాబ్ చట్టం చెపుతోంది. పంజాబ్ యీ చట్టం చేయగానే యితర కాంగ్రెసు పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కూడా యిలాటివే, కొద్ది తేడాలతో చేశారు. అయితే ఆ యా రాష్ట్ర గవర్నర్లు ఎవరూ యింకా ఆమోదముద్ర వేయలేదు. కేంద్రానికి ఏజంట్లుగా వుండే వారు వేస్తారని ఆశించనూ లేము.
ఈలోగా ఎమ్మెస్పీ విధానంపై ప్రధానంగా ఆధారపడే పంజాబ్ రైతులు రోడ్లెక్కి, రైళ్లు ఆపి ఆందోళన చేస్తున్నారు. దానికి గాను పంజాబ్ ప్రభుత్వాన్ని శిక్షించింది కేంద్రం. ఆందోళన కారణంగా గూడ్సు రైళ్లకు హాని కలుగుతోందంటూ నవంబరు మూడో వారం దాకా ఆపివేసింది. దాంతో బొగ్గు సరఫరా నిల్చిపోయి, రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. రూరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద యివ్వాల్సిన రూ.1100 కోట్లను ఆపేసింది. అదేమంటే గత సీజన్‌కు యిచ్చినదానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యుసి) యివ్వలేదేమంది. ఈ యుసి అంశాన్ని బిజెపి ఎలా వాడుకుంటుందో తెలుగువారందరికీ విదితమే. దీనితో బాటు అమరీందర్ కొడుకుపై 2016 నాటి ఇడి (ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్) కేసు విషయాన్ని అర్జంటుగా బయటకు లాగి అక్టోబరు నెల చివర్లో నోటీసులు యిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య గొడవల మాట ఎలావున్నా, తమ గోడు సంగతేమిటని పంజాబ్ రైతు ఆందోళన చెందుతున్నాడు. అందుకే ఉద్యమంలో ప్రథమ పంక్తిలో నిలబడ్డాడు. ఇప్పుడు వారితో భుజం కలపకపోతే తనను ఛీత్కరిస్తారనే భయం పట్టుకునే సుఖ్బీర్ సింగ్ ఘాజీపూర్ వెళ్లాడు. ఇప్పుడు ఉద్యమం యుపిలో ఉధృతం కావడమే కాదు, హరియాణాకు కూడా పాకింది.
ఆందోళనలను అణచడానికి పోలీసు యంత్రాంగం చాలా కష్టపడుతోంది. వాహనాల కదలికలను నిరోధిస్తోంది. జనాల్ని నడిచి వెళ్లమంటోంది. ఆ యా ప్రాంతాలలో ఇంటర్నెట్ కట్ చేస్తోంది. దానితో వర్క్ ఫ్రమ్ చేసుకునేవాళ్లే కాక, ఆన్లైన్ క్లాసులలో చదువుకునే కుర్రాళ్లు కూడా యిబ్బంది పడుతున్నారు. ఇలా ఎన్నాళ్లో తెలియదు. అక్టోబరు దాకా వుండవచ్చు అంటున్నాడు తికాయత్. ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. మూడో చట్టం గురించి వచ్చే వ్యాసంలో రాస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
[email protected]