శ్యామ్ బెనెగల్ తెలుగులో సినిమా తీశాడా? అంటూ కొందరు ఇతర భాషల వాళ్లు కూడా ఆశ్చర్యపోతారు ఆ సినిమా గురించి ప్రస్తావించినప్పుడు! తెలుగు సినిమా అంటే, ఆరు పాటలు, ఐదు ఫైట్లే కాదురా బాబూ, ఇప్పుడు కాదు.. ఎప్పుడో.. ఇప్పుడొస్తున్న ఇతర భాషల్లో వస్తున్న ప్రయోగాత్మక సినిమాలు, విభిన్న సినిమాలు తీశాం! అయితే మనం ఎంతసేపూ ఘరానామొగుడు, నరసింహనాయుడు అని మాట్లాడుకుంటూ.. మన సినిమా అంటే ఇంతే! అనే భావనను కలగజేయడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూ ఉంటాం!
అలాంటి సినిమాలు విడుదలైన తేదీని గుర్తుపెట్టుకుని.. ప్రతి సంవత్సరంలో అదో అవే సోది చెబుతూ ఉంటాం, కాబట్టి.. సమాంతర సినిమాల రారాజుల్లాంటి వాళ్లు తెలుగులో సినిమాలు చేశారని ప్రత్యేకంగా వారు పోయినప్పుడు అయినా చెప్పుకోవాల్సి వస్తోంది!
1978లోనే శ్యామ్ బెనెగల్ ఒక తెలుగు సినిమాను చేశారు. అదే అనుగ్రహం. వాస్తవానికి అదొక మరాఠీ నవల ఆధారంగా రూపొందిన సినిమా! సమాంతర సినిమాల స్టార్ హీరో స్మితా పాటిల్ నటించిన తెలుగు సినిమా అది. వాణిశ్రీ, కన్నడ నటుడు అనంతనాగ్ లవి విలక్షణ ముఖ్య పాత్రలు. వీరికి తోడు రావుగోపాల రావు తన విలక్షణ విలనిజాన్ని అలవోకగా పండించిన సినిమా. ఆ సినిమా టార్గెట్.. మూఢనమ్మకాలను నిరసించడం. అయితే అది సూటిగా కాదు, సటల్ గా! కథ, కథనం అంతా మిస్టీరియస్ గా సాగుతుంది. క్లైమాక్స్ అయితే.. అది అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత! అర్ధాంతరంగా ముగిసినట్టుగా, అర్థం లేనట్టుగా అనిపిస్తుంది. అయితే అర్థం చేసుకోగలగాలి!
మరాఠ నవల అయినప్పటికీ.. నేటివిటీ సమస్య ఏ మాత్రం ఉండదు. తీర ప్రాంతంలోని ఒక గ్రామం, ఆ ఊర్లో ఒక మోతుబరి రావుగోపాల రావు. స్త్రీ లోలుడు, తనమన తేడా లేకుండా ఆడది దొరికితే అనుభవించాలనే తత్వం. అదే ఊర్లో ఒక బ్రహ్మణ కుటుంబం, సంపదలేని చిన్న కొడుకు అనంతనాగ్(పరశురాముడు). అప్పటికే పెళ్లై ఉంటుంది. అయినా ఇంట్లో గొడవపడి.. ఇళ్లొదిలి వెళ్లిపోతానంటూ మంకుపట్టుతో ఊరు దాటగా.. ఆ ప్రాంతంలో తిరుగుతుంటాడనే అప్పకొండ స్వామి కనిపిస్తాడు. స్థానికుల నమ్మకం ప్రకారం అతడో మాయమంత్రాలు తెరిసిన అఘోరా తరహా స్వామి. సముద్రతీరంలో అప్పకొండ స్వామి ఇతడికి కనిపించి.. ఒక ఎండు కొమ్మ ఇస్తాడు. దాన్ని అరగదీసి గర్భిణికి తాగిస్తే కడుపులో బిడ్డ అంతమవుతాడని, రాబోయే కాలంలో పాపాన్ని నశింపజేయడానికి అది అవసరం అని, దాన్ని వాడగలిగినవాడికి నువ్వేనంటూ ఆ బ్రహ్మణుడికి అప్పకొండ స్వామి చెప్పి కొమ్మ ఇచ్చి, అంతర్థానం అవుతాడు!
దాన్ని పట్టుకుని ఊర్లోకి వస్తాడతను. తనకు అప్పకొండ స్వామి కనిపించాడని, బ్రహ్మచర్యం పాటించమన్నాడని, ఈ పరీక్షను తను ఎదుర్కొటానంటాడు. ఇంట్లో వాళ్లూ నమ్ముతారు. అక్కడి నుంచి పరశురాముడి జీవితంలో చిత్రవిచిత్రాలు జరుగుతాయి. అర్ధరాత్రి గంటల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అతడి భార్యకు అమ్మవారు పూనుతుంది. ఒక రోజు ఆమె జమీందారు ఇంటికి వెళితే.. అతడు ఆమెను అనుభవించే తాపత్రయాన్ని కనబరుస్తాడు! అది ఆమె మనసులో ఉండిపోతుంది.
జమీందారుకు పిల్లలు లేరు. అతడి అన్న కొడుకు ఉంటాడు, అతడు మూగ, వికలాంగుడు. అయినా పెళ్లై ఉంటుంది. అతడి భార్య పాత్రలో స్మితా పాటిల్ కనిపిస్తుంది. వికలాంగుడు అయిన అతడికి లైంగిక పటుత్వం ఉంటుందా అనేది అందరికీ అనుమానం! ఆ పరిస్థితుల్లో అతడి భార్య గర్భవతి అవుతుంది. ఆమె విపరీత కామకోరికలతో సతమతం అవుతున్నట్టుగా పరశురాముడికి కల వస్తూ ఉంటుంది!
ఊర్లో దేవాలయాన్ని బాగు చేయమని దేవుడు చెప్పినట్టుగా అతడికి మరో కల వస్తుంది. వెళ్లి జమీందారును కలిస్తే.. మరో మాట లేకుండా జమీందారు డబ్బులు ఏర్పాటు చేస్తాడు! తను ఎలాంటి వాడైనా.. పరశురాముడిపై జమీందారు విపరీతమైన భక్తిని చూపిస్తాడు!
జమీందారు ఇంటి కోడలు గర్భవతి అయిన విషయం తెలిసి.. అప్పకొండ స్వామి ఇచ్చిన కొమ్మ ఎందుకో బ్రహ్మణుడికి బోధపడుతుంది. అప్పటికే భార్య జమీందారు కామదాహం గురించి అమ్మవారు పూనినప్పుడు సూఛాయగా చెప్పి ఉంటుంది. దీంతో.. జమీందారు తన కోడలికి గర్భం చేశాడని, ఆ గర్భాన్ని విచ్ఛిన్నం చేయాలని హీరో అనుకుంటాడు. ఆ పని చేస్తాడు!
అయితే.. అసలు కథ చివర్లో అతడికి అర్థం అవుతుంది! జమీందారు తన పశుప్రవృత్తిలోని మరో కోణాన్ని చివర్లో చూపిస్తాడు. తనకు పిల్లలు లేరని, అసలు పుట్టరని.. తను ఎలా తన కోడలికి గర్భం చేయగలనని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి తన అన్న కొడుకే అని వికట్టాహసం చేస్తాడు! తన అన్న కొడుకుకు పిల్లలు పుడితే వారిని ఎత్తుకుని ఊరేగి, ఆస్తులు రాసిచ్చే ఉద్దేశం తనకు లేక..తను కాగల కార్యం గంధర్వులతో పూర్తి చేశానంటూ అప్పటి వరకూ తనే దేవుడిగా భావించేసుకున్న పరశురాముడికి షాకిస్తాడు!
ఆ నిస్పృహ, నిస్తేజాల మధ్యన ఇంటికి వెళ్లి.. భార్యపై కామకోరికను తీర్చుకుంటాడు. అందుకు నిరాకరిస్తూనే లొంగిపోయిన ఆమె, అప్పటి వరకూ మొగుడిపై అందరికీ ఉన్న గౌరవాన్ని తను మంటగలిపాననే భావనతో వెళ్లి ఆత్మహత్య చేసుకుంటుంది. భార్య మరణంతో.. అతడికి ట్రాన్స్ వీడుతుంది! అప్పకొండస్వామి.. అంటూ మళ్లీ కనిపించని ఆ స్వామీజీని వెదుక్కొంటూ, అరుస్తూ అతడు పరిగెత్తడంతో సినిమా ముగుస్తుంది!
ఈ సినిమా విషయంలో చాలా మంది క్లైమాక్స్ ఏంటో అర్థంగాక బుర్ర గోక్కొంటారు! అయితే.. సింపుల్ గా చూస్తే.. అప్పకొండస్వామి అతడికి కనిపించి, గర్భవిఛ్ఛితి వేరు ఇచ్చి, పాపాన్ని నాశనం చేయమనడం అనే దగ్గరే సినిమా మొదలవుతుంది కాబట్టి.. ఆ అప్పకొండ స్వామి అనే పాత్రే జమీందారు సృష్టి. స్థానికంగా ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఒక పేద బ్రహ్మణుడిని వాడుకుని అందరినీ తన ఆటలో పావులుగా చేసి, తను అనుకున్నది సాధించాడు. బాబాలు, స్వామీజీలు, మూఢనమ్మకాలు, మనోభ్రాంతిలు.. ఎంత ప్రమాదకరమైనవో ఆర్టిస్టిక్ గా చూపించిన సినిమా అనుగ్రహం.
సందేశం సంగతలా ఉంచితే.. వాణిశ్రీ, అనంతనాగ్, స్మితా పాటిల్, రావుగోపాలరావు వంటి నటుల కోసం, గోవింద్ నిహాలనీ కెమెరా వర్క్ కోసం, శ్యామ్ బెనెగల్ టేకింగ్ కోసం.. తప్పక చూడాల్సిన సినిమా! ఈ సినిమాను హిందీలో కూడా సమాంతరంగా రూపొందించారు తెలుగు వెర్షన్ తో పాటు. తెలుగులో రావుగోపాలరావు చేసిన పాత్రను హిందీలో అమ్రిష్ పురి చేసినట్టుగా ఉన్నారు. తెలుగు వెర్షన్ లో ఆయన అప్పకొండస్వామి పాత్రలో ఒక సీన్లో కనిపిస్తారు. గుర్తు పట్టడం కూడా కష్టం. హిందీ వెర్షన్ లో ఇంకో క్లూ కూడా ఉంది. జమీందార్ పాత్రలో కనిపించే అమ్రిష్ పురినే, అప్పకొండస్వామి పాత్రలో కూడా కనిపిస్తాడు. అంటే జమీందారే వేషం గట్టి.. పరశురాముడికి ఆ మూలిక కొమ్మను ఇచ్చాడనే క్లూ హిందీ వెర్షన్ లో ఉంటుంది. తెలుగులో ఆ గుబురు మీసాలు, గడ్డాల వ్యక్తి, జమీందారు పాత్రలను వేర్వేరు నటులు చేయడం వల్ల కూడా క్లైమాక్స్ అర్థం కావడం లేదనే ఫిర్యాదుకు కారణం!
ఆశ్చర్యం…ఇటువంటి ఆర్ట్ ఫిలిమ్ రివ్యూ కూడా రాస్తారా? బాగుంది.
Worst movie
దర్శకత్వంలో గొప్ప అనుదగ్గ వారు సినిమా తీసిన అంత మాత్రాన ప్రతి సినిమా కూడా గొప్పగా ఉంటాదనేది కాదు.
అందుకు మరొక ముఖ్యమైన ఉదాహరణ రాంగోపాల్ వర్మ కూడా 😂.
Samantha kuda art films chesthe hits vasthai