కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, సామాజిక కార్యకర్త పరకాల ప్రభాకర్ ఘాటు కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై పరకాల ప్రభాకర్ తరచూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ మరోసారి పరకాల విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, దేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
“దేశం అత్యంత సంక్షోభంలో వుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మతం మత్తులో దేశం ఊగిపోతోంది. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కేంద్రంలో ఒక్క ముస్లిం మంత్రిలేడు. యూపీలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు. చైనా చొరబడినా, శవాలు గంగానదిలో తేలినా పట్టింపు లేదు. మతం ముసుగులో దేశం కొట్టుమిట్టాడుతోంది. ఎంత మంది వలస కార్మికులు చనిపోయారో లెక్కలున్నాయా? పౌష్టికాహారం లోపంతో 25 శాతం మంది బలహీనమైపోతున్నారు”
కేంద్ర ప్రభుత్వంపై తన అక్కసు అంతా ఆయన వెళ్లగక్కారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ సర్వనాశనమవుతోందని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, అలాగే బీజేపీ ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకం అనే సంకేతాల్ని ఆయన ఇచ్చారు. మతం ముసుగులో దేశం కొట్టుమిట్టాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరీ ముఖ్యంగా తన భార్య బాధ్యత వహిస్తున్న ఆర్థిక వ్యవస్థపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయిందని, దేశం అత్యంత సంక్షోభంలో వుందని విమర్శలు సంధించడం చిన్న విషయం కాదు. మరి పరకాల సంచలన కామెంట్స్‌పై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.