మొహం చూస్తే ఎన్టీఆర్ అని తెలిసిపోతోంది.. వేషం చూస్తే కృష్ణుడే అని అర్థమవుతోంది.. మరి నెత్తిమీద నెమలిపింఛమేదీ? చేతిలో ఈ కత్తి ధరించిన పైత్యమేమిటి? అని విస్తుపోతున్నారా? మీరు ఆశ్చర్యపోవడం కరక్టే. ఈ పైత్యం పువ్వాడ అజయ్ కుమార్ అనే తెలంగాణ మంత్రి తన చేసిన ఒక వక్రప్రయత్నం ఫలితంగా ఏర్పడింది. పాపం కృష్ణుడు (లేదా, పాపం ఎన్టీఆర్ అని కూడా అనుకోండి) ఈ స్వార్థ రాజకీయ నేతల చేతుల్లో పడి రకరకాలుగా వక్రరూపాలు పట్టిపోతున్నాడు.
ఖమ్మం సమీపంలోని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని ఆ జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా అమెరికాలోని తెలుగువారి సంస్థ తానా ఆర్థిక సహాయం కూడా ఏర్పాటుచేసుకున్నారు.
కాకపోతే సదరు ఎన్టీఆర్ విగ్రహాన్ని.. కృష్ణుడి గెటప్ సినిమా వేషంలో ఉన్న రీతిగా పెట్టాలనుకోవడంతో సమస్య వచ్చింది.
కృష్ణుడిరూపంలో ఉన్న విగ్రహాన్ని పెట్టడం పట్ల యాదవ సంఘాలు అభ్యంతరాలు తెలియజేస్తూ కోర్టుకు వెళ్లాయి. నిజానికి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మే28న విగ్రహావిష్కరణ అనుకోగా, కోర్టు స్టేతో ఆగిపోయింది. కోర్టు స్టే దెబ్బకు విగ్రహంలో మార్పులు చేయించారు.
కృష్ణుడి కిరీటంలోంచి నెమలిపింఛం తీసేయించారు. చేతిలో పట్టుకున్న పిల్లనగ్రోవి స్థానంలో.. ఓ కత్తిని తయారుచేయించి పెట్టారు. తీరా ఆ విగ్రహం ఎలా తయారైనదంటే.. ‘అయ్యవారిని గీయబోతే.. ఏదో తయారైందన్న’ సామెత లాగా అయిపోయింది.
చూడడానికి ఎన్టీఆర్ లాగా అనిపిస్తుంది. కృష్ణుడి వేషం అని కూడా భ్రమ కలుగుతుంది. కాస్త పరిశీలనగా చూడగానే.. ‘ఎహె.. ఎన్టీవోడు ఇలా కత్తి పట్టుకున్న వేషం ఎప్పుడేశాడెహె’ అని చిరాకు పుడుతుంది.
‘జోహారు శిఖి పింఛ మౌళీ’ అనే పాట చిన్నబోయేలాగా.. సిగలో నెమలి పింఛములేని కృష్ణుడు చికాకు కలిగిస్తాడు.
‘కరతలే వేణుం..’ అంటూ సాగిపోయే పద్యం ఉడికిపోయే లాగా.. చేతిలో వేణువును పక్కన గిరాటేసి కత్తి పట్టుకున్న కృష్ణుడిలాగా అవతారం దారుణంగా ఉంటుంది. పాపం.. ‘ఆయుధమున్ ధరింప..’ అంటూ తన వ్యక్తిత్వాన్ని తాను సౌమ్యంగా అభివర్ణించుకున్న కృష్ణుడి స్ఫూర్తిని గొడ్డలి వేటుతో నరికేసినట్టుగా ఈ భారీ విగ్రహం తయారైంది.
ఎందుకింత కక్కుర్తి..
నాయకుల్లో రాజకీయ కక్కుర్తి ఈ విగ్రహ రూపకల్పనకు అసలు కారణం అనే వార్తలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కమ్మవారి ప్రాబల్యం ఎక్కువ. తనను తాను కమ్యూనిస్టు మూలాలున్న గొప్ప నాయకుడిగా భావించుకునే పువ్వాడ అజయ్ కుమార్ అయినా సరే.. కులపునాదుల మీద నెగ్గాలని కోరుకునే వ్యక్తే. అందుకే ఖమ్మం జిల్లాలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుని కమ్మ ఓటు బ్యాంకులో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలని అనుకున్నారు.
నాయకుడిగా ఎన్టీఆర్ బ్రాండెడ్ పోజు లోనే విగ్రహం చేయించవచ్చు. కానీ.. ఆ పోజు తెలుగుదేశం సొంతం చేసుకుంది గనుక.. కృష్ణుడి గెటప్ లో రెడీ చేయించారు.
కృష్ణుడు అంటేనే ఎన్టీఆర్ అనిపించేలా.. ఈ విగ్రహ ఏర్పాటు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదంటూ యాదవ సంఘాలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇచ్చింది. దరిమిలా.. విగ్రహానికి మార్పులు చేసి.. ఇలా భ్రష్టు పట్టించారు.