తమిళ సినిమా నటీనటులకు, హీరోహీరోయిన్లకు రాజకీయాల పట్ల మోజు పెరిగిపోతోంది. మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా. దీంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని నటీనటులు తెగ ఆరాటపడుతున్నారు. తమిళనాడులో సినిమా రంగానికి రాజకీయాలకు బలమైన బంధం ఉన్న సంగతి తెలిసిందే కదా. తెలుగులోనూ సినిమా తారలకు రాజకీయాలపై మోజు ఉన్నా తమిళనాడులో ఉన్నంత ఉధృతంగా లేదు.
ఎక్కువమంది పార్టీలకు మద్దతుదారులుగా ఉంటారు తప్ప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపరు. అంతంతమాత్రం తారలకు పార్టీలు కూడా అవకాశాలు ఇవ్వవు. సినీ తారలు మద్దతు ఇచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చినట్లైతే అదృష్టం ఉన్న సినీ తారలకు నామినేటెడ్ పదవులు వస్తాయి. ఇక అసలు విషయానికి వస్తే త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తారలు చాలామంది పోటీపడుతున్నట్లు కనబడుతోంది.
తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన రాధికా శరత్ కుమార్ ఎన్నికల బరిలో దిగబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త శరత్‌కుమార్ ప్రకటించాడు. సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) అనే పార్టీని శరత్‌కుమార్ స్థాపించాడు కదా. ఆ పార్టీకి మహిళా విభాగం ఇన్చార్జ్గా రాధిక వ్యవహరిస్తోంది. 2011 నుంచి ఎస్ఎంకే పార్టీ అన్నాడీఎంకేతో కలిసి నడుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో కలిసే పోటీకి దిగుతున్నట్లు శరత్‌కుమార్ ప్రకటించాడు. అయితే.. ఈసారి పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు ఆశిస్తున్నామని, ప్రత్యేక చిహ్నంపై పోటీ చేస్తామని శరత్‌కుమార్ చెప్పాడు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా శరత్‌కుమార్ పార్టీ పోటీ చేసింది. ఆ సమయంలో.. తెంకాసి నియోజకవర్గం నుంచి శరత్‌కుమార్, నంగునేరి స్థానం నుంచి ఎ.నారాయణన్ ఎమ్మెల్యేలుగా గెలిచారు.
వచ్చే ఎన్నికల్లో తన భార్య రాధికను ఎన్నికల్లో పోటీకి నిలపాలని శరత్‌కుమార్ భావిస్తున్నట్లు ఆయన తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో చూడాలి. శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి పలు సినిమాలతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఇటీవల.. రవితేజ హీరోగా నటించిన 'క్రాక్' చిత్రంలో ఆమె పోషించిన జయమ్మ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తల్లి ఎన్నికల బరిలో నిలిస్తే వరలక్ష్మి కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశముంది. ఇప్పటికే డీఎంకేలో స్టాలిన్ తరపున ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు.మొత్తం మీద ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సినీ గ్లామర్ పెరిగే అవకాశముంది.
సినీ నటుడు కమల్‌హాసన్ కూడా ఇప్పటికే పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాడు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నాడు . ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నాడు. సినీ నటుడు రజనీకాంత్ మినహాయిస్తే తమిళనాడులో చాలామంది సినీ నటులు ఈసారి ఎన్నికల ప్రచారంలో భాగం కాబోతున్నారు.