తన 19వ యేటే అందరి దృష్టినీ ఆకర్షించాడు అంబటి తిరుపతి రాయుడు. సరిగ్గా ఇరవై యేళ్ల కిందట రాయుడు పేరు గట్టిగా వినిపించింది. రాయుడు ఆడుతున్నాడంటే అది రంజీ మ్యాచ్ అయినా అప్పట్లో దానిపై అందరి దృష్టీ ఉండేది. రాయుడు ఎన్ని పరుగులు చేశాడు, చేస్తాడు, ఎలా ఆడుతున్నాడనే చర్చ ఆ టీనేజర్ విషయంలో జరిగింది! 2003 ప్రపంచకప్ ముందే రాయుడు విషయంలో భారత క్రికెట్ ఫ్యాన్స్ కు అంచనాలను ఏర్పరిచారు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు.
ప్రత్యేకించి టీమిండియా క్రికెట్ జట్టు ఒకప్పటి మేనేజర్ మాన్ సింగ్ అప్పట్లో రాయుడును గొప్ప క్రికెట్ స్కిల్స్ కలిగి ఉన్నా బ్యాట్స్ మన్ అని కితాబిచ్చారు. 2003 ప్రపంచకప్ జట్టులోనే రాయుడు స్థానం దక్కుతుందా! అనేంత స్థాయిలో చర్చ జరిగింది. అప్పటికి టీనేజర్ అయిన రాయుడుకు పార్థివ్ పటేల్ తరహాలో అవకాశం దక్కి ఉంటే అతడి కెరీర్ ఏ స్థాయికి చేరేదో కానీ, టీనేజ్ లోనే తనపై అంచనాలను ఏర్పరుచుకున్న రాయుడు జాతీయ జట్టులోకి రావడం మాత్రం అప్పట్లో జరగలేదు!
పెద్దగా రంజీ నేపథ్యం లేని ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ రాయుడుకు మాత్రం ఆదిలోనే మొండి చేయి చూపింది. 1999 నుంచి 2003 మధ్యన యంగ్ క్రికెటర్లకు విపరీతంగా అవకాశాలు దక్కాయి! రంజీల్లో రాణించిన నేపథ్యం ఏమీ లేకపోయినా.. యువరాజ్ సింగ్, హర్బజన్, కైఫ్, పార్థీవ్ పటేల్.. ఇలా కనీసం పది మంది యువకులకు అప్పుడు అవకాశాలు లభించాయి. అయితే ఈ జాబితాలో రాయుడు పేరు ఎందుకో రాలేదు! ఎందుకు.. అంటే సగటు క్రికెట్ అభిమానికి అందుకు సమాధానం చిక్కదంతే!
దానికి కారణం రాజకీయాలు అని చాలా మందే అంటారు. రాయుడు ప్రతిభకు టీనేజ్ లోనే ప్రశంసలు లభించాయి. మరి జాతీయ జట్టులో స్థానం వరకే అయితే అది చాలు. అయితే అంతకు మించి రాజకీయాలు ఆట ఆడాయంటారు. 2003 ప్రపంచకప్ ముందు రాయుడు గురించి విపరీతంగా చర్చ జరిగినా, గ్రేగ్ చాపెల్ టీమిండియా కోచ్ గా వచ్చాకా.. మరింత మంది యంగ్ క్రికెటర్లకు వరస పెట్టి అవకాశాలు లభించినా, ఆ జాబితాలో రాయుడు లేడు. కొన్ని రోజులకు రాయుడును అంతా మరిచిపోయారు. ఆ సమయంలో ఒక రంజీ మ్యాచ్ సందర్భంగా గొడవతో రాయుడు పేరు మార్మోగింది.
అప్పట్లో హైదరాబాద్ క్రికెట్ ను శాసిస్తున్న శివలాల్ యాదవ్ తనయుడు అర్జున్ యాదవ్ తో రాయుడుతో ఒక మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవ స్పోర్ట్స్ పేజీల్లో పతాక శీర్షికల్లో వచ్చింది. ఆ వెంటనే రాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అది ఐసీఎల్ లో చేరడం. 2006-07 సమయంలో ఇండియన్ క్రికెట్ లీగ్ పెద్ద దుమారం రేపింది. జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ఆ లీగ్ ను ప్రారంభించాడు. బోలెడంతమంది యువ క్రికెటర్లతో, అంతర్జాతీయ మాజీలతో ఒప్పందాలను కుదుర్చుకుని మ్యాచ్ లు ఆడించాడు.
సుభాష్ చంద్రతో ఒప్పందాలు పెట్టుకున్న ఆటగాళ్లపై బీసీసీఐ నిషేధం విధించింది. అతడికి స్టేడియంలను బీసీసీఐ ఇవ్వలేదు. అయితే రైల్వే స్టేడియంలు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల స్టేడియంలతో ఐసీఎల్ మ్యాచ్ లు జరిగాయి. మొదట్లో అవి హిట్ అయ్యాయి. బీసీసీఐ నష్ట నివారణ చర్యలను మొదలుపెట్టింది. అంతలోనే ఐపీఎల్ ను మొదలుపెట్టింది. ఆ పై ఐసీఎల్ ఆటగాళ్లపై కోచ్ లపై నిషేధం ఎత్తేసింది. వారికి జాతీయ జట్టు, ఐపీఎల్ లలో అవకాశం ఇచ్చింది. దీంతో రాయుడుకు మరో ఛాన్స్ లభించింది.
ఐపీఎల్ లో అవకాశాలతో రాయుడు సత్తా చూపించాడు. ఆ తర్వాత జాతీయ జట్టులో అవకాశం లభించింది. కెరీర్ మంచి దశలో ఉండగా 2019 ప్రపంచకప్ లో రాయుడుకు స్థానం దక్కకపోవడం పై పెద్ద దుమారం రేగింది. వాస్తవానికి ఆ ప్రపంచకప్ లో టీమిండియా కు నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే ఆటగాడి అవసరం చాలానే ఉండింది.
ఓపెనర్లు, వన్ డౌన్ లో విరాట్ కొహ్లీ కుదురుగా ఉన్నా, ఐదో స్థానం, ఆరో స్థానం విషయంలో కూడా ఆటగాళ్లున్నా, నాలుగో వికెట్ బ్యాట్స్ మన్ లోటు మాత్రం టీమిండియాను ఆ ప్రపంచకప్ లో ఇబ్బంది పెట్టింది. 2003 ప్రపంచకప్ లో లక్ష్మణ్ స్థానం దక్కకపోవడం, 2019లో రాయుడుకు ఛాన్స్ దక్కకపోవడం రెండూ ఒకే తరహా అంశాలు.
మొత్తానికి అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికిన రాయుడు ఇప్పుడు రాజకీయాల మీద దృష్టి సారించాడు. గుంటూరు లేదా మచిలీపట్నం ఎంపీ సీట్లలో ఏదో ఒక దాంట్లో ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారు లాగుంది. మరి దూకుడైన తీరుకు, అదే సమయంలో కష్టపడే తత్వానికి చిరునామా అయిన రాయుడు రాజకీయంగా ఏ స్థాయి రాణిస్తాడనేది ప్రస్తుతానికి శేష ప్రశ్న!