ఏ రోటికాడ ఆ పాట పాడడం రాజకీయ నాయకులకు కొత్త విషయం ఎంత మాత్రమూ కాదు. వారి సహజమైన శైలి అది. కానీ.. అందులో కూడా కొంచెం మితం ఉంటుంది. పూర్తి కాంట్రడిక్షన్ గా మాట్లాడితే జనం నవ్వుకుంటారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పరిస్థితి అలాగే తయారవుతోంది.
జనసేనాని శుక్రవారం నాడు తనను చాలా దారుణంగా ఓడించిన భీమవరం నియోజకవర్గంలో బహిరంగసభ పెట్టి మాట్లాడారు. తన ఓటమి గురించి మాట్లాడుతూ ‘‘భీమవరంలో ఓడిపోయినా నేను పట్టించుకోలేదు. మనకు ఓటమి గెలుపు ఉండవు.. ప్రయాణమే ఉంటుంది..’’ అంటూ త్రివిక్రమ్ మార్కు సినిమా డైలాగులు చెప్పారు.
ప్రయాణం మాత్రమే ఉంటుంది.. ఓటమి గెలుపులను పట్టించుకోవద్దు అనుకునే నాయకుడే అయితే.. ఈ నాలుగేళ్లుగా ఆయన తనను ఓడించిన భీమవరానికి ఏం చేశారు? ఆ భీమవరం గురించి ఏం పట్టించుకున్నారు. ఇప్పుడు తన వారాహి యాత్ర రూట్లో వస్తుంది గనుక.. కాపు ఓటు బ్యాంకు చాలా పుష్కలంగా ఉన్నది గనుక.. కాపులంతా పోలరైజ్ అవుతున్నారు.. ఈసారి అక్కడినుంచి పార్టీ అభ్యర్థిని గెలుపు ఆశతో బరిలోకి దించవచ్చుననే ఆశ ఉన్నది గనుక.. ఆయన భీమవరంలో సభ పెట్టారు.
భీమవరంలో సభ పెట్టకుండా వారాహి యాత్ర ముందుకు వెళ్లిపోతే.. జనం అనుమానిస్తారు గనుక మాత్రమే అక్కడ సభ పెట్టారు. అలాంటప్పుడు.. తాను గెలుపు ఓటములను పట్టించుకోను అని ప్రయాణమే ఉంటుందని డైలాగులు వేయడం ఎందుకు?
ఇదే పవన్ కల్యాణ్ ఇదే వారాహి యాత్ర తొలిరోజుల్లో.. గాజువాకలో తనను గెలిపించి ఉంటే గనుక.. విశాఖలో వైసీపీ నాయకుల అరాచకాలు అన్నీ అడ్డుకుని ఉండేవాడినని స్పష్టంగా చెప్పారు. తద్వారా నన్ను గెలిపించలేదు గనుక.. మీ చావు మీరు చావండి- అని సంకేతాలు ఇచ్చారు. నన్ను గెలిపించకపోతే గనుక.. మీ గురించి పట్టించుకోను అని ఆయన విశదంగానే చెబుతున్నారు.
మళ్లీ, ఇదే వారాహి యాత్రలో గాజువాక, భీమవరంలలో ఓడిపోయినందుకు తాను చాలా బాధ పడ్డానని, కుమిలిపోయానని ఆయన చెప్పుకొచ్చారు. తన బేలతనం మొత్తం బయటపెట్టుకున్నారు. అది తప్పేం కాదు. ఓడిపోతే బాధ పడలేదు అనడమే అబద్ధం అవుతుంది. అయితే ఇప్పుడు మళ్లీ భీమవరం వచ్చేసరికి ఓటమి గెలుపులు పట్టించుకోను ప్రయాణమే పట్టించుకుంటాను.. అనే సన్నాయినొక్కులు ఎందుకు?
ఒకే యాత్రలో కేవలం ఒకటిరెండు రోజుల వ్యవధిలో ఇన్ని రకాల కాంట్రడిక్షన్స్ తో మాట్లాడే నాయకుడు.. ఏ రకంగా ప్రజలను చక్కగా పరిపాలించగలడు.. అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.