ఊహించినట్టే జరిగింది. వైసీపీలో అసంతృప్తి భగ్గుమంది. ఎప్పుడైతే జగన్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించడానికి కసరత్తు ప్రారంభించారో, అప్పుడే అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆఖరి నిమిషంలో ఏదైనా జరగొచ్చనే ఆశతో అంతా ఎదురుచూశారు. చివరాఖరి ఆశలు కూడా అడుగంటడంతో ఒక్కసారిగా అసంతృప్తి పెల్లుబికింది. వైసీపీలో ఈ స్థాయిలో అసంతృప్తి బయటకురావడం ఇదే తొలిసారి.
మంత్రివర్గంలో కొత్తగా 14 మంది ఎమ్మెల్యేలు చేరితే.. వైసీపీలో కొత్తగా 11 మంది రెబల్స్ తయారయ్యారు. ఓవైపు మంత్రులుగా ఎంపికైన ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు 11 మంది ఎమ్మెల్యేలు తమ కోపాన్ని ప్రదర్శించారు. నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇటు సంబరాలు, అటు నిరసనలు.. రెండూ వైసీపీ పార్టీలోనే జరుగుతున్నాయి.
ఈరోజే ప్రమాణ స్వీకారం…
మంత్రి పదవి కోసం ఎన్నో పూజలు చేసిన రోజా, ఎంతోకాలం ఎదురుచూసిన అంబటి రాంబాబు లాంటి వాళ్లు కేబినెట్ లో చేరారు. కాకాని, విడదల రజనీ లాంటి వాళ్లు ఊహించినట్టే పదవులు అందుకున్నారు. బొత్స, విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, బుగ్గన, పెద్దిరెడ్డి, నారాయణస్వామి లాంటి 11 మంది తిరిగి తమ మంత్రి పదవుల్ని నిలుపుకున్నారు.
మొత్తంగా 14 మంది కొత్తవారు, మిగతా పాత ముఖాలతో.. మొత్తంగా 25 మంది ఈరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
ఈరోజే కీలక పరిణామాలు, నిరసనలు
ఓవైపు ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా, మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు తమ నిరసనల్ని రెట్టింపు చేశారు. ఈరోజు కొంతమంది కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు తన అనుచరులతో సమావేశం అవుతున్నారు. సజ్జల లాబీయింగ్ ఇతని దగ్గర పనిచేయలేదనే చెప్పాలి. తనను కాదని, ఆదిమూలపు సురేష్ ను కేబినెట్ లో కొనసాగించడంపై బాలినేని గుర్రుగా ఉన్నారు.
ఇక మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఆల్రెడీ రాజీనామా సమర్పించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆమె, తన రిజైన్ లెటర్ ను మోపిదేవికి పంపించారు. అటు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం భగ్గుమంటోంది. నిన్నట్నుంచి నిరసనలు కొనసాగిస్తోంది. ఈరోజు పిన్నెల్లి మీడియా ముందుకు రాబోతున్నారు.
జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అనుచరులు, పెనమలూరులో కొలుసు పార్థసారధి అనుచరులు, చోడవరంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అనుచరులు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అటు తిరువూరు, గిద్దలూరు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలు సైతం తమ అసంతృప్తిని కార్యకర్తల ద్వారా బహిర్గతం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే, మింగలేక కక్కలేక కన్నీటి పర్యంతమయ్యారు.
వీళ్లలో ఎంతమంది రివర్స్ అవుతారు?
పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగిల్చిన వీళ్లలో ఎంతమంది రివర్స్ అవుతారనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. మరోవైపు వీళ్లను బుజ్జగించే పనిని సజ్జల ఇప్పటికే మొదలుపెట్టారు. అయితే ఇంతమందిని దారిలోకి తీసుకురావడం సజ్జల వల్ల అవుతుందా అనేది అనుమానమే.
ఇప్పటికే బాలినేని విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో.. ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగితే తప్ప అసమ్మతి చల్లారేలా కనిపించడం లేదు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో కొందరికి, కొన్ని కీలక పదవుల్ని జగన్ ఆఫర్ చేసే అవకాశం ఉంది.
చంద్రబాబుకు అవకాశం ఇచ్చారా?
మొన్నటివరకు వైసీపీ కంచుకోట. రఘురామ లాంటి ఒకరిద్దర్ని మినహాయిస్తే, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసికట్టుగా ఉన్నారు. జగన్ మాట ఒక్కరు కూడా జవదాటలేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రోడ్డుపై కొచ్చి నిరసనలు తెలిపే స్థాయికి వచ్చేసింది వైసీపీ. పార్టీలో ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఉంటుంది.
తమ నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఎమ్మెల్యేకి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సింది పోయి, ఆదికి ముందే ఇలా రోడ్డెక్కి ఆందోళన చేయడం కచ్చితంగా క్రమశిక్షణరాహిత్యం కిందకే వస్తుంది.
పార్టీలో లుకలుకలు ఎప్పుడు ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పుడు ఎమ్మెల్యేల్ని తనవైపు తిప్పుకుందామా అని ఆశగా ఎదురుచూస్తున్న చంద్రబాబుకు.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనేది ఆయాచిత వరంగా మారింది.