ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఈరోజు నూతన మంత్రిమండలి కొలువుదీరబోతోంది. కొత్త-పాత ముఖాల కలబోతతో తయారైన కేబినెట్ లో 25 మంది సభ్యులు.. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2 రోజుల కిందట నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే.. ఉదయం 11 గంటల 31 నిమిషాలకు ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. దీనికోసం సచివాలయం మొదటి బ్లాక్ పక్కన ప్రత్యేకంగా వేదిక సిద్ధం చేశారు.
మంత్రులుగా ఎంపికైన వాళ్లందరికీ ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. వాళ్లంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. తమతమ నియోజకవర్గాల్లో ఉన్న ఈ కొత్త మంత్రులంతా ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలా ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకుంటున్నారు.
2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే, కేబినెట్ బెర్తులపై క్లారిటీ ఇచ్చారు జగన్. మంత్రులంతా రెండున్నరేళ్లలో తమ పదవీ కాలాన్ని ముగించుకుంటారని, ఆ తర్వాత కొత్త మంత్రులు వస్తారని చెప్పారు. చెప్పినట్టుగానే 34 నెలల అనంతరం మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు.
అయితే పూర్తిగా కేబినెట్ ను మార్చేస్తారని చాలామంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. 11 మంది పాతవాళ్లను జగన్ తిరిగి మంత్రుల్ని చేశారు. ఇది మాత్రం ఎమ్మెల్యేలకు ఊహించని ట్విస్ట్. ఎందుకంటే, మహా అయితే ఇద్దరు ముగ్గురు మాత్రమే పాత వాళ్ల ఉంటారని, గరిష్టంగా 5కి మించి ఉండరని అంతా అనుకున్నారు. కానీ జగన్ మాత్రం చాలామందిని తిరిగి రిపీట్ చేశారు. దీంతో మంత్రి పదవులు ఆశించిన కొంతమందికి భంగపాటు తప్పలేదు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత గవర్నర్, ముఖ్యమంత్రులతో మంత్రులంతా గ్రూప్ ఫొటో దిగుతారు. ఆ తర్వాత తేనేటి విందు ఉంటుంది.
కొత్త మంత్రుల్లో ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై రేపటికి పూర్తి క్లారిటీ వస్తుంది. బొత్స, బుగ్గన లాంటి వాళ్లు తిరిగి తమ పాత శాఖలనే పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొందరికి మాత్రం శాఖలు మారబోతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో మంత్రులంతా తమ శాఖల్లో బాధ్యతలు స్వీకరిస్తారు.