పీఆర్‌సీ తగ్గించినా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే కారణమని ఉద్యోగుల విమర్శలు. తాజాగా మంత్రివర్గంలో తమ నాయకులకు చోటు దక్కకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డే కారణమని వైసీపీ శ్రేణుల తిట్ల పురాణాలు. ఇంతకూ సజ్జలకు అంత సీన్ వుందా? అంటే… ముమ్మాటికీ లేదని చెబుతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇతరుల సలహాలు స్వీకరించి నిర్ణయాలు తీసుకుంటారనేది కేవలం ఒక భ్రమే అని అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ హోంమంత్రి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులకు మంత్రి పదవులు రాకపోవడానికి సీఎం జగన్ కంటే, సజ్జల రామకృష్ణారెడ్డే కారణమని వారి అనుచరులు ఆరోపణలకు దిగడం చర్చనీయాంశమైంది. సజ్జలకు వ్యతిరేకంగా ఆశావహ ఎమ్మెల్యేల అనుచరులు ఆందోళనలకు దిగడం, వివిధ రూపాల్లో నిరసనలకు దిగడం వైసీపీలో అసంతృప్తులను తెలియజేస్తోంది.
అయితే ఎమ్మెల్యేల అనుచరులెవరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం లేదు. కొత్త కేబినెట్ కూర్పు నేపథ్యంలో ఒకసారి సీఎంను కలిసి మాట్లాడాలని సుచరిత కోరినా, సజ్జల అంగీకరించలేదని ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సీఎం సమీప బంధువు అలకబూనితే సర్ది చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డి పదేపదే వెళుతున్నారని, తమ నాయకురాలి విషయంలో పట్టించుకోకపోవడం దేనికి నిదర్శనమని సుచరిత అనుచరులు నిలదీస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీఎం జగన్ మాత్రం ఎంతో మంచి నాయకుడని, ఆయనకు సలహాలిచ్చే సజ్జల రామకృష్ణారెడ్డే తప్పుదారి పట్టిస్తున్నారని ఏపీ సమాజంలోని వివిధ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఇందులో నిజానిజాలు సీఎం, సజ్జలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే సజ్జలకు సలహాదారు పదవి అలంకారం మాత్రమే. నిర్ణయాలన్నీ జగనే తీసుకుంటారనేది నిజం.
ముఖ్యమంత్రికి సజ్జల సలహాలిస్తారనే మాట పెద్ద కామెడీ. ఉద్యోగుల విషయమైనా, తాజాగా మంత్రి వర్గ కూర్పునకు సంబంధించి వివరాలు వెల్లడించే వరకూ… అంతా జగన్ చెప్పినట్టే సజ్జల పాటించారు. జగన్‌ను తిడితే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సీటుకు ఇబ్బంది వస్తుందని భావించి, తమ అసంతృప్తులను సజ్జలపై వెళ్లగక్కుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.